త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Gemini Omni | గూగుల్ జెమినీ ఒమ్నీ భారత్‌లో.. వీడియో ఎడిటింగ్ ఇక చాట్‌తోనే..

Google Gemini Omni | గూగుల్ తన తాజా ఏఐ ఆధారిత వీడియో క్రియేషన్, ఎడిటింగ్ టూల్ జెమినీ ఒమ్నీ సేవలను భారత్‌కు విస్తరించింది. ఇకపై భారతీయ వినియోగదారులు జెమినీ ఒమ్నీ ద్వారా నేరుగా వీడియోలను అప్‌లోడ్ చేసి, సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో వాటిని ఎడిట్ చేయవచ్చ‌ని కంపెనీ ప్రకటించింది.

S

Technology | Published On May 30, 2026, 5.44 pm IST

Google Gemini Omni | గూగుల్ జెమినీ ఒమ్నీ భారత్‌లో.. వీడియో ఎడిటింగ్ ఇక చాట్‌తోనే..
Advertisement

Google Gemini Omni | గూగుల్ తన తాజా ఏఐ ఆధారిత వీడియో క్రియేషన్, ఎడిటింగ్ టూల్ జెమినీ ఒమ్నీ సేవలను భారత్‌కు విస్తరించింది. ఇకపై భారతీయ వినియోగదారులు జెమినీ ఒమ్నీ ద్వారా నేరుగా వీడియోలను అప్‌లోడ్ చేసి, సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో వాటిని ఎడిట్ చేయవచ్చ‌ని కంపెనీ ప్రకటించింది. ఎక్స్‌లో పెట్టిన పోస్టులో గూగుల్ ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త ఫీచర్‌తో వినియోగదారులు సాంప్రదాయ వీడియో ఎడిటింగ్ యాప్‌ల అవసరం లేకుండానే వీడియో సన్నివేశాలను మార్చడం, వివిధ విజువల్ ఎఫెక్ట్‌లను జోడించడం, కొత్త అంశాలను చేర్చడం లేదా ఇప్పటికే ఉన్న క్లిప్‌లను మెరుగుపరచడం చేయవ‌చ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం జెమినీ యాప్‌తోపాటు జెమినీ వెబ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోని వినియోగదారులు ఇప్పుడు జెమినీ ఒమ్నీతో నేరుగా వీడియోలను అప్‌లోడ్ చేసి ఎడిట్ చేయవచ్చు. వీడియోను అప్‌లోడ్ చేసి, కావాల్సిన మార్పును జెమినీకి చెప్పాలి. అనంతరం కొత్త వెర్షన్‌ను పొందాలని గూగుల్ జెమినీ తన పోస్టులో పేర్కొంది.

గ‌తంలోనే ప‌రిచ‌యం..

గతంలో గూగుల్ ఐ/ఓ 2026 కార్యక్రమంలో జెమినీ ఒమ్నీని మొదటిసారి పరిచయం చేసింది. ఆ సమయంలో జెమినీ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన పలు కీలక అప్‌డేట్‌లను కూడా సంస్థ వెల్లడించింది. సృజనాత్మక పనుల విస్తృత శ్రేణిని నిర్వహించేందుకు ఈ మోడల్‌ను రూపొందించామని, ఇది వివిధ రకాల కంటెంట్‌ను అర్థం చేసుకుని సహజంగా కనిపించే, స్థిరమైన వీడియో అవుట్‌పుట్‌లను రూపొందించగలదని గూగుల్ తెలిపింది. జెమినీ రీజనింగ్ సామర్థ్యాన్ని క్రియేటివ్ సామర్థ్యంతో కలిపిన కొత్త మోడల్ జెమినీ ఒమ్నీ. ఇది ఏ ఇన్‌పుట్ నుంచైనా కంటెంట్‌ను సృష్టిస్తుంది. ప్రారంభంగా వీడియోలపై దృష్టి సారించాం. ఇమేజ్‌లు, ఆడియో, వీడియో, టెక్స్ట్‌లను ఇన్‌పుట్‌గా ఉపయోగించి, జెమినీ వాస్తవ ప్రపంచ పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని అధిక నాణ్యత క‌లిగిన వీడియోలను రూపొందించవచ్చు. అలాగే సంభాషణ రూపంలోనే వీడియోలను సులభంగా ఎడిట్ చేయవచ్చ‌ని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

జెమినీ ఒమ్నీతో వీడియో ఎడిటింగ్ ఇలా..

గూగుల్ ప్రకారం వీడియో ఎడిటింగ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీ డివైస్ లేదా క్లౌడ్ స్టోరేజ్ నుంచి వీడియోను అప్‌లోడ్ చేయాలి. వీడియోలో చేయాలనుకునే మార్పులు లేదా మెరుగుదలలను వివరించాలి. జెమినీ ఒమ్నీ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేసి అవసరమైన ఎడిట్లను అమలు చేస్తుంది. చివరగా అప్డేట్ అయిన వీడియోను ప్రివ్యూ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎడిటింగ్ ఫీచర్ జెమినీ మొబైల్ యాప్‌తోపాటు వెబ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండటంతో వినియోగదారులు వివిధ డివైస్‌లలో కంటెంట్‌ను రూపొందించడం, సవరించడం చేయవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిమితులు..

ప్రస్తుతం జెమినీ ఒమ్నీ ద్వారా సృష్టించే లేదా ఎడిట్ చేసే వీడియోల గరిష్ట నిడివి 10 సెకన్లు మాత్రమే. అయితే వాటిలో ఆడియోను కూడా చేర్చే అవకాశం ఉంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సామర్థ్యాలను మరింత విస్తరిస్తామని గూగుల్ తెలిపింది. పారదర్శకతను పెంచేందుకు జెమినీ ఒమ్నీ ద్వారా రూపొందించిన వీడియోలకు సింథ్‌ఐడీ వాటర్‌మార్క్ ను జతచేస్తారు. దీంతో ఆ కంటెంట్ ను గూగుల్ జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా రూపొందించార‌ని గుర్తించవచ్చు. అలాగే జెమినీ, క్రోమ్‌లోని జెమినీ, గూగుల్ సెర్చ్‌లో అందుబాటులో ఉన్న వెరిఫికేషన్ ఫీచర్‌ల ద్వారా కూడా కంటెంట్ మూలాన్ని పరిశీలించవచ్చు. గూగుల్ ఇప్పటికే జెమినీ ఒమ్నీ ఫ్లాష్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఏఐ ప్లస్, ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లకు విడుదల చేస్తోంది. భారత్‌లోని వినియోగదారులు కూడా జెమినీ యాప్, గూగుల్ ప్రొ ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవ‌చ్చు.

అలాగే ఈ టెక్నాలజీని త్వరలో యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్‌లలో కూడా అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీంతో కంటెంట్ క్రియేటర్‌లు గూగుల్ ఎకోసిస్టమ్‌లోనే వీడియోలను సృష్టించడం, ఎడిట్ చేయడం మరింత సులభం కానుంది.

Advertisement
Advertisement