Google Gemini | జెమినితో ఫోన్ కాల్స్, బిల్లు చెల్లింపులు.. ఇక పనులన్నీ ఏఐతోనే!
Google Gemini | గూగుల్ తన జెమిని ఏఐలో సరికొత్త ఏజెంటిక్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఫోన్ కాల్స్ చేయడం, అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, విద్యుత్ బిల్లులను విశ్లేషించడం, ఆన్‌లైన్ షాపింగ్, కిరాణా సరుకుల ఆర్డర్లు, క్యాలెండర్ నిర్వహణ వంటి పనులను వినియోగదారుల తరఫున పూర్తి చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది.
Technology | Published On Nov 18, 2026, 5.01 pm IST
Google Gemini | గూగుల్ తన జెమిని ఏఐలో సరికొత్త ఏజెంటిక్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఫోన్ కాల్స్ చేయడం, అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, విద్యుత్ బిల్లులను విశ్లేషించడం, ఆన్‌లైన్ షాపింగ్, కిరాణా సరుకుల ఆర్డర్లు, క్యాలెండర్ నిర్వహణ వంటి పనులను వినియోగదారుల తరఫున పూర్తి చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది. జెమిని 4 హైడ్రోజన్ మోడల్ ఆధారంగా రూపొందించిన ఈ ఫీచర్లు భారత్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తున్నాయి.
కొత్తగా టాస్క్ మోడ్..
గూగుల్ జెమిని యాప్‌లో కొత్తగా టాస్క్ మోడ్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమకు అవసరమైన పనులను జెమినికి అప్పగించవచ్చు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో సమీపంలోని వ్యాపార సంస్థలను గుర్తించి, వాటికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ లభ్యతను తెలుసుకోవడంతోపాటు గూగుల్ క్యాలెండర్‌లోని షెడ్యూల్ ఆధారంగా బుకింగ్ కూడా చేస్తుంది. ఉదాహరణకు.. ఒక వినియోగదారుడి 2019 హోండా ఒడిస్సీ కారుకు సర్వీసింగ్ అవసరమని గుర్తించిన జెమిని.. సమీపంలోని రెండు డీలర్‌షిప్ కేంద్రాలకు ఒకేసారి ఫోన్ చేసి ఐదు నిమిషాల్లో సర్వీసింగ్ అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేసింది. ఫోన్ కాల్స్ చేసే సమయంలో తాను ఏఐ అసిస్టెంట్ అని జెమిని స్పష్టంగా తెలియజేస్తుంది. మరోవైపు, గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ అనుసంధానంతో విద్యుత్ బిల్లులు, పాత బిల్లింగ్ వివరాలను పరిశీలించి అధిక బిల్లులకు కారణాలను గుర్తిస్తుంది.
గూగుల్ షాపింగ్ గ్రాఫ్ సహాయంతో కొనుగోళ్లు..
ఆన్‌లైన్ షాపింగ్‌లో గూగుల్ షాపింగ్ గ్రాఫ్ సహాయంతో ఉత్పత్తులను పోల్చి, గూగుల్ పే ద్వారా కొనుగోళ్లకు సహకరిస్తుంది. ఏజెంట్ పేమెంట్స్ ప్రోటోకాల్ (ఏపీ2) ద్వారా మాస్టర్‌కార్డ్, వీసా వంటి కార్డులతో చెల్లింపులకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు ఖర్చు పరిమితులను కూడా ముందుగానే నిర్ణయించుకోవచ్చు. కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్, కార్డు రివార్డులు, కొనుగోలు రక్షణ ప్రయోజనాలు కొనసాగుతాయి. రసీదులు, ఆర్డర్ ట్రాకింగ్ వివరాలు గూగుల్ వాలెట్‌లో భద్రపరచబడతాయి. యూనివర్సల్ కామర్స్ ప్రోటోకాల్ (యూసీపీ)ని కూడా జెమినిలో అనుసంధానించేందుకు గూగుల్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
కిరాణా సరుకులను సైతం..
కిరాణా సరుకుల ఆర్డర్ల విషయంలోనూ జెమిని కొత్త సామర్థ్యాలను అందిస్తోంది. ఆర్‌సీఎస్ అనుసంధానంతో వినియోగదారులు టెక్స్ట్ సందేశాలు, ఫొటోల ద్వారా షాపింగ్ జాబితాను పంపించవచ్చు. ఉదాహరణకు.. ఖాళీ అయిన తృణధాన్యాల డబ్బా ఫొటోతోపాటు ఇతర సరుకుల వివరాలను పంపితే, లాసాగ్నా, స్ట్రాబెర్రీలు, దోసకాయలు, వెనిల్లా ఐస్‌క్రీమ్, చీరియోస్ వంటి వస్తువులను ఇన్‌స్టాకార్ట్ ఆర్డర్‌లో జోడిస్తుంది. అయితే కొనుగోలును పూర్తి చేయడానికి వినియోగదారుడిని ఇన్‌స్టాకార్ట్‌కు మళ్లిస్తుంది. ప్రస్తుతం 60కి పైగా ప్రముఖ యాప్‌లతో జెమిని కనెక్టెడ్ యాప్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అనుసంధానం కల్పిస్తోంది. జీమెయిల్‌లోని ఈవెంట్లు, తేదీలను గుర్తించి గూగుల్ క్యాలెండర్‌లో నమోదు చేయడం, ఇతరులకు ఆహ్వానాలు పంపడం కూడా సాధ్యమవుతుంది. జీమెయిల్ నుంచి gemini\@google.com కి ఈ-మెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే వాటిలోని వివరాల ఆధారంగా క్యాలెండర్ ఎంట్రీలను రూపొందిస్తుంది. ఒకే సమయంలో పలు కార్యక్రమాలు ఉన్నప్పుడు షెడ్యూల్‌లోని వైరుధ్యాలను గుర్తించి ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది. వైద్య బిల్లులు, బీమా రెన్యూవల్స్ నిర్వహణలోనూ సహకరిస్తుంది.
భద్రత, గోప్యతకు ప్రాధాన్యత..
వినియోగదారుల భద్రత, గోప్యతకు గూగుల్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఏజెంట్ కంప్యూట్ ఇంజిన్ ద్వారా ప్రతి వినియోగదారుడి పనులను ప్రత్యేక హార్డ్‌వేర్ ఐసోలేటెడ్ వర్చువల్ మెషిన్‌లో నిర్వహిస్తుంది. ఇతర వినియోగదారులతో ఈ వర్చువల్ మెషిన్లను పంచుకోదు. ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఫిల్టర్లు, గూగుల్ సేఫ్ బ్రౌజింగ్, యాప్‌ల అనుసంధానాన్ని నిలిపివేసే సెట్టింగులు, చాట్ హిస్టరీ తొలగింపు వంటి భద్రతా చర్యలు ఉన్నాయి. కొనుగోలు బటన్ క్లిక్ చేయడం వంటి కీలక చర్యలకు ముందు వినియోగదారుడి అనుమతి తీసుకుంటుంది. సూచనలు స్పష్టంగా లేనప్పుడు అదనపు ప్రశ్నలు అడుగుతుంది. జెమిని యాప్‌లో చాట్ మోడ్ స్థానంలో టాస్క్ మోడ్‌ను ఎంచుకుని అవసరమైన పనులను వివరించడం ద్వారా ఈ ఫీచర్లను ఉపయోగించవచ్చు.
ఎవరికి అందుబాటులో..
అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్ సహా పలు దేశాల్లో వందల మిలియన్ల మంది వినియోగదారులకు ఈ కొత్త టాస్క్ సామర్థ్యాలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే కొన్ని అధునాతన ఫీచర్లు తొలుత అమెరికాలో మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. టెక్స్ట్ విత్ జెమిని ఫీచర్‌కు అమెరికా ఫోన్ నంబర్, అర్హత కలిగిన మొబైల్ ఆపరేటర్ అవసరం. కొన్ని సందర్భాల్లో వెబ్‌సైట్లు తుది చర్యను వినియోగదారుడే పూర్తి చేయాల్సి వస్తుందని, ఏఐ పనుల్లో తప్పులు జరిగే అవకాశం కూడా ఉందని గూగుల్ వెల్లడించింది. ఈ సమస్యలను మెరుగుపరిచేందుకు భద్రతా పరిశోధకులను కూడా తమ ఏఐ వల్నరబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని ఆహ్వానించింది.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






