త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire TV Stick HD | అమెజాన్ కొత్త‌ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుద‌ల‌.. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అప్ గ్రేడ్‌..

Fire TV Stick HD | ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ భారత మార్కెట్లో తన కొత్త స్ట్రీమింగ్ డివైస్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ ని అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ డివైస్ ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్త మోడల్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తోపాటు వేగవంతమైన పనితీరు, మెరుగైన నావిగేషన్, పోర్టబిలిటీ ఫీచర్లు అందించారు.

S

Technology | Published On May 19, 2026, 1.55 pm IST

Fire TV Stick HD | అమెజాన్ కొత్త‌ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుద‌ల‌.. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అప్ గ్రేడ్‌..
Advertisement

Fire TV Stick HD | ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ భారత మార్కెట్లో తన కొత్త స్ట్రీమింగ్ డివైస్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ ని అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ డివైస్ ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్త మోడల్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తోపాటు వేగవంతమైన పనితీరు, మెరుగైన నావిగేషన్, పోర్టబిలిటీ ఫీచర్లు అందించారు. ముఖ్యంగా మొదటిసారి హెచ్‌డీ స్ట్రీమింగ్ డివైస్‌లో క్లౌడ్ గేమింగ్ సపోర్ట్ ఇవ్వడం విశేషం. కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ పాత జనరేషన్‌తో పోలిస్తే సగటున 30 శాతం వేగంగా పనిచేస్తుందని అమెజాన్ తెలిపింది. దీంతో డివైస్ బూట్ టైమ్ తగ్గడంతోపాటు యాప్స్ కూడా వేగంగా ఓపెన్ అవుతాయి. ఇందులో 1080పీ ఫుల్ హెచ్‌డీ స్ట్రీమింగ్‌కు హెచ్‌డీఆర్10+ సపోర్ట్ అందించారు. అలాగే వై-ఫై 6, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉండటంతో నెమ్మదైన ఇంటర్నెట్ కనెక్షన్‌లో కూడా స్థిరమైన వీడియో స్ట్రీమింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

మ‌రింత స్లిమ్‌గా డిజైన్‌, ప‌వ‌ర్ అడాప్ట‌ర్‌తో ప‌నిలేదు..

డిజైన్ పరంగా కూడా ఈ కొత్త డివైస్‌ను మరింత స్లిమ్‌గా తయారు చేశారు. ప్రస్తుత ఫైర్ టీవీ సిరీస్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే ఇది సుమారు 30 శాతం పలుచగా ఉంటుంది. టీవీ యూఎస్‌బీ పోర్ట్ నుంచే నేరుగా పవర్ ను తీసుకునే విధంగా రూపొందించడంతో ప్రత్యేక పవర్ అడాప్టర్ అవసరం ఉండదు. దీంతో టీవీ వెనుక భాగంలో సులభంగా అమర్చుకోవచ్చు. కొత్త ఫైర్ టీవీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇందులో అందించారు. మూవీస్, టీవీ షోలు, ఫ్రీ కంటెంట్, లైవ్ టీవీ వంటి విభాగాలను ప్రత్యేకంగా చూపించేలా నావిగేషన్‌ను సులభతరం చేశారు. అలాగే అలెక్సా కంపాటిబుల్ స్మార్ట్ హోమ్ డివైసెస్ అయిన ఏసీలు, లైట్స్, ఫ్యాన్స్ వంటి ఉపకరణాలను నేరుగా టీవీ ఇంటర్‌ఫేస్ నుంచే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ డివైస్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, జీ5, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేల సంఖ్యలో యాప్స్, విస్తృత కంటెంట్ లైబ్రరీలకు యాక్సెస్ లభిస్తుంది. అయితే కొన్ని సేవలకు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు వర్తిస్తాయి.

ధ‌ర వివ‌రాలు..

డివైస్‌తోపాటు అలెక్సా వాయిస్ రిమోట్ కూడా అందిస్తున్నారు. వాయిస్ కమాండ్స్ ద్వారా కంటెంట్ సెర్చ్ చేయడం, యాప్స్ ఓపెన్ చేయడం సులభం అవుతుంది. అలాగే 2026లో అప్‌డేట్ చేసిన ఫైర్ టీవీ మొబైల్ యాప్‌తో కూడా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ నుంచే వాచ్‌లిస్టులను మేనేజ్ చేయడం, కంటెంట్‌ను టీవీకి కాస్ట్ చేయడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈసారి మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్ సపోర్ట్ ఇవ్వడం గేమింగ్ యూజర్లకు పెద్ద ఆకర్షణగా మారింది. యూజర్లు ఎక్స్‌బాక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రత్యేక గేమింగ్ కన్సోల్ లేకుండానే టీవీలో క్లౌడ్ ఆధారిత వీడియో గేమ్స్ ఆడవచ్చు. అయితే ఇందుకోసం యాక్టివ్ ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు బ్లూటూత్ గేమింగ్ కంట్రోలర్ అవసరం ఉంటుంది. కొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ ధర రూ.4,999గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాతో పాటు బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. త్వరలో రిటైల్ స్టోర్లలో కూడా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement