త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dark Sword Spyware | ఐఫోన్ల‌కు వ్యాప్తి చెందుతున్న డార్క్ స్వోర్డ్ స్పైవేర్‌.. ఏంటిది, ఫోన్‌లో ఇది ఏం చేస్తుంది..?

Dark Sword Spyware | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ల వినియోగ‌దారుల‌కు డార్క్ స్వోర్డ్ (Dark Sword) అనే కొత్త స్పైవేర్‌తో ముప్పు పొంచి ఉంద‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రించారు. కోట్లాది ఐఫోన్‌ల‌ను సైతం ప్ర‌భావితం చేసే సామ‌ర్థ్యాన్ని ఈ స్పైవేర్ క‌లిగి ఉంద‌ని తెలిపారు.

S

Technology | Published On Mar 21, 2026, 12.14 pm IST

Dark Sword Spyware | ఐఫోన్ల‌కు వ్యాప్తి చెందుతున్న డార్క్ స్వోర్డ్ స్పైవేర్‌.. ఏంటిది, ఫోన్‌లో ఇది ఏం చేస్తుంది..?
Advertisement

Dark Sword Spyware | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ల వినియోగ‌దారుల‌కు డార్క్ స్వోర్డ్ (Dark Sword) అనే కొత్త స్పైవేర్‌తో ముప్పు పొంచి ఉంద‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రించారు. కోట్లాది ఐఫోన్‌ల‌ను సైతం ప్ర‌భావితం చేసే సామ‌ర్థ్యాన్ని ఈ స్పైవేర్ క‌లిగి ఉంద‌ని తెలిపారు. గూగుల్‌, లుకౌట్‌, ఐ వెరిఫై సంస్థ‌ల‌కు చెందిన నిపుణులు ఈ మేర‌కు సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ మాల్‌వేర్ లేదా స్పైవేర్ ఇన్‌ఫెక్టెడ్ వెబ్‌సైట్ల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని, ఇది ఐఫోన్ల యూజ‌ర్ల‌కు చెందిన సున్నిత‌మైన డేటాను దొంగిలించే అవ‌కాశం ఉంద‌ని వారు హెచ్చ‌రించారు. టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తెలిపిన ప్ర‌కారం సౌదీ అరేబియా, ట‌ర్కీ, మ‌లేషియా, ఉక్రెయిన్ త‌దిత‌ర దేశాల్లో కొందరు ఈ స్పైవేర్ ను ఉప‌యోగిస్తున్న‌ట్లు తేలింది. ప‌లువురు హ్యాక‌ర్లు డార్క్ స్వోర్డ్ స్పైవేర్ ను ఉప‌యోగించి ప్ర‌జ‌ల ఐఫోన్ల‌పై దాడులు చేస్తున్న‌ట్లు తెలిపారు.

నేర‌గాళ్ల చేతుల్లోకి డేటా..

డార్క్ స్వోర్డ్ స్పైవేర్ స‌హాయంతో హ్యాక‌ర్లు ఉక్రెయిన్ కు చెందిన ప‌లు వార్తా వెబ్‌సైట్లు, ఓ ప్ర‌భుత్వ సంస్థ వెబ్‌సైట్‌లోని కొన్ని సెక్ష‌న్ల‌పై ఇప్ప‌టికే దాడులు చేసి ఆయా వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించే యూజ‌ర్ల డేటాను త‌స్క‌రించార‌ని నిపుణులు తెలిపారు. ఇటీవ‌ల ఆయా వెబ్‌సైట్ల‌లో చోరీకి గురైన డేటా ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసే నేర‌గాళ్ల చేతుల్లోకి చేరింద‌ని లుకౌట్ సంస్థ సెక్యూరిటీ హెడ్ జ‌స్టిన్ ఆల్బ్రెచ్ తెలిపారు. ఈ మేర‌కు రాయిట‌ర్స్ సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మార్చి 3న కొరునా అనే శ‌క్తివంత‌మైన స్పైవేర్ ను ఇప్ప‌టికే గుర్తించ‌గా, ఆ త‌రువాత డార్క్ స్వోర్డ్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ రెండు స్పైవేర్ లు క‌లిసే వెబ్‌సైట్‌ల ద్వారా యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయ‌ని గుర్తించారు. ఇవి ముఖ్యంగా క్రిప్టో క‌రెన్సీ వాట్ల‌ను ఖాళీ చేస్తున్నాయ‌ని, వ్య‌క్తిగ‌త సున్నిత‌మైన స‌మాచారాన్ని చోరీ చేస్తున్నాయ‌ని నిపుణులు తెలిపారు.

ఐఓఎస్ ఈ వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌కు ముప్పు..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అటాక్ అవుతున్న ఈ రెండు స్పైవేర్ లు కొత్త ఐఓఎస్ వెర్ష‌న్‌ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేద‌ని, కానీ ఐఓఎస్ 18 వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌పై మాత్రం ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని నిపుణులు తెలిపారు. గ‌త నెల యాపిల్ సంస్థ త‌న పాత ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇంకా ప్ర‌పంచ వ్యాప్తంగా 1/4వ వంతు ఐఫోన్‌ల‌లో వినియోగంలో ఉంద‌ని వెల్ల‌డించింది. దీంతో ఆయా డివైస్‌ల‌కు ఈ స్పైవేర్ ల నుంచి ముప్పు పొంచి ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక గ‌తంలోనూ ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు చెందిన ప‌లు వెర్ష‌న్‌ల‌లో ఇలాంటి సెక్యూరిటీ లోపాలు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌తేడాది మే నెల‌లో ఎయిర్ ప్లే ఫీచ‌ర్‌లోని సెక్యూరిటీ లోపాల కార‌ణంగా వైఫై నెట్‌వ‌ర్క్‌లోని ప‌రిక‌రాల‌ను హ్యాక‌ర్లు సుల‌భంగా హైజాక్ చేసే అవ‌కాశం ఉంద‌ని యాపిల్ త‌న వినియోగ‌దారుల‌ను త‌మ డివైస్‌ల‌ను కొత్త ఐఓఎస్ వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాల‌ని హెచ్చ‌రించింది. ఎయిర్ ప్లే అనేది ఐఫోన్ నుంచి టీవీ వంటి ఇత‌ర స్మార్ట్ ప‌రిక‌రాల‌కు ఆడియో, వీడియోల‌ను స్ట్రీమ్ చేయ‌డానికి ప‌నిచేసే ఓ ఫీచ‌ర్‌.

ఐఫోన్ల‌పై పెరుగుతున్న హ్యాకింగ్‌..

టెల్ అవీవ్‌కు చెందిన సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో ఐఫోన్‌ల‌కు వ్యాప్తి చెందుతున్న ఈ స్పైవేర్‌ల‌ను ముందుగా గుర్తించింది. యాపిల్ ఎయిర్ ప్లే ప్రోటోకాల్‌, థ‌ర్డ్ పార్టీ ప‌రిక‌రాల‌కు అనుకూలంగా రూపొందించిన ఎయిర్ ప్లే ఎస్‌డీకేలో మొత్తం 23 లోపాలు ఉన్న‌ట్లు అప్ప‌ట్లో తెలిపింది. ఇక గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లోనూ ఐఫోన్ల‌పై హ్యాక‌ర్ల దాడులు ఎక్కువ‌య్యాయ‌ని యాపిల్ తెలిపింది. ఆ దాడుల్లో ప‌లు లాక్ చేసిన డివైస్‌ల‌లో యూఎస్‌బీ రిస్ట్రిక్టెడ్ మోడ్‌ను డిసేబుల్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు సంస్థ తెలిపింది. అయితే ఐఫోన్ యూజ‌ర్లు వెబ్‌సైట్ల‌ను ద‌ర్శిస్తున్న‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని యాపిల్ హెచ్చ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement