త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన యాపిల్‌.. పాత ఐఫోన్ మోడ‌ల్స్ ధ‌ర‌లు భారీగా పెంపు..

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తాజాగా త‌న తొలి ఫోల్డ‌బుల్ ఐఫోన్‌తోపాటు ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది కొత్త ఐఫోన్ల విడుద‌ల అనంతరం పాత మోడ‌ల్ ఐఫోన్ ధ‌ర‌ల‌ను యాపిల్ త‌గ్గిస్తుంది. కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జ‌ర‌గడం వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది.

S

Technology | Published On Sep 10, 2026, 4.56 pm IST

Apple | వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన యాపిల్‌.. పాత ఐఫోన్ మోడ‌ల్స్ ధ‌ర‌లు భారీగా పెంపు..
Advertisement

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తాజాగా త‌న తొలి ఫోల్డ‌బుల్ ఐఫోన్‌తోపాటు ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది కొత్త ఐఫోన్ల విడుద‌ల అనంతరం పాత మోడ‌ల్ ఐఫోన్ ధ‌ర‌ల‌ను యాపిల్ త‌గ్గిస్తుంది. కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జ‌ర‌గడం వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. అయితే అందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. ఐఫోన్ డ్యుయో ఫోల్డ‌బుల్ ఫోన్‌తోపాటు ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్‌ల‌ను రిలీజ్ చేసిన అనంత‌రం యాపిల్ త‌న ఐఫోన్ 16, 17, 17ఇ, ఐఫోన్ ఎయిర్ మోడ‌ల్స్ ధ‌ర‌ల‌ను పెంచిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మోడ‌ల్స్ ధ‌ర‌లు భార‌త్ మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా పెరిగాయి. ఏఐ ప‌రిశ్ర‌మ‌లో చిప్‌ల కొర‌త ఏర్ప‌డ‌డం కారణంగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూట‌ర్ల చిప్‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. దీంతో ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను కంపెనీలు పెంచుతున్నాయి. అందులో భాగంగానే యాపిల్ కూడా ధ‌ర‌ల‌ను పెంచింది.

ఏయే ఫోన్ల ధ‌ర‌ల‌ను పెంచింది..

ఇప్ప‌టికే ప‌లు టెక్ సంస్థ‌లు త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను పెంచ‌గా, యాపిల్ ధ‌ర‌ల పెంపు కోసం వేచి చూసింది. ఇప్పుడు కొత్త ఐఫోన్ల‌ను లాంచ్ చేసింది క‌నుక ఇదే స‌రైన స‌మ‌యం అని భావించి పాత మోడ‌ల్స్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచింది. దీంతో ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల‌కే ఆయా పాత ఐఫోన్ మోడ‌ల్స్‌ను విక్ర‌యిస్తున్నారు. అయితే ముందుగానే ఐఫోన్‌ల‌ను కొని ఉంటే బాగుండేద‌ని యూజ‌ర్లు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా వాపోతున్నారు. ఇక కొత్త ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్స్ రాక‌తో పాత ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్స్‌ను యాపిల్ త‌న స్టోర్స్ నుంచి తొల‌గించింది. కేవ‌లం ఐఫోన్ 16, 17, 17ఇ, ఐఫోన్ ఎయిర్ ఫోన్లు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా, వాటికి సంబంధించిన టాప్ ఎండ్ వేరియెంట్లు ప్రొ, ప్రొ మ్యాక్స్‌ల‌ను త‌న అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ నుంచి తొలగించింది.

పెంపు ఎలా ఉంది..

కాగా ధ‌ర‌ల పెంపుతో ఐఫోన్‌16కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర అంత‌కు ముందు రూ.69,900 ఉండ‌గా, ఇప్పుడ‌ది రూ.89,900కి పెరిగింది. ఏకంగా రూ.20వేల పెంపు చోటు చేసుకుంది. అలాగే ఐఫోన్ 17కు చెందిన 256జీబీ మోడల్ ధ‌ర అంత‌కు ముందు రూ.82,900 ఉండ‌గా, ఇప్పుడు రూ.99,900కు చేరుకుంది. దీంతో ఈ వేరియెంట్‌పై రూ.17వేల పెరుగుద‌ల న‌మోదైంది. ఐఫోన్ 17కు చెందిన 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,02,900 నుంచి రూ.1,24,900కు పెరిగింది. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌పై అద‌నంగా రూ.22వేల భారం ప‌డుతోంది. అదేవిధంగా ఐఫోన్ 17ఇ 256జీబీ మోడల్ ధర రూ.64,900 నుంచి రూ.79,900కు పెరిగింది. అంటే రూ.15వేలు పెరిగింది. అదే 512జీబీ వేరియంట్ ధర రూ.84,900 నుంచి రూ.1,04,900కు చేరింది. ఈ మోడల్‌పై రూ.20వేల వ‌రకు ధర పెరిగింది.

అత్య‌ధికంగా రూ.65వేల వ‌ర‌కు పెంపు..

అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్ విషయంలో ధరల పెంపు మరింత భారీగా ఉంది. 256జీబీ వేరియంట్ ధర గతంలో రూ.1,02,900 కాగా, ఇప్పుడు రూ.1,49,900కు చేరింది. అంటే ఏకంగా రూ.47వేలు పెరిగింది. 512జీబీ మోడల్ ధర రూ.1,39,900 నుంచి రూ.1,74,900కు పెరిగి రూ.35వేల పెంపు చోటు చేసుకుంది. ఇక 1టీబీ ఐఫోన్ ఎయిర్ ధర రూ.1,59,900 నుంచి ఏకంగా రూ.2,24,900కు చేరింది. ఈ వేరియంట్‌పై అత్యధికంగా రూ.65వేల ధరను పెంచింది. కొత్త ధరలను పరిశీలిస్తే, మొత్తం జాబితాలో ఐఫోన్ 16 ప్రారంభ మోడల్‌పై రూ.20వేల పెంపు త‌క్కువ‌గా కనిపిస్తుండగా, ఐఫోన్ ఎయిర్ 1టీబీ వేరియంట్‌పై అత్యధికంగా రూ.65వేల పెంపు ద‌ర్శ‌న‌మిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్ మోడళ్ల ధరల పెంపు వినియోగదారులకు పెద్ద షాక్‌గా మారింది.

వేచి చూస్తే మంచిది..

అయితే యాపిల్ నిర్ణయించిన ఎంఆర్‌పీనే వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇతర విక్రయదారులు, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు పలు సందర్భాల్లో ఐఫోన్లను యాపిల్ అధికారిక ధర కంటే తక్కువకే విక్రయిస్తుంటారు. దీంతో ఈ నెల చివర్లో లేదా అక్టోబర్ ప్రారంభంలో జరిగే బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వంటి సేల్ ఈవెంట్లలో ఈ మోడళ్లపై డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉంది. అందువ‌ల్ల ప్రస్తుతం ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు వెంటనే కొనుగోలు చేయకుండా, రాబోయే పండుగ సేల్‌ల వరకు వేచి చూడటం మంచిదని మార్కెట్ పరిశీలకులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement