Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రిజర్వాయర్లపై ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు
శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సౌర, ఫ్లోటింగ్ సోలార్, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుపై విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సోదాహరణంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రధాన, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, కొమురంభీం, పాలేరు, వైరా, మల్లన్నసాగర్, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, పోచారం వంటి జలాశయాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అదనపు వ్యయమే ప్రధాన సవాల్
సాధారణ సోలార్ ప్రాజెక్టులతో పోలిస్తే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు అధిక వ్యయం అవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద మెగావాట్‌కు రూ.కోటి వరకు సహాయం అందించే పథకాన్ని ప్రకటించినప్పటికీ అందులో కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పారు. ప్రధానంగా దేశీయంగా తయారైన పరికరాలనే ఉపయోగించాలనే కేంద్ర నిబంధనల కారణంగా మెగావాట్‌కు సుమారు రూ.1.30 కోట్ల వరకు అదనపు భారం పడుతోందని వివరించారు. కేంద్రం విధించిన నిబంధనలను సడలిస్తే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులపై పెట్టుబడిదారుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహించి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆయన శాసనసభకు చెప్పారు.
18,543 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని శాసనసభకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ సుమారు 15 వేల మెగావాట్లు ఉండగా.. సెప్టెంబర్ 9 నాటికి అది 19వేల మెగావాట్లకు చేరిందని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వంటి కారణాలతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని ఆయన వివరించారు. పెరుగుతున్న డిమాండ్ రాష్ట్ర అభివృద్ధికి సానుకూల సంకేతమే అయినప్పటికీ, అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఏడాదికి రూ.19 వేల కోట్ల సబ్సిడీ
వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.14 వేల కోట్ల సబ్సిడీ భరిస్తోందని డిప్యూటీ సీఎం చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 55 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు. దీనికి మరో రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందన్నారు. మొత్తంగా దాదాపు రూ.19 వేల కోట్లను ఏటా విద్యుత్ సబ్సిడీల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని ఆయన సభకు తెలిపారు. భవిష్యత్తులో ఈ భారాన్ని తగ్గించుకుంటూనే ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సోలార్ విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నామన్నారు.
80 గ్రామాల సోలరైజేషన్
అమ్రాబాద్ గిరిజన ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. సుమారు 80 గ్రామాలను పూర్తిగా సోలరైజ్ చేసి, అక్కడ మైక్రో గ్రిడ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి, మైక్రో గ్రిడ్ ద్వారా విద్యుత్ వినియోగించే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నామన్నారు.
ఇందిరా సౌర గిరి జల వికాసం
గిరిజన ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గతంలో పంపిణీ చేసిన సుమారు 6.70 లక్షల ఎకరాలను కూడా సౌర విద్యుత్ ప్రోత్సాహానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పేరుతో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అవకాశం ఉన్నచోట సోలరైజేషన్, ఫ్లోటింగ్ సోలార్‌ను ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం వంటి ప్రాంతాల్లోనూ అధ్యయనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సాధ్యమైనంత మేరకు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలి
రైతులు, ప్రజలు సౌర విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన పెంచుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. తమ తమ గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రైతులకు ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని సూచించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చేలా ప్రజలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు





