త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Age Verification | వ‌య‌స్సును త‌ప్పుగా ఎంట‌ర్ చేసి సోష‌ల్ మీడియా వాడితే ఇక కుద‌ర‌దు.. చిన్నారులు, టీనేజ‌ర్ల‌ను AI ఇట్టే గుర్తిస్తుంది..

AI Age Verification | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అన్ని దేశాల్లోనూ సోష‌ల్ మీడియా వినియోగం పెర‌గ‌డంతో టీనేజ్ యువ‌త‌కు సోష‌ల్ మీడియా నుంచి ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు చెబుతున్న కార‌ణంగా అనేక దేశాల్లో ఇప్ప‌టికే 14 నుంచి 16 ఏళ్ల లోపు వారు సోష‌ల్ మీడియాను వినియోగించ‌డాన్ని ఆయా దేశాల ప్ర‌భుత్వాలు నిషేధించాయి.

S

Technology | Published On May 6, 2026, 10.38 am IST

AI Age Verification | వ‌య‌స్సును త‌ప్పుగా ఎంట‌ర్ చేసి సోష‌ల్ మీడియా వాడితే ఇక కుద‌ర‌దు.. చిన్నారులు, టీనేజ‌ర్ల‌ను AI ఇట్టే గుర్తిస్తుంది..
Advertisement

AI Age Verification | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అన్ని దేశాల్లోనూ సోష‌ల్ మీడియా వినియోగం పెర‌గ‌డంతో టీనేజ్ యువ‌త‌కు సోష‌ల్ మీడియా నుంచి ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు చెబుతున్న కార‌ణంగా అనేక దేశాల్లో ఇప్ప‌టికే 14 నుంచి 16 ఏళ్ల లోపు వారు సోష‌ల్ మీడియాను వినియోగించ‌డాన్ని ఆయా దేశాల ప్ర‌భుత్వాలు నిషేధించాయి. అయితే సోషల్ మీడియాను వాడుతున్న స‌మ‌యంలో యూజ‌ర్ ఏజ్ ను త‌ప్పుగా ఎంట‌ర్ చేసి వాడే అవ‌కాశం కూడా ఉంటుంది. అందువ‌ల్ల ఆ నిషేధాన్ని అమ‌లు చేయ‌డం ప్ర‌భుత్వాల‌కు క‌ష్ట‌మే. కానీ ఈ స‌మ‌స్య‌కు మెటా ప్లాట్‌ఫామ్స్ చెక్ పెట్ట‌నుంది. ఏఐ వినియోగం ద్వారా యూజ‌ర్ ఏజ్‌ను ఆటోమేటిక్‌గా ప్లాట్‌ఫామ్ గుర్తిస్తుంది. దీంతో వారి దేశంలో అమ‌లులో ఉన్న నిబంధ‌న‌ల మేర‌కు అనుమ‌తి ఉంటే యూజ‌ర్‌ను సోష‌ల్ మీడియా వాడ‌కానికి అనుమ‌తిస్తుంది. లేదంటే అనుమ‌తి ల‌భించ‌దు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో చిన్నారులు సోష‌ల్ మీడియాను వాడ‌డంపై నిషేధం విధించిన నేప‌థ్యంలో మెటా తీసుకువచ్చిన ఈ కొత్త అప్‌డేట్ యూజ‌ర్ల వ‌య‌స్సును నిర్దారించేందుకు ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది.

ఏఐ ఆధారిత ఏజ్ అష్యూరెన్స్ చ‌ర్య‌లు..

మెటా ప్లాట్‌ఫామ్స్ త‌న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో టీనేజ్ వ‌య‌స్సులో ఉన్న యూజ‌ర్ల‌ను గుర్తించి వారిని ర‌క్షించేందుకు కొత్త ఏఐ ఆధారిత ఏజ్ అష్యూరెన్స్ చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ అప్‌డేట్ వ‌ల్ల స‌రైన వ్య‌క్తులు మాత్ర‌మే సోష‌ల్ మీడియాను వినియోగించ‌డం సాధ్య‌మ‌వుతుంది. అండ‌ర్ ఏజ్ ఉన్న యూజ‌ర్లు సోష‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌ను వాడ‌లేరు. అలాంటి యూజర్ల‌పై క‌ఠిన‌మైన నియంత్ర‌ణ‌లు ఉంటాయి. అలాగే వారి త‌ల్లిదండ్రుల‌కు కూడా ప‌లు స‌పోర్ట్ టూల్స్‌ను అందించ‌డంపై మెటా ప్లాట్‌ఫామ్స్ దృష్టి సారించింది. ఈ కొత్త ఫీచ‌ర్ల‌లో భాగంగా మెటా ఏఐ టెక్నాల‌జీని విస్తృతంగా ఉప‌యోగించ‌నుంది. యూజ‌ర్లు వ‌య‌స్సును త‌ప్పుగా న‌మోదు చేసి సోష‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌ను వాడినా కూడా ఇది గుర్తిస్తుంది. అలాంటి యూజ‌ర్ల‌పై ఒక వేళ ఏఐ అనుమానం వ్య‌క్తం చేస్తే యూజ‌ర్ టీన్ అయి ఉండొచ్చ‌ని భావించి ఆ అకౌంట్‌ను ఆటోమేటిక్‌గా టీన్ అకౌంట్ ప్రొటెక్ష‌న్స్‌లోకి బ‌దిలీ చేస్తుంది. దీని వ‌ల్ల టీనేజ్ యూజ‌ర్ల‌పై నియంత్ర‌ణ ఉంటుంది. ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్‌ను మెటా ప్లాట్‌ఫామ్స్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌ల‌తోపాటు మెసెంజర్ యాప్ లోనూ అందుబాటులోకి తెస్తోంది.

పిల్ల‌లు, టీనేజ‌ర్ల వ‌య‌స్సు ఈజీగా గుర్తింపు..

మెటా ప్లాట్‌ఫామ్స్ కొత్త అప్‌డేట్స్ వ‌ల్ల సోష‌ల్ మీడియాలో టీనేజ్ వ‌య‌స్సులో ఉన్న‌వారిని గుర్తించ‌డం చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. దీంతో సున్నిత‌మైన కంటెంట్‌పై నియంత్ర‌ణ విధించ‌వ‌చ్చు. 18 ఏళ్ల లోపు యూజ‌ర్ల‌కు డిఫాల్ట్ సేఫ్టీ సెట్టింగ్స్‌ను అప్లై చేసి ఇస్తారు. 13 ఏళ్ల‌కు లోబ‌డి లేదా పైబ‌డి ఉన్న‌వారికి ఆటోమేటిగ్గా కంటెంట్ సెట్టింగ్స్ అమ‌ల‌వుతాయి. మెటా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం 2024లో ఈ అప్‌డేట్స్‌ను బీటా ద‌శ‌లో ప్రారంభించామ‌ని, దీని వ‌ల్ల ఇప్ప‌టికే కోట్లాది మంది టీనేజ్ యూజ‌ర్ల‌ను ప్రొటెక్ష‌న్ లిస్ట్‌లోకి చేర్చామని తెలిపింది. మెటా ప్ర‌స్తుతం ఏఐ ఆధారిత విజువ‌ల్ అనాల‌సిస్ టెక్నాల‌జీతో ఈ కొత్త అప్‌డేట్స్‌ను అందివ్వనుంది. ఇది యూజ‌ర్ వ‌య‌స్సును అంచ‌నా వేయ‌డానికి ప‌లు అంశాల‌ను ప‌రిశీలిస్తుంది. యూజ‌ర్ పెట్టే పోస్టులు, క్యాప్ష‌న్లు, కామెంట్లు, బ‌యోలోని యాక్టివిటీ సంకేతాలు, పుట్టిన రోజు లేదా స్కూల్ స‌మాచారం, ఫొటోలు, వీడియోల్లో క‌నిపించే భౌతిక ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి ఈ ఏఐ ఆటోమేటిగ్గా యూజ‌ర్ వ‌య‌స్సును నిర్దారించుకుంటుంది.

ఏఐకి అనుమానం వ‌స్తే అకౌంట్ డీయాక్టివేట్‌..

అయితే ఇది ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ కాద‌ని మెటా స్ప‌ష్టం చేసింది. దీని ఉద్దేశం వ్య‌క్తిని గుర్తించ‌డం కాద‌ని, కేవ‌లం వ‌య‌స్సు ప‌రిధిని అంచ‌నా వేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలిపింది. ఈ గుర్తింపు వ్య‌వ‌స్థ‌ను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌, ఫేస్‌బుక్ గ్రూప్స్ వంటి ఇత‌ర విభాగాలకు కూడా విస్త‌రిస్తున్న‌ట్లు మెటా వెల్ల‌డించింది. ఏఐ ఒక వేళ ఒక యూజర్‌ను అండ‌ర్ ఏజ్ గా గుర్తిస్తే వెంట‌నే ఆ యూజ‌ర్ అకౌంట్‌పై చ‌ర్య‌లు తీసుకుంటుంది. అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయ‌డం, యాక్సెస్ ను తిరిగి పొంద‌డానికి వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ చేయ‌డం త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేస్తుంది. 13 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న యూజ‌ర్ల‌ను గుర్తించి తొల‌గించేందుకు ఈ ఏఐ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తుంది. రిపోర్టింగ్ టూల్స్‌ను కూడా సుల‌భ‌త‌రం చేయ‌నుండ‌డంతో ఏఐ స‌హాయంతో వేగంగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

త‌ల్లిదండ్రుల‌కు ప్రత్యేక సపోర్ట్ టూల్స్‌..

యూజ‌ర్ వ‌య‌స్సును త‌ప్పుగా ఇచ్చిన‌ట్లు ఏఐకి అనుమానం వ‌స్తే వెరిఫికేష‌న్ చేయాల‌ని అడుగుతుంది. అందుకు యూజ‌ర్ ప్ర‌భుత్వ గుర్తింపు కార్డును స‌మ‌ర్పించాలి. అయితే ఆ కార్డును మెటా కేవ‌లం గుర్తింపు కోస‌మే వాడుతుంది. త‌మ స‌ర్వ‌ర్ల‌లో దాన్ని నిక్షిప్తం చేయ‌దు. క‌నుక యూజ‌ర్ల డేటాకు ప్రైవ‌సీ ఉంటుంది. అలాగే త‌ల్లిదండ్రుల కోసం ప‌లు ప్ర‌త్యేక ఫీచ‌ర్ల‌ను కూడా మెటా అందిస్తోంది. టీన్ అకౌంట్ వ‌య‌స్సు చెక్ చేయ‌డానికి నోటిఫికేష‌న్లు, ఆన్ లైన్ వ‌య‌స్సు స‌మాచారంపై అవ‌గాహ‌న కోసం సూచ‌న‌లు, ఫ్యామిలీ సెంట‌ర్ ద్వారా కంట్రోల్, ఇన్‌సైట్స్ వంటి స‌దుపాయాల‌ను అందుబాటులోకి తెస్తోంది. మెటా తెలిపిన ప్ర‌కారం ఏజ్ వెరిఫికేష‌న్ ఒక ఇండ‌స్ట్రీ స్థాయి స‌మ‌స్య అని స్ప‌ష్టం చేసింది. అందుకే యాప్ స్టోర్లు, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ ఈ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని సూచించింది. దీని వ‌ల్ల అన్ని యాప్‌ల‌లోనూ ఒకే విధమైన వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని, పునరావృత వెరిఫికేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని, ప్రైవ‌సీ మెరుగు ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ముందుగా ఈ దేశాల్లో..

మెటా తీసుకురానున్న ఈ అప్‌డేట్స్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల యూజ‌ర్ల‌కు ద‌శ‌ల‌వారీగా అందించ‌నున్నారు. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం యురోపియ‌న్ యూనియ‌న్ దేశాల‌తో స‌హా బ్రెజిల్‌లో ఈ అప్‌డేట్స్ ల‌భిస్తాయి. త‌రువాత ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్ ప్రారంభిస్తారు. ముందుగా అమెరికా నుంచి ప్రారంభించి యూకే, యురోపియన్ యూనియ‌న్ దేశాల‌కు ఇస్తారు. అనంత‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు ఈ అప్‌డేట్స్‌ను విస్త‌రిస్తారు. ఇందుకు క‌నీసం 1 నుంచి 2 ఏళ్లు పడుతుంద‌ని మెటా అంచ‌నా వేస్తోంది. అయితే ఈ వ్య‌వ‌స్థ‌ను, అప్ డేట్స్‌ను ఇప్ప‌టికే అమెరికా, ఆస్ట్రేలియా, కెన‌డా, యూకేల‌లో ప‌లు ఎంపిక చేసిన యూజ‌ర్ల‌కు బీటా ద‌శ‌లో టెస్టింగ్ చేస్తున్నారు. అందువ‌ల్ల అతి త్వ‌ర‌లోనే ప్ర‌పంచ దేశాల‌కు ఇవి అందుబాటులోకి రానున్నాయ‌ని తెలుస్తోంది.

Advertisement
Advertisement