OnePlus | భారత యూజర్లకు వన్‌ప్లస్ షాక్..? 2027 నాటికి మార్కెట్ల నుంచి పూర్తిగా నిష్క్రమణ..?
OnePlus | వన్‌ప్లస్ పశ్చిమ దేశాల నుంచి నిష్క్రమిస్తుందనే వార్త ఇప్పుడు అక్కడితో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒప్పో 2027 నాటికి భారత్‌తో పాటు చైనా మినహా ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో వన్‌ప్లస్ కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Technology | Published On Jul 16, 2026, 10.34 am IST
OnePlus | వన్‌ప్లస్ పశ్చిమ దేశాల నుంచి నిష్క్రమిస్తుందనే వార్త ఇప్పుడు అక్కడితో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒప్పో 2027 నాటికి భారత్‌తో పాటు చైనా మినహా ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో వన్‌ప్లస్ కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, వచ్చే దాదాపు 18 నెలల్లో వన్‌ప్లస్ భారత్‌కు కూడా గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. గత వారం వరకు వెలువడిన సమాచారం ప్రకారం అమెరికా, యూరప్ మార్కెట్లకే ఈ నిర్ణయం పరిమితమని, భారత్, చైనాల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రచారం జరిగింది. అయితే బ్లూమ్‌బర్గ్ తాజా కథనం ఆ అంచనాలను పూర్తిగా ఖండిస్తోంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక..
ఈ నివేదికకు ప్రాధాన్యం రావడానికి ప్రధాన కారణం దాని విశ్వసనీయత. గతంలో వచ్చిన వార్తలు ఒక అనామక టిప్‌స్టర్ ఆధారంగా ఉండగా, వన్‌ప్లస్ ఇప్పటికే సంస్థ మూతపడుతోంది అనే పలు వదంతులను ఖండించింది. కానీ ఈసారి బ్లూమ్‌బర్గ్, ఒప్పో-వన్‌ప్లస్ సంస్థలకు చెందిన అంతర్గత వర్గాలకు పరిచయమున్న వ్యక్తిని ఉటంకిస్తూ ఈ సమాచారాన్ని ప్రచురించింది. ప్రధాన అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ అంశంపై విశ్వసనీయ వర్గాలను ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయినప్పటికీ ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదు. ఈ విషయంపై స్పందించాలన్న బ్లూమ్‌బర్గ్ అభ్యర్థనకు ఒప్పో, వన్‌ప్లస్ ప్రతినిధులు వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, సంస్థల నుంచి ఏ ఉన్నతాధికారి కూడా అధికారికంగా స్పందించలేదు.

అమెరికా, యూరప్ తరువాత భారత్..?
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం ముందుగా అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్‌ప్లస్ కార్యకలాపాలను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం 2027 నాటికి భారత్‌తోపాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సంస్థ పూర్తిగా వైదొలగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత వన్‌ప్లస్ కార్యకలాపాలు కేవలం చైనా మార్కెట్‌కే పరిమితమవుతాయని తెలిసింది. ఇదే పునర్వ్యవస్థీకరణలో ఒప్పోకు చెందిన మరో బ్రాండ్ రియల్‌మీ విషయంలో విరుద్ధమైన వ్యూహం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ చైనా మార్కెట్ నుంచి వైదొలిగి, విదేశీ మార్కెట్లలో, ముఖ్యంగా నార్డిక్ దేశాల్లో తన వ్యాపారాన్ని కొనసాగించనుందని నివేదిక పేర్కొంది. అంటే వన్‌ప్లస్ చైనాకు పరిమితమవుతుండగా, రియల్‌మీ అంతర్జాతీయ మార్కెట్లపై మరింత దృష్టి సారించనుంది.
ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం..?
ఈ నిర్ణయాలకు ప్రధాన కారణంగా ఆర్థిక పరిస్థితులనే నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా, యూరప్, భారత్ మార్కెట్లలో ఒప్పో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు కొంతకాలంగా ఆశించిన స్థాయిలో లేకపోవడం, 2026 రెండో త్రైమాసికంలో డబుల్ డిజిట్ స్థాయిలో షిప్‌మెంట్‌లు తగ్గిపోవడం కంపెనీపై ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. అమెరికాలో చైనా తయారీ ఫోన్ల విక్రయాలపై నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కూడా ప్రభావం చూపిన అంశంగా ప్రస్తావించారు. అలాగే యాపిల్‌తో కొనసాగుతున్న ట్రేడ్ సీక్రెట్స్ కేసును ప్రత్యక్ష కారణంగా కాకపోయినా, సంస్థ పరిస్థితిని ప్రభావితం చేసిన అంశంగా పేర్కొన్నారు. కాగా వన్‌ప్లస్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న ఆక్సిజన్‌ఓఎస్‌ను ఒప్పో కలర్‌ఓఎస్‌లో విలీనం చేసే ప్రక్రియపై కూడా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విలీనాన్ని ఇప్పటివరకు ఒప్పో లేదా వన్‌ప్లస్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే వన్‌ప్లస్ ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు ఇప్పటికే క్రమంగా తగ్గిపోతోందనే అభిప్రాయానికి ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.

వన్‌ప్లస్ వైదొలిగితే యూజర్ల పరిస్థితేంటి..?
వన్‌ప్లస్ నిజంగానే భారత్ నుంచి వైదొలిగితే ప్రస్తుతం ఫోన్లు ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఏమవుతుందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, వారంటీ, సర్వీస్ వంటి అంశాలపై ఆందోళనలు ఉన్నాయి. జూలై 15న ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌లో వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని గణనీయంగా తగ్గించిందని, 2023లో సుమారు 7.2 శాతం ఉన్న ఆఫ్‌లైన్ మార్కెట్ షేర్ ఇటీవల 1.8 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. అదే నివేదిక ప్రకారం వన్‌ప్లస్ జీవితకాల డిస్‌ప్లే వారంటీతోపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కూడా ఒప్పో భారత్‌లో నిర్వహిస్తున్న సుమారు 600 సర్వీస్ సెంటర్ల ద్వారా కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వన్‌ప్లస్‌కు ఉన్న ప్రత్యేక సర్వీస్ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఒప్పో సేవా కేంద్రాల సంఖ్య చాలా ఎక్కువ. వన్‌ప్లస్ వినియోగదారుల సేవలను అందించేందుకు అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయాలను కూడా పెంచుతున్నట్లు ఒప్పో సర్వీస్ మేనేజర్ చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.
ధ్రువీకరించని సంస్థ..
అయితే ఇవన్నీ ఇప్పటికీ అధికారిక హామీలు కావు. వన్‌ప్లస్ లేదా ఒప్పో ఇప్పటివరకు కలర్‌ఓఎస్ విలీనాన్ని ధ్రువీకరించలేదు. అలాగే 2027 తర్వాత భారత్‌లో వారంటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేదా సర్వీస్ ప్రమాణాలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు. కాబట్టి ఈ హామీలను పూర్తిగా నిజమని భావించే ముందు సంస్థల అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. యూరప్‌లో ఇప్పటికే జరిగిన పరిణామాలు ఈ అంశంపై మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. జూలై 26న వెలువడిన ఓ నివేదిక ప్రకారం యూరప్‌లో వన్‌ప్లస్ కార్యకలాపాలు తగ్గిస్తున్న సమయంలో ఎండ్ ఆఫ్ లైఫ్ గా గుర్తించిన ఉత్పత్తులకు యూరోపియన్ యూనియన్ చట్టం ప్రకారం తప్పనిసరిగా ఇవ్వాల్సిన రెండేళ్ల వారంటీ సేవలకు బదులుగా కంపెనీ 100 యూరోల వౌచర్లు అందించినట్లు సమాచారం. అయితే ఈ వౌచర్ల వినియోగంపై అనేక పరిమితులు ఉండటంతో అవి వినియోగదారులకు పెద్దగా ఉపయోగపడలేదని పేర్కొన్నారు.

ప్రీమియం విభాగంలో ఇప్పటికీ ఆదరణ..
ఒక వినియోగదారుడికి పనిచేయని వన్‌ప్లస్ బడ్స్‌కు, మరొకరికి లోపభూయిష్టమైన 120 వాట్ల సూపర్‌వూక్ ఛార్జర్‌కు మరమ్మత్తులు లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తి ఇవ్వకుండా వౌచర్లు మాత్రమే అందించినట్లు సమాచారం. వారిలో ఒకరు యూరోపియన్ కన్స్యూమర్ సెంటర్‌కు అధికారిక ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా నివేదిక వెల్లడించింది. ఈ పరిణామాలు భారత్‌లో భవిష్యత్తులో సర్వీస్ హామీలపై మరింత స్పష్టత అవసరమనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. వన్‌ప్లస్ కచ్చితంగా భారత్‌ను వీడుతుందని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఇది అధికారిక ప్రకటన కాదు, విశ్వసనీయ వర్గాల ఆధారంగా వచ్చిన నివేదిక మాత్రమే. గతంలో కూడా ఇలాంటి వార్తలను వన్‌ప్లస్ ఖండించింది. కాబట్టి సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలను ఊహాగానాల లాగే పరిగణించాలి. అయితే ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెజ్‌మెంట్‌లో వన్‌ప్లస్‌కు భారత్‌లో ఇప్పటికీ ఆదరణ ఉంది. అందువల్ల ఆ సంస్థ భారత్ నుంచి నిష్క్రమిస్తుందని కచ్చితంగా చెప్పలేమని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై వన్‌ప్లస్ స్పందించాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

realme NARZO 100x 5G | రియల్‌మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..
జులై 15, 2026

US Tariffs | భారత్‌పై 100% సుంకాలు.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ
జులై 15, 2026

Smart Phones | స్మార్ట్ ఫోన్లలో దృఢమైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగదారులు.. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..
జులై 13, 2026
తాజావార్తలు
- ●Hyderabad School | కల్కా, సూరహ్ ఫాతిహా చదవాలంటూ.. రెండో తరగతి విద్యార్థికి హోమ్ వర్క్
- ●Malayalam OTT | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Jagannath Rath Yatra 2026 | అద్భుతాల నిలయం.. జగన్నాథుడి ఆలయం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Drugs | డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసులపై ప్రముఖ మంత్రి ఒత్తిడి!
- ●Indian Railways | భారతీయ రైల్వేలో 6777 టెక్నీషియన్ అప్రెంటిస్‌లు.. ఐటీఐ, ఇంటర్ అర్హత

Hyderabad School | కల్కా, సూరహ్ ఫాతిహా చదవాలంటూ.. రెండో తరగతి విద్యార్థికి హోమ్ వర్క్

Malayalam OTT | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్

Jagannath Rath Yatra 2026 | అద్భుతాల నిలయం.. జగన్నాథుడి ఆలయం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..



