Jagannath Rath Yatra 2026 | అద్భుతాల నిలయం.. జగన్నాథుడి ఆలయం
Jagannath Rath Yatra 2026 | ఆషాఢ శుద్ధ ద్వితీయ సందర్భంగా పూరీ క్షేత్రం జగన్నాథుడి నామ స్మరణతో మార్మోగుతోంది. జగన్నాథుని మహా రథయాత్రకు వేళైంది. జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి స్వామి అమ్మవార్లు గర్భాలయం నుంచి బయటకు వచ్చే అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు కళ్లలో భక్తి భావంతో ఎదురుచూస్తున్నారు.
Devotional | Published On Jul 16, 2026, 10.13 am IST
Jagannath Rath Yatra 2026 | ఆషాఢ శుద్ధ ద్వితీయ సందర్భంగా పూరీ క్షేత్రం జగన్నాథుడి నామ స్మరణతో మార్మోగుతోంది. జగన్నాథుని మహా రథయాత్రకు వేళైంది. జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి స్వామి అమ్మవార్లు గర్భాలయం నుంచి బయటకు వచ్చే అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు కళ్లలో భక్తి భావంతో ఎదురుచూస్తున్నారు. శతాబ్దాల సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేళ మూలవిరాట్టులను అలంకరణలతో రథాలపై కొలువుదీర్చడం ఓ దివ్య అనుభూతిని కలిగిస్తుంది. మూడు కిలోమీటర్ల మేర సాగే రథయాత్ర మార్గం జనసంద్రంగా మారిపోతుంది. ఎటు చూసినా భక్తులే కనిపిస్తారు. హరినామ స్మరణలు, స్వామి నామ సంకీర్తనలు, రథాల చక్రాల కదలికల మధ్య పూరీ వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఒక్కసారి జగన్నాథుని దర్శనం లభిస్తే చాలు అన్న భావంతో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు రథాలను లాగేందుకు పోటీపడతారు. రథం కదిలే ప్రతి క్షణం భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. జగన్నాథుని రథయాత్ర అంటే కేవలం ఓ ఉత్సవం కాదు.. అది విశ్వాసం, సంప్రదాయం, చరిత్రల సమ్మేళనం. రథాలు, ఆలయ ఆచారాలు అందరికీ తెలిసినవే అయినా.. పూరీ క్షేత్రంలో అడుగడుగునా దాగి ఉన్న విశేషాలు, అంతుచిక్కని సంప్రదాయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు మరెన్నో ఉన్నాయి. అందుకే జగన్నాథుని క్షేత్రం ప్రతి సందర్శకుడికీ ఓ కొత్త అనుభూతిని అందించే పుణ్యభూమిగా నిలుస్తోంది.
యమసోపానం..
జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత గర్భగుడి చేరుకోవాలంటే భక్తులు 22 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒడియాలో వీటిని ‘బైసీ పహాచా’ అని పిలుస్తారు. సింహద్వారం నుంచి ప్రారంభమయ్యే ఈ మెట్లలో మూడో మెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీన్ని ‘యమ సోపానం’గా భావిస్తారు. ఆలయంలోకి వెళ్లేటప్పుడు ఈ మెట్టును ఎక్కడం వల్ల అపమృత్యు భయాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అయితే, తిరిగి బయటకు వచ్చేటప్పుడు మాత్రం దానిపై కాలు పెట్టరు. ఈ మెట్ల మధ్యలో ఉన్న పితృశిల వద్ద జగన్నాథుడి ప్రసాదాన్ని సమర్పిస్తే అది పితృదేవతలకు చేరుతుందని విశ్వసిస్తారు.
అందరికీ దర్శనమిచ్చేలా..
జగన్నాథ ఆలయంలోకి ఇతర మతస్థులకు ప్రవేశం లేదు. అయితే, స్వామిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దర్శన అవకాశం కల్పించేందుకు సింహద్వారం వెలుపల పతితపావన జగన్నాథుని ప్రతిష్ఠించారు. ఇది సంపూర్ణ విగ్రహం కాకుండా స్వామివారి ముఖ రూపం మాత్రమే. చరిత్ర ప్రకారం పూరీని పాలించిన రామచంద్రదేవ్ కాలంలో మతపరమైన పరిస్థితుల కారణంగా ఆయనకు ఆలయ ప్రవేశం సాధ్యం కాలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా సింహద్వారం వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతారు. అప్పటి నుంచి అందరి జగన్నాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
నీలచక్రం.. ప్రత్యేక ఆకర్షణ
పూరీ ఆలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని నీలచక్రం అంటారు. అష్టధాతువులతో రూపొందించిన ఈ చక్రం ఆలయ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం ఆలయ సేవకులు గోపురంపైకి ఎక్కి పతాకాన్ని మారుస్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏకాదశి రోజున నీలచక్రం వద్ద జరిగే దీపారాధన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
శివుడి క్షేత్రం కూడా పూరీయే
పూరీ అంటే జగన్నాథుడి క్షేత్రమే అనుకున్నా, శైవ సంప్రదాయానికి కూడా ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది. పూరీలోని ఐదు ప్రధాన శివాలయాలను పంచమహాదేవులుగా పూజిస్తారు. వాటిలో లోకనాథ్ మహాదేవాలయం అత్యంత ప్రసిద్ధి పొందింది. లోకనాథుడి శివలింగాన్ని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దర్శించే అవకాశం లభిస్తుంది. మహాశివరాత్రికి ముందు వచ్చే ప్రత్యేక రోజున కొద్దిసేపు మాత్రమే ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారు. మిగిలిన రోజుల్లో శివలింగం నీటిలోనే ఉంటుంది. లోకనాథ్‌తో పాటు యమేశ్వర్, మార్కండేశ్వర్, కపాలమోచన్, నీలకంఠేశ్వర్ ఆలయాలు పంచమహాదేవులుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు మరికొన్ని శివాలయాలను కలిపి అష్టశంభులుగా పిలుస్తారు.
క్షేత్రాన్ని కాపాడే అష్టచండీలు
పూరీ రక్షణలో శక్తి ఆరాధనకూ ప్రత్యేక స్థానం ఉంది. ఎనిమిది దిక్కుల్లో కొలువైన అమ్మవార్లను అష్టచండీలుగా పూజిస్తారు. వీరిలో విమలాదేవికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జగన్నాథునికి సమర్పించిన నైవేద్యం విమలాదేవికి నివేదించిన తర్వాతే మహాప్రసాదంగా మారుతుంది. రామచండీ, శ్యామకాళి, దక్షిణకాళి, వారాహి, హరచండీ, అలంచండీ, వాసేలీదేవి ఆలయాలు కూడా పూరీ ఆధ్యాత్మిక సంపదలో భాగమే. పూరీ క్షేత్ర రక్షకుల్లో ఆంజనేయస్వామికీ ప్రత్యేక స్థానం ఉంది. బేడీ హనుమాన్ ఆలయం దీనికి నిదర్శనం. సముద్రపు అలల నుంచి పూరీని కాపాడేందుకు జగన్నాథుడు హనుమంతుడిని నియమించాడని పురాణ కథనం. జగన్నాథ ఆలయానికి ఉన్న నాలుగు ద్వారాల వద్ద కూడా ఆంజనేయుడే సంరక్షకుడిగా ఉన్నాడని భక్తుల విశ్వాసం.
42 రోజుల చందనయాత్ర
జగన్నాథుని ఉత్సవాల్లో రథయాత్ర ఎంత ప్రసిద్ధి పొందిందో, చందనయాత్ర అంతటి ప్రత్యేకత కలిగినది. అక్షయ తృతీయ నుంచి జ్యేష్ఠ బహుళ చతుర్దశి వరకు 42 రోజులపాటు ఈ వేడుక కొనసాగుతుంది. మొదటి 21 రోజులు నరేంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం మూలవిరాట్టులకు చందన లేపనం చేసే కార్యక్రమం జరుగుతుంది. వేసవి వేడిమి నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించే సంప్రదాయంగా దీన్ని భావిస్తారు.
మహాప్రసాదం.. భక్తుల విశ్వాసం
జగన్నాథునికి సమర్పించే 56 రకాల నైవేద్యాల్లో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. బియ్యం నుంచి అన్నంగా మారి, భోగం, నైవేద్యం దశలను దాటి విమలాదేవికి సమర్పించిన తర్వాతే అది మహాప్రసాదంగా మారుతుంది. భక్తులు ఆరగించిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఎండబెట్టి తయారు చేసేదే నిర్మాల్యం. ఒడిశా ప్రజల ఆచారాల్లో దీనికి ప్రత్యేక గౌరవం ఉంది. శుభకార్యాల్లో, అంత్యక్రియల సందర్భాల్లో కూడా నిర్మాల్యాన్ని పవిత్రంగా భావిస్తారు.
గుండీచా.. మౌసీమా ఆతిథ్యం
జగన్నాథుని రథయాత్రలో గుండీచా, మౌసీమా ఆలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. రథయాత్రలో స్వామివారు గుండీచా ఆలయానికి చేరుకుని వారం రోజుల పాటు అక్కడే ఉంటారు. అందుకే ఆమెను జగన్నాథుని పెద్దపిన్ని ఇంటిగా భావిస్తారు. తిరుగు రథయాత్ర సమయంలో మౌసీమా ఆలయం వద్ద రథం ఆగుతుంది. అక్కడ స్వామివారికి ప్రత్యేకమైన ‘పోడా పీఠా’ నైవేద్యంగా సమర్పిస్తారు. పూరీ జగన్నాథ క్షేత్రం కేవలం ఓ ఆలయం కాదు. అది శతాబ్దాల చరిత్ర, సంప్రదాయాలు, విశ్వాసాలు కలిసిన ఓ ఆధ్యాత్మిక ప్రపంచం. అందుకే ఒక్కసారి దర్శించినా మళ్లీ మళ్లీ పిలిచే మహిమాన్విత క్షేత్రంగా పూరీ నిలిచిపోయింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Drugs | డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసులపై ప్రముఖ మంత్రి ఒత్తిడి!
- ●Indian Railways | భారతీయ రైల్వేలో 6777 టెక్నీషియన్ అప్రెంటిస్లు.. ఐటీఐ, ఇంటర్ అర్హత
- ●FIFA 2026 | ఫైనల్లో మెస్సీ సేన
- ●Puri Rath Yatra 2026 vs Telangana Bonalu 2026 | భక్తుల కోసం గడప దాటొచ్చిన దేవుళ్లు: ఒకే రోజున పూరీ జగన్నాథ రథయాత్ర, తెలంగాణ బోనాలు.. ఈ విశేషాలు మీకు తెలుసా?

Malayalam OTT | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..

Drugs | డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసులపై ప్రముఖ మంత్రి ఒత్తిడి!

Indian Railways | భారతీయ రైల్వేలో 6777 టెక్నీషియన్ అప్రెంటిస్లు.. ఐటీఐ, ఇంటర్ అర్హత





