త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GTA 6 | రూ.16వేల కోట్ల జీటీఏ6 గేమ్‌.. 1600 మంది భార‌తీయ డెవ‌ల‌ప‌ర్ల కృషి..

GTA 6 | ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పిన గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) గేమ్ రూపకల్పనలో భారతీయ డెవలపర్లు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. బెంగళూరులోని రాక్‌స్టార్ ఇండియా స్టూడియోకు చెందిన 1,600 మందికి పైగా డెవలపర్లు ఈ గేమ్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. భారతీయ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందనడానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.

S

Technology | Published On Nov 19, 2026, 4.01 pm IST

GTA 6 | రూ.16వేల కోట్ల జీటీఏ6 గేమ్‌.. 1600 మంది భార‌తీయ డెవ‌ల‌ప‌ర్ల కృషి..
Advertisement

GTA 6 | ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పిన గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) గేమ్ రూపకల్పనలో భారతీయ డెవలపర్లు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. బెంగళూరులోని రాక్‌స్టార్ ఇండియా స్టూడియోకు చెందిన 1,600 మందికి పైగా డెవలపర్లు ఈ గేమ్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. భారతీయ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందనడానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.

1600 మంది భార‌తీయ డెవ‌ల‌ప‌ర్ల కృషి..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రూ.16వేల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) వీడియో గేమ్ రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా నిలిచింది. బెంగళూరులోని రాక్‌స్టార్ ఇండియా స్టూడియోలో పనిచేస్తున్న 1,600 మందికి పైగా డెవలపర్లు ఈ భారీ గేమ్ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించినట్లు గేమింగ్ పరిశ్రమకు చెందిన నివేదికలు వెల్లడించాయి. బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. జీటీఏ 6 అభివృద్ధిలో గణనీయమైన భాగం బెంగళూరులోని రాక్‌స్టార్ ఇండియా డెవలపర్ల చేతుల మీదుగా జరిగిందని పేర్కొన్నారు. 1995లో బెంగళూరులో రాజేశ్ రావు అనే పారిశ్రామికవేత్త ఒకే కంప్యూటర్‌తో ప్రారంభించిన ధ్రువ ఇంటరాక్టివ్ సంస్థ ఈ ప్రయాణానికి పునాది వేసింది. ఈ సంస్థను 2019లో రాక్‌స్టార్ గేమ్స్ కొనుగోలు చేసింది. దీంతో భారతీయ డెవలపర్ల నైపుణ్యం అంతర్జాతీయ గేమింగ్ సంస్థ కార్యకలాపాల్లో భాగమైంది.

బెంగ‌ళూరు నుంచి ప‌ని..

గేమింగ్ పరిశ్రమ నివేదికల ప్రకారం.. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ స్టూడియోలో పనిచేస్తున్న సుమారు 1,615 మంది డెవలపర్లు జీటీఏ 6 ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. గేమ్‌లోని ఓపెన్ వరల్డ్ పరిసరాల రూపకల్పన, గేమ్‌కు అవసరమైన డిజిటల్ వస్తువులు, పాత్రలు, ప్రాంతాల నిర్మాణం వంటి పనుల్లో వీరు పాలుపంచుకున్నట్లు సమాచారం. ఈ గేమ్ కథలో కనిపించే కల్పిత అమెరికా రాష్ట్రం లియోనిడాలోని వైస్ బీచ్ ప్రాంతం రూపకల్పనలోనూ బెంగళూరు బృందం పనిచేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. గతంలోనూ రాక్‌స్టార్ ఇండియా బృందం గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 వంటి ప్రముఖ గేమ్‌ల అభివృద్ధికి సహకరించింది. ధ్రువ ఇంటరాక్టివ్ గతంలో ఫోర్జా మోటార్‌స్పోర్ట్, మార్వెల్ స్పైడర్ మ్యాన్, సీ ఆఫ్ థీవ్స్, డేస్ గాన్ వంటి అంతర్జాతీయ గేమ్‌ల కోసం పరిసరాలు, పాత్రలు, విజువల్ అంశాల రూపకల్పనలో పనిచేసింది. లక్ష్య డిజిటల్ సంస్థ కింగ్‌డమ్ హార్ట్స్ 3 గేమ్ కోసం కెప్టెన్ జాక్ స్పారో డిజిటల్ పాత్రను రూపొందించడంలో సహకరించింది. అలాగే అసాసిన్స్ క్రీడ్ నెక్సస్ వీఆర్ గేమ్ రూపకల్పనలోనూ భారతీయ డెవలపర్లు ఆర్ట్, యానిమేషన్, ప్రోగ్రామింగ్, డిజైన్ విభాగాల్లో తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

గేమింగ్ రంగంలోనూ ముందంజ‌..

ఈ పరిణామాలు భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులు సంప్రదాయ ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ప్రపంచస్థాయి వీడియో గేమ్‌ల తయారీలోనూ కీలక బాధ్యతలు చేపడుతున్నారని స్పష్టం చేస్తున్నాయి. అయితే జీటీఏ 6 అభివృద్ధిలో ఒక్కో స్టూడియో అందించిన పనికి సంబంధించిన పూర్తి వివరాలను రాక్‌స్టార్ గేమ్స్ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, బెంగళూరుకు చెందిన 1,600 మందికి పైగా డెవలపర్ల భాగస్వామ్యం భారతీయ గేమింగ్ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. ఐటీ సేవల కేంద్రంగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు ప్రపంచ వీడియో గేమింగ్ పరిశ్రమలోనూ ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతుండడం విశేషం.

Advertisement
Advertisement