త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతం

Damodar Rajanarasimha | ఆరోగ్య రంగంలో తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న వైద్యరంగ గుర్తింపును మరింత విస్తరించి, మెడికల్‌ టూరిజంలో గ్లోబల్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

P

Telangana | Published On Nov 20, 2026, 10.00 pm IST

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతం
Advertisement
  • మెడికల్‌ టూరిజానికి హైదరాబాద్‌ను అంతర్జాతీయ గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తం
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు భాగస్వాములు కావాలి
  • వైద్యారోగ్య‌శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Rajanarasimha | ఆరోగ్య రంగంలో తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న వైద్యరంగ గుర్తింపును మరింత విస్తరించి, మెడికల్‌ టూరిజంలో గ్లోబల్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ హెల్త్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో వైద్య సేవల విస్తరణ, ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య రంగాల్లో వస్తున్న మార్పులు, వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్‌ టూరిజం అవకాశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రపంచస్థాయి వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వనరులను సమన్వయం చేసుకుంటే అంతర్జాతీయ వైద్య రంగంలో తెలంగాణకు మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వైద్య సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సమగ్ర కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. మెడికల్‌ టూరిజం అభివృద్ధి కేవలం ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితం కాకూడదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

నాణ్యమైన వైద్య సేవలను విస్తరించడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య రంగాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌లో హెల్త్‌కేర్‌ రంగ ప్రతినిధులంతా చురుగ్గా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ఫార్మా వైస్‌ ప్రెసిడెంట్‌, కౌన్సిల్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కొండపల్లి సాహితి, కిమ్స్‌-సన్‌షైన్‌ ఎండీ డాక్టర్‌ గురువా రెడ్డి, ఫిక్కీ సభ్యుడు సర్జన్‌ కెప్టెన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, రెయిన్‌బో ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రశాంత్‌, ఐక్యరాజ్యసమితి మాజీ అధికారి డాక్టర్‌ శివ దుబిశెట్టి, యశోద ఆస్పత్రి ప్రతినిధి డాక్టర్‌ దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement