త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | అహ్మదాబాద్‌ కంకారియా లేక్‌ తరహాలో అంబీర్‌ చెరువు..!

HYDRAA | ప్రగతినగర్‌లోని అంబీర్‌ చెరువు రూపురేఖలు మారనున్నాయి. అహ్మదాబాద్‌లోని కంకారియా లేక్‌ తరహాలో పర్యాటక, పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ప్రకటించారు. ఆక్రమణల తొలగింపు, పూడికతీతతో పాటు బోటింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ జిమ్‌లు, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

P

Hyderabad | Published On Nov 20, 2026, 10.15 pm IST

HYDRAA | అహ్మదాబాద్‌ కంకారియా లేక్‌ తరహాలో అంబీర్‌ చెరువు..!
Advertisement
  • రూ.కోట్లతో సరికొత్త రూపు..
  • బోటింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌ గేమ్స్‌కు ఏర్పాట్లు
  • 162 ఎకరాల చెరువును 135.8 ఎకరాలకు విస్తరిస్తాం..
  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
  • భూమిపూజతో పునరుద్ధరణ పనులకు శ్రీకారం

HYDRAA | ప్రగతినగర్‌లోని అంబీర్‌ చెరువు రూపురేఖలు మారనున్నాయి. అహ్మదాబాద్‌లోని కంకారియా లేక్‌ తరహాలో పర్యాటక, పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ప్రకటించారు. ఆక్రమణల తొలగింపు, పూడికతీతతో పాటు బోటింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ జిమ్‌లు, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి భూమిపూజ చేసి పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.

తగ్గిన విస్తీర్ణం.. మళ్లీ పెంపు

అంబీర్‌ చెరువు వాస్తవ విస్తీర్ణం 162 ఎకరాలు కాగా, ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 121.2 ఎకరాలకే పరిమితమైందని రంగనాథ్‌ తెలిపారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని చెరువు విస్తీర్ణాన్ని 135.8 ఎకరాలకు పెంచనున్నట్లు చెప్పారు. చెరువులో నాలుగైదు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్‌, చెత్త, పూడికను తొలగించి సహజ జలవనరుగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువు చుట్టూ బండ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, గజీబోలు, కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

బోటింగ్‌.. సాహస క్రీడలు

చెరువు మధ్యలో ఉన్న కొండల సమీపంలో అడ్వెంచర్‌ క్రీడలకు అవకాశం కల్పించడంతో పాటు బోటింగ్‌ జెట్టీలు నిర్మించనున్నారు. బోటు షికారుతో పాటు వాటర్‌ స్పోర్ట్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. పిల్లల కోసం ప్లే ఏరియాలు, వ్యాయామానికి ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తారు. కంకారియా లేక్‌ కార్నివాల్‌ తరహాలో ప్రగతినగర్‌లోనూ అంబీర్‌ చెరువు ఫెస్టివల్‌ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

వరద ముప్పు తగ్గింపు..

చెరువును అందంగా తీర్చిదిద్దడమే కాకుండా వరద ముప్పును తగ్గించడం, భూగర్భ జలాలను పెంపొందించడం లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు రంగనాథ్‌ చెప్పారు. 10.23 చదరపు కిలోమీటర్ల పరిధి నుంచి వచ్చే వరద నీరు చెరువులోకి చేరేందుకు ఆరు ఇన్‌లెట్లను అభివృద్ధి చేయనున్నారు. తద్వారా వర్షపు నీరు వృథా కాకుండా చెరువులోకి చేరేలా చర్యలు తీసుకోనున్నారు. చెరువు మధ్యలోని రహదారిని విస్తరించడంతో పాటు ప్రజలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు స్కైవాక్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతినగర్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న చెరువును దశలవారీగా అభివృద్ధి చేస్తామని, పనుల సమయంలో నీటిని పూర్తిగా తొలగించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. ముందుగా ఒకవైపు పనులు పూర్తి చేసి, ఆ తర్వాత మరోవైపు చేపట్టనున్నట్లు తెలిపారు. తమ్మిడికుంటను మించి అంబీర్‌ చెరువును అభివృద్ధి చేసి స్థానికులకు కానుకగా అందిస్తామన్నారు.

హైడ్రాకు ప్రజల మద్దతు: ఎమ్మెల్యే గాంధీ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో నగరంలో వర్షాకాల వరదలు, వేసవిలో నీటి ఎద్దడి సమస్యలను తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా పనిచేస్తోందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అడ్డంకులు ఎదురైనా వాటిని సామరస్యంగా పరిష్కరిస్తూ పనులు ముందుకు తీసుకెళ్తున్న కమిషనర్‌ రంగనాథ్‌ కృషిని ప్రశంసించారు. గతంలో హైడ్రాను వ్యతిరేకించినవారు సైతం ఇప్పుడు దాని పనితీరును అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చెరువులను నీటి వనరులుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణకు ఉపయోగపడే ప్రకృతి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో హైడ్రా అదనపు కమిషనర్‌ డి. ఆనంద్‌కుమార్‌, ఏసీపీ తిరుమల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement