త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wi vs Sa T20 World Cup | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా – టీమిండియా సెమీస్‌ ఆశ‌లు స‌జీవం

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మార్‌క్ర‌మ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికాకు విజ‌యాన్ని అందించాడు.

N

Sports | Published On Feb 26, 2026, 7.01 pm IST

Wi vs Sa T20 World Cup  | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా – టీమిండియా సెమీస్‌ ఆశ‌లు స‌జీవం
Advertisement

Wi vs Sa T20 World Cup |  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలి సెమీస్ బెర్తును సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది. గురువారం జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. వెస్టిండీస్ ఓట‌మితో భార‌త సెమీస్ ఆశ‌లు నిలిచాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయి 176 ప‌రుగులు చేసింది. లీగ్‌ద‌శ‌తో పాటు జింబాబ్వే మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన వెస్టిండీస్ టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్స్ సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

ధాటిగా మొద‌లై...

బ్రండ‌న్ కింగ్‌, షై హోప్‌ మెరుపుల‌తో విండీస్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభ‌మైంది. కింగ్ 11 బాల్స్‌లో ఐదు ఫోర్ల‌తో 21, షై హోప్ ఆరు బాల్స్‌లో ఒక ఫోర్ రెండు సిక్స‌ర్ల‌తో ప‌ద‌హారు ప‌రుగులు చేసి జోరు మీద క‌నిపించారు. షై హోప్‌ను ర‌బాడ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత మిగిలిన టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్స్ ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు.

ఎనిమిదో వికెట్‌కు...

83 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ వెస్టిండీస్‌ను జాస‌న్ హోల్డ‌ర్‌, రోమారియో షెఫార్డ్ ఆదుకున్నారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ ఎనిమిదో వికెట్‌కు 89 ప‌రుగుల భాగ‌స్వామ్యం జోడించారు. హోల్డ‌ర్ 31 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 49 పరుగులు చేయ‌గా...షెఫార్డ్ 37 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 52 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయ‌గా...ర‌బాడా, బాష్ త‌లో రెండు వికెట్ల‌తో రాణించారు.

ఒక్క వికెట్ కోల్పోయి...

వెస్టిండీస్ విధించిన టార్గెట్‌ను కేవ‌లం ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి సౌతాఫ్రికా ఛేదించింది. ఓపెన‌ర్ మార్‌క్ర‌మ్‌తో పాటు డికాక్‌, రికెల్ట‌న్ విండీస్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. వీరి మెరుపుల‌తో 16.1 ఓవ‌ర్ల‌లోనే వెస్టిండీస్ 177 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ మార్‌క్ర‌మ్ 46 బాల్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేసి చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచాడు. డికాక్ 24 బాల్స్‌లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్‌తో వీర‌విహారం చేశాడు. హాఫ్ సెంచ‌రీ దిశ‌గా సాగుతోన్న అత‌డిని రోస్ట‌న్ ఛేజ్ ఔట్ చేశాడు. డికాక్ ఔట్ అయినా రికెల్ట‌న్‌తో క‌లిసి మార్‌క్ర‌మ్ సౌతాఫ్రికాకు ఘ‌న విజ‌యాన్ని అందించాడు. రికెల్ట‌న్ 28 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 45 ర‌న్స్‌తో రాణించాడు.

రెండు మ్యాచ్‌ల్లో గెల‌వాలి...

విండీస్‌పై విజ‌యంతో సౌతాఫ్రికా సెమీస్ బెర్తు ఖాయ‌మైంది. విండీస్ ఓట‌మితో భార‌త ఆశ‌లు నిలిచాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచి ఉంటే టీమిండియా సూప‌ర్ 8తోనే ఇంటిముఖం ప‌ట్టి ఉండేది. టీమిండియాకు జింబాబ్వేతో పాటు వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌లో అడుగుపెడుతుంది. ర‌న్‌రేట్ కీల‌కం కానుంది.

 

Advertisement
Advertisement