త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భారత్​–దక్షిణాఫ్రికా 4వ టి20 రద్దు: లక్నోలో దట్టమైన పొగమంచు

లక్నోలో దట్టమైన పొగమంచు, తీవ్రమైన గాలి కాలుష్యం కారణంగా భారత్–సౌత్ ఆఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. AQI 400 దాటి హానికర స్థాయికి చేరడంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సిరీస్ డిసైడర్ అహ్మదాబాద్‌లో జరగనుంది.

a

Sports | Published On Dec 17, 2025, 11.52 pm IST

భారత్​–దక్షిణాఫ్రికా 4వ టి20 రద్దు: లక్నోలో దట్టమైన పొగమంచు
Advertisement

IND vs SA 4th T20I Abandoned Due to Fog and Poor Air Quality in Lucknow

లక్నో, డిసెంబర్ 17:
భారత్–సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయీ ఏకనా క్రికెట్ స్టేడియంలో దట్టమైన పొగమంచు (స్మాగ్) కారణంగా దృశ్యమానత() పూర్తిగా తగ్గిపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. అధికారికంగా “అతిగా పొగమంచు” అని ప్రకటించినప్పటికీ, నగరంలో గాలి నాణ్యతా సూచిక (AQI) 400 దాటి హానికర స్థాయికి చేరుకోవడమే ప్రధాన కారణంగా మారింది. ఈ ఘటన ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో టాస్ కూడా వేయలేదు. రెండు జట్ల ఆటగాళ్లు మొదట మైదానంలో వార్మప్ చేసినా, వాతావరణంలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో సాయంత్రం 7.30 గంటలకే డ్రెస్సింగ్ రూమ్‌లకు తిరిగి వెళ్లారు. అంపైర్లు పిచ్, మైదాన పరిస్థితులను మొత్తం ఆరు సార్లు పరిశీలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్మప్ సమయంలో సర్జికల్ మాస్క్ ధరించడం గాలి కాలుష్యం తీవ్రతను స్పష్టంగా ప్రతిబింబించింది.

ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉంది. రిజర్వ్ డే ఏర్పాటు లేకపోవడంతో ఇరు జట్లు ఇప్పుడు అహ్మదాబాద్‌కు బయలుదేరనున్నాయి. అక్కడ డిసెంబర్ 19న (శుక్రవారం) జరిగే ఐదో, చివరి టీ20 మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారనుంది.

వేదికల ఎంపికపై బీసీసీఐని తూర్పారపడుతున్న అభిమానులు

Umpires inspect visibility amid dense fog during India vs South Africa 4th T20 match in Lucknow

ఈ మ్యాచ్ రద్దుతో బీసీసీఐ షెడ్యూలింగ్ విధానంపై మళ్లీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శీతాకాలంలో ఉత్తర భారత నగరాల్లో—లక్నో, న్యూ చండీగఢ్, ధర్మశాల వంటి వేదికల్లో—అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు నిపుణులు, అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లోనే ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆ మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, “ఇంత చల్లని పరిస్థితుల్లో నేను ఎప్పుడూ ఆడలేదు, చాలా కష్టంగా అనిపించింది,” అని వ్యాఖ్యానించారు. ఆ రోజున ధర్మశాలలో AQI ‘పూర్’ స్థాయిలో ఉండగా, న్యూ చండీగఢ్‌లో రెండో టీ20 సమయంలో ‘సివియర్’ స్థాయి నమోదైంది.

ALSO READ: రేప‌ట్నుంచి తెలంగాణ‌లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. బీ కేర్ ఫుల్..!

ఈ పరిస్థితుల నేపథ్యంలో వేదికల ఎంపికలో చారిత్రక వాతావరణ సమాచారం, కాలుష్య స్థాయిలను బీసీసీఐ సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్నదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొద్దటి మ్యాచ్‌లుగా షెడ్యూల్ చేసి ఉంటే అయినా కొంత ఆట జరిగి ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాత్రి గడచే కొద్దీ పొగమంచు మరింత దట్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకులు తీవ్ర నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. చలి, పొగమంచును తట్టుకుని, అన్ని ఏర్పాట్లతో  వచ్చినా మ్యాచ్ చూడలేకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సిరీస్ నవంబర్–డిసెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో, రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నం, కటక్, అహ్మదాబాద్, గువాహటి, కోల్‌కతా వంటి నగరాల్లో నిర్వహిస్తున్నారు. బీసీసీఐ రొటేషన్ పాలసీ ప్రకారం వేదికలు కేటాయిస్తున్నప్పటికీ, శీతాకాలంలో ఉత్తర భారతంలో కాలుష్యం అధికంగా ఉండే అంశాన్ని భవిష్యత్తులో మరింత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ పశ్చిమ, దక్షిణ భారత నగరాల్లో జరగనుండటం కూడా ఈ చర్చకు బలం ఇస్తోంది.

నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్​ జరిగే అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నారు. బుమ్రా సొంతవూరు ఇదే కావడం విశేషం.  సిరీస్ గెలుపు లక్ష్యంగా భారత్ జట్టు సిద్ధమవుతుండగా,  డ్రా కోసం సౌతీలు,  మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement