Cold Wave | హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. గురువారం నుంచి చలి గాలుల తీవ్రత మరింత పెరగనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ టీ బాలాజీ హెచ్చరించాడు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందన్నాడు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 7 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాడు. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో చల్లని గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, ఓయూ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత పది రోజుల నుంచి తెలంగాణ చలి గాలులతో అల్లాడిపోతోంది. రాత్రి, ఉదయం వేళ చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు కాపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.