త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cristiano Ronaldo | 41 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని రికార్డ్.. ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డో సరికొత్త చరిత్ర

ఫిఫా వరల్డ్ కప్ 2026లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన క్రిస్టియానో రొనాల్డో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఎవరికీ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

J

Sports | Published On Jun 18, 2026, 12.49 pm IST

Cristiano Ronaldo | 41 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని రికార్డ్.. ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డో సరికొత్త చరిత్ర

సంక్షిప్త సారాంశం

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో మ్యాచ్ స్టార్ట్ చేసిన అత్యంత వయస్కుడైన అవుట్‌ ఫీల్డ్ ప్లేయర్‌గా క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 41 ఏళ్ల 132 రోజుల వయసులో ఈ ఘనత సాధించి, కెనడా మాజీ కెప్టెన్ అటిబా హచిన్సన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో ఆడుతుండటం ద్వారా.. ఆరు విభిన్న వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఆటగాడిగా లియోనెల్ మెస్సీ సరసన చేరాడు. ఈ టోర్నీలో రొనాల్డో ఒక్క గోల్ సాధించినా.. ఆరు వరల్డ్ కప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు.

Advertisement

Cristiano Ronaldo | 2026 ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) టోర్నీలో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అరుదైన మైలురాయిని అందుకున్నాడు. జూన్ 17న టెక్సాస్‌లోని హ్యూస్టన్ స్టేడియంలో డీఆర్ కాంగో (DR Congo)తో జరిగిన గ్రూప్-కె తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా.. వరల్డ్ కప్ చరిత్రలో మ్యాచ్ ఆరంభించిన 'అత్యంత వయస్కుడైన అవుట్‌ఫీల్డ్ ప్లేయర్‌'గా (Oldest Outfield Starter) సరికొత్త చరిత్ర సృష్టించాడు.

బద్దలైన పాత రికార్డ్

తన 41 ఏళ్ల 132 రోజుల వయసులో రొనాల్డో ఈ అరుదైన ఘనతను సాధించాడు. తద్వారా 2022 వరల్డ్ కప్‌లో కెనడా మాజీ కెప్టెన్ అటిబా హచిన్సన్ (39 ఏళ్ల 296 రోజులు) నెలకొల్పిన రికార్డును రొనాల్డో బద్దలు కొట్టాడు. వరల్డ్ కప్ స్టార్టర్స్ (Starting XI) వయసు పరంగా చూస్తే.. ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎస్సామ్ ఎల్ హదరీ తర్వాత స్థానం ఇప్పుడు రొనాల్డోదే.

కాగా, 1994లో 42 ఏళ్ల వయసులో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కామెరూన్ లెజెండ్ రోజర్ మిల్లా పేరిట.. వరల్డ్ కప్ ఆడిన అత్యంత వయస్కుడైన అవుట్‌ఫీల్డ్ ప్లేయర్ రికార్డ్ ఇప్పటికీ భద్రంగా ఉంది. కానీ మొదటి నిమిషం నుంచే మ్యాచ్ స్టార్ట్ చేసిన రికార్డు మాత్రం రొనాల్డో సొంతమైంది.

ఆ ఒక్క గోల్ పడితే.. లెజెండరీ రికార్డులే!

ఈ టోర్నీలో అడుగుపెట్టడం ద్వారా ఆరు విభిన్న వరల్డ్ కప్‌లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో.. తన చిరకాల ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ (Lionel Messi) సరసన చేరాడు. అయితే, ఈ టోర్నీలో రొనాల్డో ఒక్క గోల్ సాధించినా.. ఆరు వరల్డ్ కప్‌లలో గోల్స్ చేసిన ప్రపంచంలోనే ఏకైక ఆటగాడిగా అవతరిస్తాడు (మెస్సీ 2010 టోర్నీలో ఒక్క గోల్ కూడా చేయలేదు).

అలాగే, పోర్చుగల్ తరఫున అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ చేసిన యుసేబియో (9 గోల్స్) రికార్డును సమం చేయడానికి రొనాల్డో మరో అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ (143) చేసిన ఆటగాడిగా ఉన్న రొనాల్డోకు ఇది ముగింపు టోర్నీ కావడంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది.

నాకౌట్ దశలో ఆ నిరీక్షణ తీరేనా?

రొనాల్డో తన కెరీర్‌లో ఇప్పటివరకు 5 వరల్డ్ కప్‌లలో 8 గోల్స్ చేశాడు. కానీ, ఆశ్చర్యకరంగా ఇవన్నీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో వచ్చినవే. ఇప్పటివరకు ఆడిన 11 నాకౌట్ (Knockout) మ్యాచ్‌లలో రొనాల్డో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. 2022లో ఇలాంటి చెత్త రికార్డునే బ్రేక్ చేసిన మెస్సీ.. ప్రతి నాకౌట్ రౌండ్‌లో గోల్ చేసి అర్జెంటీనాకు కప్ అందించాడు. ఇప్పుడు రొనాల్డో కూడా తన నాకౌట్ డ్రౌట్‌ను ఈసారి బ్రేక్ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

వయసు మీద పడుతున్నా అల్-నస్ర్ (Al-Nassr) క్లబ్ తరఫున ఈ సీజన్‌లో 28 గోల్స్ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రొనాల్డో.. తన చివరి వరల్డ్ కప్‌ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే, డీఆర్ కాంగోతో జరిగిన ఈ చారిత్రక మ్యాచ్ 1-1 తో డ్రాగా ముగియడం అభిమానులను కాస్త నిరాశపరిచింది.

Advertisement
Advertisement