త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | శ్రీ‌లంక చేతిలో ఘోర ప‌రాజ‌యం.. సూపర్‌-8కు ఆసీస్ చేరుకునేనా..?

T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో సూపర్‌-8 అర్హత మరింత క్లిష్టంగా మారింది. 181 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన ఆసీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.

S

Sports | Published On Feb 17, 2026, 8.42 am IST

T20 World Cup 2026 | శ్రీ‌లంక చేతిలో ఘోర ప‌రాజ‌యం.. సూపర్‌-8కు ఆసీస్ చేరుకునేనా..?
Advertisement

T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో సూపర్‌-8 అర్హత మరింత క్లిష్టంగా మారింది. 181 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన ఆసీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ పరాజయం తర్వాత టోర్నీలో ముందుకు సాగాలంటే ఆస్ట్రేలియాకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్‌ను ఆస్ట్రేలియా దూకుడుగానే ప్రారంభించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ జోడీ తొలి వికెట్‌కు కేవలం 8.3 ఓవర్లలోనే 104 పరుగులు జోడించింది. ఈ దశలో ఆసీస్ 220కిపైగా స్కోరు సాధిస్తుందని భావించారు. అయితే 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్పిన్నర్లు పగ్గాలు చేపట్టడంతో మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది.

జింబాబ్వే ఓడితేనే..

ట్రావిస్ హెడ్ 56 పరుగుల వద్ద ఔటైన తర్వాత, కొద్ది సేపటికే మార్ష్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 181 పరుగులకే పరిమితమైంది. ముఖ్యంగా దుషన్ హేమంత, దుష్మంత చమీర కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పతుమ్ నిస్సంక శతకంతో మెరిసి ఒంటిచేత్తోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌తో శ్రీలంక సులభంగా లక్ష్యాన్ని చేధించింది. ఈ ఫలితం ఆస్ట్రేలియాను టోర్నీ నుంచి నిష్క్రమించే అంచుల వరకూ తీసుకువచ్చింది. సూపర్‌-8కు అర్హత సాధించాలంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకు గట్టి సవాల్ ఎదురైంది. అధికారికంగా నిష్క్రమించకపోయినా, తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆ విజయం ద్వారా నాలుగు పాయింట్లు సాధించినా, అది సరిపోదు. జింబాబ్వే తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో (ఐర్లాండ్, శ్రీలంకతో) రెండింటిలోనూ ఓడిపోవాల్సి ఉంటుంది.

కీల‌కం కానున్న నెట్ ర‌న్ రేట్‌..

ఒకవేళ జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచినా, ఆస్ట్రేలియాకు అవకాశాలు ముగిసినట్టే. జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మూడు జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో, నెట్ రన్‌రేట్ కీలకంగా మారనుంది. ఆ ప్రమాణంలో ముందున్న జట్టుకే సూపర్‌-8 బెర్త్‌ దక్కుతుంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఉన్నది ఒక్కటే. ఒమన్‌తో మ్యాచ్‌లో గెలుపు సాధించడం. అంతేకాదు, తమ బౌలింగ్ విభాగం గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. ఒక చిన్న పొరపాటు లేదా అనూహ్య ఫలితం ఆస్ట్రేలియా ప్రయాణానికి తెరదించే అవ‌కాశం ఉంది. అనుభవం ఉన్న జట్టే అయినా ఈ దశలో ప్రతీ బంతి, ప్రతీ నిర్ణయం కీలకంగా మార‌నుంది. మ‌రి ఆసీస్ గ్రూప్ ద‌శ‌లోనే నిష్క్ర‌మిస్తుందా..? సూప‌ర్‌-8కు చేరుతుందా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement
Advertisement