త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొద‌టి క‌ప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెల‌ల్లోనే రెండోది..

IPL | అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోయిన ఐపీఎల్ (IPL) ట్రోఫీని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bengaluru) గ‌తేడాది తొలిసారి ద‌క్కించుకుంది. టోర్నీ ప్రారంభ‌మైన 18 ఏండ్ల త‌ర్వాత ట్రోఫీ గెలుచుకుని అభిమానుల్లో సంతోషాన్ని నింపిన ఆర్సీబీ (RCB).. ఆ జోష్‌ని అలాగే కొన‌సాగిస్తూ 12 నెల‌ల్లో మ‌రోసారి ఐపీఎల్ విన్న‌ర్‌గా నిలిచింది.

G

Sports | Published On Jun 1, 2026, 7.31 am IST

IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొద‌టి క‌ప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెల‌ల్లోనే రెండోది..
Advertisement

IPL | త్రినేత్ర‌.న్యూస్‌: అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోయిన ఐపీఎల్ (IPL) ట్రోఫీని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bengaluru) గ‌తేడాది తొలిసారి ద‌క్కించుకుంది. టోర్నీ ప్రారంభ‌మైన 18 ఏండ్ల త‌ర్వాత ట్రోఫీ గెలుచుకుని అభిమానుల్లో సంతోషాన్ని నింపిన ఆర్సీబీ (RCB).. ఆ జోష్‌ని అలాగే కొన‌సాగిస్తూ 12 నెల‌ల్లో మ‌రోసారి ఐపీఎల్ విన్న‌ర్‌గా నిలిచింది. ఈ సీజ‌న్ ప్రారంభం నుంచి నిల‌క‌డ‌గా విజ‌య‌సాలు సాధిస్తూ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌లో ఉన్న ఆర్సీబీ గతేడాది ప్ర‌ద‌ర్శ‌న గాలివాట‌మేమీ కాద‌ని నిరూపిస్తూ అభిమానుల‌ను మ‌రింత మురిపించింది. అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఫైన‌ల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై (Gujarat Titans)ఆది నుంచి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. తొలుత క‌ట్టుదిట్ట‌మైన‌ బౌలింగ్‌తో జీటీ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డిచేసింది. వారిని 155 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసింది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ద‌క్కించుకుంది.

క్వ‌లిఫ‌య‌ర్ 2 రాజ‌స్థాన్‌పై పూర్తి అధిప‌త్యం చెలాయించిన జీటీ.. బెంగ‌ళూరుపై చ‌తిగిల‌ప‌డిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 8 వికెట్ల‌కు 155 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) మిన‌హా మ‌రే బ్యాట్స్‌మెన్ చెప్పుకోద‌గిన స్కోర్ చేయ‌లేదు. పేస‌ర్లు భువ‌నేశ్వ‌ర్‌, హేజిల్‌వుడ్ స‌త్తా చాట‌డంతో ఆ జ‌ట్టు టాప్ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో కెప్టెన్‌ గిల్ (10)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న సాయి సుద‌ర్శ‌న్ (12)ను భువ‌నేశ్వ‌ర్ పెవీలియ‌న్‌కు పంపాడు. దీంతో టైటాన్స్‌ను క‌ష్టాలు వెంటాడాయి. సుంద‌ర్ మిన‌హా వ‌చ్చిన బ్యాట్స్‌మెన్ వ‌చ్చిన‌ట్లే క్యూక‌ట్టారు. దీంతో ఆ జ‌ట్టు 155 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది.

ఆ త‌ర్వాత వెంక‌టేశ్ అయ్య‌ర్‌తో క‌లిసి బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ (75) చివ‌రి వ‌ర‌కు క్రీజులోనే ఉన్నాడు. అయ్య‌ర్ (32) ఔట‌యిన‌ప్ప‌టికీ జ‌ట్టును విజ‌యం దిష‌గా న‌డిపించాడు. ప‌డిక్క‌ల్ (1), పాటీదార్ (15), కృనాల్ పాండ్యా (1) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుతిరిగిన‌ప్ప‌టికీ.. నెమ్మ‌దిగా ఆడితూ టిమ్ డేవిడ్ (24)తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. చివ‌ర్లో డేవిడ్ ఔటైనా.. జితేశ్‌తోక‌లిసి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. 18వ ఓవ‌ర్‌లో విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీకి ఐపీఎల్ రెండో క‌ప్‌ను అందించాడు.

Advertisement
Advertisement