Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..
Moon Shrinking | ప్రశాంతంగా కనిపించే చంద్రుడి ఉపరితలంపై వేలాది పగుళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి అంతర్భాగం చల్లబడుతూ కుంచించుకుపోవడం వల్ల ఈ పగుళ్లు ఏర్పడుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. వీటితోపాటు ఒత్తిడి కారణంగా ఏర్పడిన రాతి గోడల్లాంటి నిర్మాణాలనూ పరిశోధకులు గుర్తించారు. చంద్రుడిపై భూకంపాలు, భవిష్యత్తులో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సంబంధించిన అధ్యయనాలకు ఈ వివరాలు కీలకంగా మారనున్నాయి.
- భూఉపగ్రహంపై 10వేలకుపైగానే పగుళ్లు
- భూమి తరహాలోనే చంద్రుడిపై ప్రకంపనలు
- 42–46 మీటర్ల మేర తగ్గిన చంద్రుడి వ్యాసార్థం
- పగుళ్లకు సమీపంలోనే కొన్ని భూకంప కేంద్రాలు
- ఆర్టెమిస్-3 ల్యాండింగ్ ప్రాంతాల సమీపంలోనూ పగుళ్లు
Moon Shrinking | ప్రశాంతంగా కనిపించే చంద్రుడి ఉపరితలంపై వేలాది పగుళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి అంతర్భాగం చల్లబడుతూ కుంచించుకుపోవడం వల్ల ఈ పగుళ్లు ఏర్పడుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. వీటితోపాటు ఒత్తిడి కారణంగా ఏర్పడిన రాతి గోడల్లాంటి నిర్మాణాలనూ పరిశోధకులు గుర్తించారు. చంద్రుడిపై భూకంపాలు, భవిష్యత్తులో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సంబంధించిన అధ్యయనాలకు ఈ వివరాలు కీలకంగా మారనున్నాయి. ‘ఫార్మేషన్ ఆఫ్ థ్రస్ట్ ఫాల్ట్స్ అండ్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ మూన్ ష్రింకేజ్’ పేరుతో చేపట్టిన అధ్యయనం అక్టోబర్ 14న ‘ది ప్లానెటరీ సైన్స్ జర్నల్’లో ప్రచురితమైంది. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్ఆర్ఓసీ) సేకరించిన చిత్రాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 17 ఏళ్లలో సేకరించిన చిత్రాలు, ఉపరితల సమాచారంతో చంద్రుడిపై పగుళ్ల ఆకృతి, విస్తీర్ణం, రాతి నిర్మాణాల్లో మార్పులను పరిశీలించారు.

ఎందుకు కుంచించుకుపోతోంది?
సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఒక భారీ ఖగోళ వస్తువు ఢీకొనడంతో అంతరిక్షంలోకి ఎగసిన పదార్థాలు కలిసి చంద్రుడు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తొలినాళ్లలో అత్యంత వేడిగా ఉన్న చంద్రుడి అంతర్భాగం క్రమంగా చల్లబడుతోంది. దీంతో లోపలి పదార్థాల పరిమాణం తగ్గి చంద్రుడు కుంచించుకుపోతున్నాడు. ఈ క్రమంలో వెలుపలి ఘన పొరపై ఒత్తిడి పెరిగి రాళ్లలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఒక రాతి భాగం మరో భాగంపైకి జరగడం వల్ల ఉపరితలంపై గోడల్లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. గత 40 కోట్ల ఏళ్లలో చంద్రుడి వ్యాసార్థం సుమారు 42–46 మీటర్ల మేర తగ్గింది. కుంచించుకుపోయిన రేటు ఈ కాలమంతా స్థిరంగా ఉందని అంచనా వేస్తే.. ప్రతి 10 లక్షల ఏళ్లకు గరిష్టంగా 11 సెంటీమీటర్ల మేర వ్యాసార్థం తగ్గినట్లు లెక్క. అయితే ఇది దీర్ఘకాలిక అంచనా మాత్రమే. ప్రతి ఏడాదీ చంద్రుడు ఇదే వేగంతో కుంచించుకుపోతున్నాడని దీని అర్థం కాదు.

10వేలకుపైగా పగుళ్లు.. భూకంపాలు
చంద్రుడి ఉపరితలంపై 10 వేలకుపైగా కొత్త పగుళ్లను పరిశోధకులు గుర్తించారు. ఒత్తిడి కారణంగా ఏర్పడిన 8,900కుపైగా థ్రస్ట్ ఫాల్ట్ స్కార్ప్‌లను కూడా నమోదు చేశారు. ఇవి చిన్న రాతి గోడలు లేదా మెట్ల ఆకారపు వాలుల్లా కనిపిస్తాయి. పగుళ్ల పొడవు, ఎత్తు, విస్తీర్ణంతోపాటు గతంలో లావా ప్రవహించిన ప్రాంతాల్లోని నిర్మాణాలను పరిశీలించి చంద్రుడి ఉపరితలంలో వచ్చిన మార్పులను అంచనా వేశారు. చంద్రుడిపై సంభవించే భూకంపాలను ‘మూన్‌క్వేక్స్’ అంటారు. అపోలో యాత్రల సమయంలో వ్యోమగాములు చంద్రుడిపై ఏర్పాటు చేసిన సీస్మిక్ పరికరాల ద్వారా ప్రకంపనలను నమోదు చేశారు. భూమి గురుత్వాకర్షణ ప్రభావం, ఉల్కల ఢీకొనడం, చంద్రుడి అంతర్భాగం చల్లబడుతూ కుంచించుకుపోవడం వంటి కారణాలతో ఈ ప్రకంపనలు సంభవిస్తాయి. నాసా సమాచారం ప్రకారం.. చంద్రుడి సంకోచంతో సంబంధం ఉన్న కొన్ని లోతు తక్కువ భూకంపాలు రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత వరకు ఉండొచ్చు. ఇవి ఉపరితలానికి 20–30 కిలోమీటర్ల లోతులో సంభవించవచ్చు. కొన్ని ప్రకంపనలు 10 నిమిషాలకు పైగా కొనసాగుతాయి. ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల రాళ్లు విస్తరించడం, కుంచించుకోవడం కూడా ఉపరితలానికి సమీపంలో కదలికలకు కారణమవుతుంది.
పగుళ్లకు సమీపంలో భూకంప కేంద్రాలు
గతంలో నమోదైన కొన్ని లోతు తక్కువ చంద్ర భూకంపాల కేంద్రాలు ప్రస్తుతం గుర్తించిన పగుళ్లకు సమీపంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో కొన్ని పగుళ్లు ఇప్పటికీ చురుగ్గా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పగుళ్ల సమీపంలో రాళ్లు కదలడం వల్ల ప్రకంపనలు ఏర్పడటంతోపాటు వాలులపై ఉన్న వదులైన మట్టి, రాళ్లు జారిపడవచ్చు. అయితే అన్ని పగుళ్లూ చురుగ్గా ఉన్నాయని, ప్రతి భూకంపానికీ ఇవే కారణమని నిర్ధారణ కాలేదు. భూమిపై సంభవించే భూకంపాల్లో సుమారు 90 శాతం భూ ఫలకాల సరిహద్దుల వద్ద చోటుచేసుకుంటాయి. భూమి వెలుపలి ఘన పొర అనేక ఫలకాలుగా విభజించబడి ఉండగా, చంద్రుడిపై భూమి మాదిరిగా అనేక భారీ భూ ఫలకాల సరిహద్దులు లేవు. చంద్రుడి అంతర్భాగం చల్లబడటం వల్ల ఏర్పడే ఒత్తిళ్లు ఉపరితలంపై పగుళ్లకు కారణమవుతున్నాయి.

దక్షిణ ధ్రువంలో పగుళ్లు
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని పగుళ్లు నాసా ప్రతిపాదించిన ఆర్టెమిస్-3 యాత్రకు పరిశీలిస్తున్న సంభావ్య ల్యాండింగ్ ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. గతంలో నమోదైన శక్తిమంతమైన లోతు తక్కువ చంద్ర భూకంపానికి సంబంధించిన సంభావ్య కేంద్రం కూడా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే దాని కచ్చితమైన స్థానం నిర్ధారణ కాలేదు. ఈ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవిస్తే వాలులపై ఉన్న వదులైన మట్టి, రాళ్లు జారిపడే అవకాశం ఉంది. ఇది వ్యోమగాముల ల్యాండింగ్, చంద్రుడిపై నడక, పరికరాల ఏర్పాటుపై ప్రభావం చూపవచ్చు. అయితే పగుళ్లు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతాల్లో ల్యాండింగ్ సురక్షితం కాదని చెప్పలేం. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దీర్ఘకాలిక మానవ నివాసాన్ని ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. రోబోటిక్, మానవ సహిత యాత్రల ద్వారా దశలవారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి వ్యోమగాములు నివసించడానికి, పనిచేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను నాసా ఆహ్వానించింది. ఇస్రో 2027లో చంద్రయాన్-4 ప్రయోగాన్ని చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. చంద్రుడిపై నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం. తదుపరి దశలో చంద్రయాన్-5 (లూపెక్స్) ద్వారా దక్షిణ ధ్రువానికి సమీపంలోని శాశ్వత ఛాయా ప్రాంతాల్లో నీరు, ఇతర అస్థిర పదార్థాల ఉనికిని అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతాల్లోని వనరులపై పరిశోధన చంద్రుడి దక్షిణ ధ్రువ అన్వేషణలో కీలకంగా నిలవనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tollywood | వాట్ నెక్స్ట్ - స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా కబురు ఎప్పుడు?
- ●Harish Rao | పండుగలు వస్తే చాలు.. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్?: హరీశ్ రావు
- ●Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం
- ●France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- ●Lorry Tyre | రన్నింగ్‌లో ఉండగా ఊడిన లారీ టైరు.. హైవేపై పరుగులు.. వాహనదారులకు తప్పిన ప్రమాదం.. వీడియో
- ●TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tollywood | వాట్ నెక్స్ట్ - స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా కబురు ఎప్పుడు?

Harish Rao | పండుగలు వస్తే చాలు.. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్?: హరీశ్ రావు

Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం

France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు






