త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Blood Group Jama | మరో కొత్త బ్లడ్‌గ్రూప్‌.. ‘జమా’!

New Blood Group Jama | ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్‌గ్రూప్‌లే మనకు ఎక్కువగా తెలుసు. అయితే మానవుల్లో మరో కొత్త బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌, ఇజ్రాయెల్‌కు చెందిన పరిశోధకులు గుర్తించిన ఈ కొత్త బ్లడ్‌గ్రూప్‌కు ‘జమా’ (Jama) అని పేరు పెట్టారు. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ (ISBT) దీన్ని మానవుల్లో 49వ బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థగా గుర్తించింది.

P

Science | Published On Sep 20, 2026, 5.51 pm IST

New Blood Group Jama | మరో కొత్త బ్లడ్‌గ్రూప్‌.. ‘జమా’!
Advertisement

New Blood Group Jama | ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్‌గ్రూప్‌లే మనకు ఎక్కువగా తెలుసు. అయితే మానవుల్లో మరో కొత్త బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌, ఇజ్రాయెల్‌కు చెందిన పరిశోధకులు గుర్తించిన ఈ కొత్త బ్లడ్‌గ్రూప్‌కు ‘జమా’ (Jama) అని పేరు పెట్టారు. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ (ISBT) దీన్ని మానవుల్లో 49వ బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థగా గుర్తించింది. అరుదైన రక్తం కలిగిన వారికి సరైన డోనర్‌ను గుర్తించి సురక్షితంగా రక్తమార్పిడి చేయడంలో ఈ ఆవిష్కరణ ఉపయోగపడనుంది.

ఓ మహిళ రక్తంతో వెలుగులోకి..

ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మహిళ, ఆమె సోదరుడి రక్తంలో గుర్తించిన అరుదైన యాంటీబాడీపై పరిశోధన చేస్తుండగా ఈ కొత్త బ్లడ్‌గ్రూప్‌ వెలుగులోకి వచ్చింది. పరిశోధనలో F11R జన్యువులోని మార్పులు, అది ఉత్పత్తి చేసే JAM-A ప్రొటీన్‌కు సంబంధించిన కీలక ఆధారాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ JAM-A ప్రొటీన్‌ ఆధారంగానే కొత్త బ్లడ్‌గ్రూప్‌కు ‘జమా’ అనే పేరు పెట్టారు. ఎర్ర రక్తకణాల ఉపరితలంపై ఉండే కొన్ని ప్రొటీన్లు, ఇతర పదార్థాలను యాంటిజెన్లు అంటారు. వీటిని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తిస్తుంది. అయితే ‘జమా’ బ్లడ్‌గ్రూప్‌ ఉన్నవారి ఎర్ర రక్తకణాలపై సాధారణంగా కనిపించే నిర్దిష్ట యాంటిజెన్‌ ఉండదు. దీంతో వారికి సరిపోని రక్తాన్ని ఎక్కిస్తే శరీరం దాన్ని విదేశీ పదార్థంగా గుర్తించి యాంటీబాడీలను తయారు చేసే అవకాశం ఉంటుంది. అవి ఎక్కించిన ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తే తీవ్రమైన రక్తమార్పిడి ప్రతిచర్యలు తలెత్తవచ్చు. ఈ కొత్త బ్లడ్‌గ్రూప్‌ గుర్తింపు వల్ల అరుదైన రక్తం కలిగిన రోగులను గుర్తించడం, వారికి సరిపోయే డోనర్లను ఎంపిక చేయడం సులభం కానుంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా రోగులతోపాటు వారికి సరిపోయే డోనర్లను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. అరుదైన యాంటీబాడీల కారణంగా ఎదురయ్యే సమస్యలను నిర్వహించడంతోపాటు.. భవిష్యత్తులో రక్తమార్పిడులను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడనుంది.

మరికొన్ని అరుదైన బ్లడ్‌గ్రూప్‌లు

మనకు ప్రధానంగా ఏబీవో (ABO), ఆర్‌హెచ్‌ (Rh) బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థలే ఎక్కువగా తెలుసు. అయితే, ఎర్ర రక్తకణాల ఉపరితలంపై అనేక రకాల ప్రొటీన్లు, చక్కెరలతో కూడిన పదార్థాలు ఉంటాయి. వీటిలోని తేడాల ఆధారంగా మానవుల్లో అనేక బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థలు ఉన్నాయి. అందుకే అరుదైన బ్లడ్‌గ్రూప్‌లను గుర్తించడం రక్తమార్పిడి వైద్యంలో కీలకంగా మారింది. ఇటీవలి కాలంలో మరో రెండు అరుదైన బ్లడ్‌గ్రూప్‌ వ్యవస్థలు కూడా వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్‌లో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, NHS బ్లడ్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ పరిశోధకులు ‘MAL’ బ్లడ్‌గ్రూప్‌ను గుర్తించారు. దాదాపు 50 ఏళ్లుగా పరిష్కారం కాని ఓ రక్తమార్పిడి సమస్యకు ఈ పరిశోధనతో సమాధానం లభించింది. 2025 ఆగస్టులో భారత్‌, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ‘CRIB’ అనే బ్లడ్‌గ్రూప్‌ను గుర్తించారు. భారత్‌కు చెందిన 38 ఏళ్ల మహిళకు శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరమైనప్పుడు ఈ విషయం బయటపడింది. ఆమె రక్తం అప్పటివరకు తెలిసిన ఇతర బ్లడ్‌గ్రూప్‌లతో సరిపోలకపోవడంతో విస్తృతంగా పరీక్షలు నిర్వహించగా.. ఇంతవరకు గుర్తించని ప్రత్యేక బ్లడ్‌గ్రూప్‌ ఉన్నట్లు తేలింది. అరుదైన రక్తం కలిగిన రోగులను గుర్తించడం, వారికి సరిపోయే డోనర్లను ఎంపిక చేయడం, రక్తమార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంలో ‘జమా’ బ్లడ్‌గ్రూప్‌ గుర్తింపు కీలకంగా మారనుంది.

Advertisement
Advertisement