త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | ఏడాదికి ఒక్కసారి జ‌రిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!

Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం (నవంబర్ 21న‌) కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా తెల్లవారుజామున ఆలయ మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

P

Devotional | Published On Nov 21, 2026, 4.30 am IST

Tirumala | ఏడాదికి ఒక్కసారి జ‌రిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
Advertisement

Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం (నవంబర్ 21న‌) కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా తెల్లవారుజామున ఆలయ మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. కైశిక ద్వాదశి రోజున మాత్రమే ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం. ఉగ్రశ్రీనివాసమూర్తి ఉత్సవమూర్తులను తెల్లవారుజామున 4.30 నుంచి 5.45 గంటల వరకు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణంతో నిర్వహిస్తారు. దీంతో సాలకట్ల కైశిక ద్వాదశి ఉత్సవం ముగియనుంది.

కైశిక ద్వాదశి ప్రాశస్త్యం..

కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా పిలుస్తారు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినంగా దీనికి విశేష ప్రాశస్త్యం ఉంది. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు కైశిక ద్వాదశి రోజున మేల్కొంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో టీటీడీ ప్రతి ఏటా ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది. శ్రీవైష్ణవ క్షేత్రాల్లో అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి. కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ వరాహస్వామి భూదేవికి ఒక కథను వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ ఆధారంగానే కైశిక ద్వాదశికి విశిష్టత ఏర్పడింది.

నంబదువాన్‌ భక్తి.. సత్యనిష్ఠకు ప్రతీక

కైశిక ద్వాదశి వెనుక నంబదువాన్‌ అనే భక్తుడి కథ ప్రాచుర్యంలో ఉంది. సత్యమూర్తిగా పేరొందిన నంబదువాన్‌ స్వామివారికి కైశిక రాగంలో సంకీర్తనార్చన చేసేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ బ్రహ్మరాక్షసుడు ఎదురై అతడిని తినేస్తానని బెదిరిస్తాడు. అందుకు నంబదువాన్‌ తాను ముందుగా స్వామివారికి సంకీర్తన సమర్పించి తిరిగి వస్తానని, ఆ తర్వాత తనను ఆహారంగా స్వీకరించవచ్చని ప్రమాణం చేస్తాడు. అన్న మాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించిన అనంతరం బ్రహ్మరాక్షసుడి వద్దకు తిరిగి వస్తాడు. నంబదువాన్‌ భక్తికి, సత్యనిష్ఠకు ముగ్ధుడైన స్వామివారు అతడికి మోక్షాన్ని ప్రసాదించినట్లు పురాణ కథనం. ఈ ఘట్టం కైశిక ద్వాదశి పర్వదిన ప్రాశస్త్యాన్ని చాటిచెబుతుంది.

సూర్యోదయానికి ముందే ఉగ్రశ్రీనివాసుడి ఊరేగింపు..

ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపునకు సంబంధించి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 14వ శతాబ్దంలో ఉత్సవమూర్తిని ఊరేగిస్తున్న సమయంలో సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు చారిత్రక కథనం. అప్పటి నుంచి ఉగ్రశ్రీనివాసమూర్తిని సూర్యోదయానికి ముందే ఊరేగించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కైశిక ద్వాదశి రోజున తెల్లవారుజామునే స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించి, అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement