త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Credit Card | ఒక క్రెడిట్ కార్డుతో మరో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చా!

Credit Card | క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు ఈజీగానే వాడేస్తాం.. కానీ తిరిగి చెల్లించాలన్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. సమయానికి డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు ఇతరత్రా మార్గాలు ఉన్నాయేమో అని వెతుకుతుంటాం.. అలాంటి సమయంలోనే మన దగ్గర బ్యాలెన్స్ ఉన్న క్రెడిట్ కార్డు నుంచి ఇంకో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే ఛాన్స్ ఉంటే బాగుండని అనిపిస్తుంది.

S

Popular news | Published On Dec 23, 2025, 8.30 pm IST

Credit Card | ఒక క్రెడిట్ కార్డుతో మరో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చా!
Advertisement

Credit Card | క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు ఈజీగానే వాడేస్తాం.. కానీ తిరిగి చెల్లించాలన్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. సమయానికి డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు ఇతరత్రా మార్గాలు ఉన్నాయేమో అని వెతుకుతుంటాం.. అలాంటి సమయంలోనే మన దగ్గర బ్యాలెన్స్ ఉన్న క్రెడిట్ కార్డు నుంచి ఇంకో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే ఛాన్స్ ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఈ ఆలోచన మనలో చాలామందికే వచ్చి ఉంటుంది.. మరి నిజంగా ఆ అవకాశం ఉందా? ఉంటే ఎలా ఉపయోగించుకోవచ్చు? దానివల్ల లాభమా? నష్టమా? అనేది తెలుసుకుందాం..

సాధారణంగా బ్యాంకులు ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డు బిల్లులను నేరుగా చెల్లించడానికి అనుమతించవు. అయితే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకుని క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు. అవేంటంటే..

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ విధానం

బ్యాంకులు ఒక క్రెడిట్ కార్డుతో మరో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు అనుమతించవు. కాకపోతే కొన్ని బ్యాంకులు మాత్రం ఒక క్రెడిట్ కార్డులోని బ్యాలెన్స్‌ను మరో క్రెడిట్ కార్డులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంటాయి. ఎస్‌బీఐ వంటి బ్యాంకులు వడ్డీ లేకుండా లేదంటే తక్కువ వడ్డీ రేటుతోనే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఆఫర్ ఇస్తుంటాయి. అయితే ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకోవాలి. ఆ గడువు ముగిసిన తర్వాత వాడుకుంటే ఎక్కువ వడ్డీ రేటు పడే అవకాశం ఉంటుంది.

వాలెట్ లేదా బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్

కొన్ని వాలెట్ యాప్‌లు లేదా బ్యాంకింగ్ సదుపాయాల ద్వారా క్రెడిట్ కార్డు నుంచి బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులను బదిలీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ డబ్బుతో మరో క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించవచ్చు. కానీ ఈ విధానంలో సాధారణంగా ఒక శాతం నుంచి 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తారు. కాబట్టి ఈ విధానం ఫాలో అయ్యేటప్పుడు ఎంత శాతం ఫీజును వసూలు చేస్తున్నారనేది చూసుకోవాలి.

ఇలా వాలెట్‌లు మాత్రమే కాకుండా కొంతమంది బయటి వ్యక్తులు కూడా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసి, మళ్లీ మన క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటుంటారు. దీనికోసం 2 నుంచి 4 శాతం వరకు వసూలు చేస్తుంటారు.

జాగ్రత్తలు అవసరం

ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం వల్ల తాత్కాలికంగా ఆ నెల వరకు మాత్రమే ఉపశమనం లభిస్తుంది. కానీ తర్వాత నెలకు మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. అలా ప్రతి నెలా చేయడం ద్వారా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో మన అప్పు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు అనుసరించేప్పుడు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ తేదీలు తప్పకుండా గమనించుకోవాలి.

క్రెడిట్ స్కోర్‌పైనా ఎఫెక్ట్

గడువు తేదీలోపు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటున్నదనే ఉద్దేశంతో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బిల్లులు చెల్లించేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ ఇలా క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అది ఎలా అంటే.. క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించాలనే ఉద్దేశంలో ఒకే సారి రెండు కార్డుల లిమిట్‌ను ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. దానివల్ల మన యుటిలైజేషన్ రేషియో పెరిగిపోతుంది. ఫలితంగా సిబిల్ స్కోర్‌పై అది ప్రభావం చూపిస్తుంది.

మొత్తంగా చూసుకుంటే.. క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం సాధ్యమే కానీ.. దాన్ని ఎమర్జెన్సీ టైమ్‌లో మాత్రమే చేయాలి. తరచూ ఇదే చేయడం వల్ల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో బిల్లులు పెరిగిపోతుంటాయి. దీనివల్ల ఖర్చులను నియంత్రణ అదుపు తప్పుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డుకు బదులు బయట అప్పు తెచ్చుకుని బిల్లులు క్లియర్ చేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement