త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కార‌ణ‌మేమిటి..?

Home Loan | ఏడాదికి రూ.24 లక్షల జీతం, 750 క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ హోమ్ లోన్ మంజూరు అవుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే ఉన్న రుణాలు, ఈఎంఐల భారం, ఉద్యోగ స్థిరత్వం, ఆదాయ వివరాలు, కొనుగోలు చేసే ఆస్తికి సంబంధించిన పత్రాలు వంటి అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. వీటిలో ఏదైనా సమస్య ఉంటే లోన్ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Oct 31, 2026, 2.45 pm IST

Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కార‌ణ‌మేమిటి..?
Advertisement

Home Loan | ఏడాదికి రూ.24 లక్షల జీతం, 750 క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ హోమ్ లోన్ మంజూరు అవుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే ఉన్న రుణాలు, ఈఎంఐల భారం, ఉద్యోగ స్థిరత్వం, ఆదాయ వివరాలు, కొనుగోలు చేసే ఆస్తికి సంబంధించిన పత్రాలు వంటి అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. వీటిలో ఏదైనా సమస్య ఉంటే లోన్ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ చూస్తే..

నెలకు రూ.2 లక్షల జీతం సంపాదించే 32 ఏళ్ల వ్య‌క్తి ఉదాహరణను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అతనికి 750 క్రెడిట్ స్కోర్ ఉంద‌ని సొంతంగా మొదటి ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రూ.70 లక్షల హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాడు. మంచి జీతం, ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ఉండడంతో రుణం సులభంగా వస్తుందని భావించాడు. కానీ బ్యాంకు అతని దరఖాస్తును తిరస్కరించింది. దీనికి కారణం అతడికి ఇప్పటికే కారు లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఉండడ‌మే. జీతంలో గణనీయమైన మొత్తం పాత రుణాల ఈఎంఐల చెల్లింపులకే వెళ్తుండడంతో కొత్త రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యంపై బ్యాంకు సందేహం వ్యక్తం చేసింది. ఇలా లోన్ రిజెక్ట్ అవుతుంది.

750 క్రెడిట్ స్కోర్ మంచిదే.. అయిన‌ప్ప‌టికీ..

ఇప్పటికే ఉన్న ఈఎంఐలు ఎక్కువగా ఉంటే హోమ్ లోన్ అర్హత తగ్గుతుంది. తరచూ ఉద్యోగాలు మారడం, ప్రస్తుత సంస్థలో తక్కువ కాలం పనిచేయడం లేదా ఆర్థికంగా స్థిరంగా లేని సంస్థలో ఉద్యోగం చేయడం కూడా రుణ మంజూరుపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు రుణగ్రహీత ఆదాయం కంటే కొనుగోలు చేయబోయే ఆస్తికి సంబంధించిన సమస్యలే కారణమవుతాయి. ఆస్తి పత్రాల్లో స్పష్టత లేకపోవడం, చట్టపరమైన వివాదాలు, అవసరమైన అనుమతులు లేకపోవడం వల్ల కూడా బ్యాంకులు రుణాన్ని తిరస్కరిస్తాయి. అలాగే బోనస్‌లు, ప్రోత్సాహకాలు, ఇతర వేరియబుల్ ఆదాయాలను బ్యాంకులు సాధారణ ఆదాయంగా పరిగణించవు. 750 క్రెడిట్ స్కోర్ మంచిదే అయినప్పటికీ, అది ఒక్కటే రుణ మంజూరుకు సరిపోదు.

లోన్ ద‌ర‌ఖాస్తుకు ముందు ఏం చేయాలి..?

కొత్తగా హోమ్ లోన్ కోసం ప్రయత్నించే ముందు ఇప్పటికే ఉన్న ఈఎంఐలను పరిశీలించుకోవాలి. సాధ్యమైనంత వరకు పాత అప్పులను తగ్గించుకోవాలి లేదా చెల్లించాలి. క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడంతోపాటు కొనుగోలు చేయబోయే ఆస్తికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు, అవసరమైన అనుమతులను ముందుగానే ధ్రువీకరించుకోవాలి. హోమ్ లోన్ పొందాలంటే మంచి జీతం, అధిక క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా, తీసుకున్న రుణాన్ని ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా తిరిగి చెల్లించగలమనే నమ్మకాన్ని బ్యాంకులకు కల్పించాలి. కొన్ని సందర్భాల్లో ఆదాయం కంటే అప్పుల భారం బ్యాంకుల నిర్ణయంలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్:

Cibil ScoreCredit ScoreEmiHome LoanHome Loan RejectionLoan EligibilitySalary
Advertisement
Advertisement