త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP మిస్ అయితే.. బ్యాంక్ ఖాతా, సిబిల్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా..?

మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) నెల‌వారీ చెల్లింపు విఫలమైనంత మాత్రాన ఇప్పటికే పెట్టుబడి పెట్టిన యూనిట్లు రద్దు కావు. అలాగే సిబిల్ స్కోర్‌పై కూడా ఆటోమేటిక్‌గా ప్రభావం పడదు. అయితే బ్యాంకు పెనాల్టీలు విధించే అవకాశం ఉండడంతోపాటు, వరుసగా చెల్లింపులు విఫలమైతే ఎస్‌ఐపీ రద్దయ్యే ప్రమాదం ఉంటుంది.

S

Business | Published On Nov 27, 2026, 12.21 pm IST

SIP మిస్ అయితే.. బ్యాంక్ ఖాతా, సిబిల్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా..?
Advertisement

మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) నెల‌వారీ చెల్లింపు విఫలమైనంత మాత్రాన ఇప్పటికే పెట్టుబడి పెట్టిన యూనిట్లు రద్దు కావు. అలాగే సిబిల్ స్కోర్‌పై కూడా ఆటోమేటిక్‌గా ప్రభావం పడదు. అయితే బ్యాంకు పెనాల్టీలు విధించే అవకాశం ఉండడంతోపాటు, వరుసగా చెల్లింపులు విఫలమైతే ఎస్‌ఐపీ రద్దయ్యే ప్రమాదం ఉంటుంది.

ఎస్ఐపీ మిస్ అయితే ఏమ‌వుతుంది..?

మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఎస్‌ఐపీ ద్వారా నెలవారీగా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంటారు. అయితే బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, ఆటో డెబిట్ మ్యాండేట్‌లో సమస్యలు ఉండడం వంటి కారణాలతో ఒక్కోసారి ఎస్‌ఐపీ చెల్లింపు విఫలమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు రిటర్న్ లేదా డిషానర్ ఛార్జీలు విధించే అవ‌కాశాలు ఉంటాయి. ఈ ఛార్జీలు బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి మారుతాయి. ఇవి మ్యూచువల్ ఫండ్ సంస్థలు విధించే ఛార్జీలకు భిన్నంగా ఉంటాయి. అయితే ఎస్‌ఐపీ అనేది పెట్టుబడి విధానం మాత్రమేనని, రుణం కాదని గుర్తించాలి. అందువల్ల ఎస్‌ఐపీ చెల్లింపు విఫలమైనంత మాత్రాన వ్యక్తి సిబిల్ క్రెడిట్ స్కోర్‌పై సాధారణంగా ఎలాంటి ప్రభావం ఉండదు. రుణ వాయిదా (ఈఎంఐ) లేదా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడాన్ని ఎస్‌ఐపీ వైఫల్యంతో సమానంగా పరిగణించరు.

వ‌రుస‌గా చెల్లింపులు విఫ‌ల‌మైతే..?

వరుసగా ఎస్‌ఐపీ చెల్లింపులు విఫలమైతే మాత్రం రద్దయ్యే అవకాశం ఉంటుంది. పరిశ్రమ నిబంధనల ప్రకారం రోజువారీ, వారంవారీ, రెండు వారాలకోసారి, నెలవారీ ఎస్‌ఐపీలకు వరుసగా మూడు సార్లు డెబిట్ విఫలమైతే రద్దు చేసే అవకాశం ఉంటుంది. రెండు నెలలకోసారి, త్రైమాసికం, ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చెల్లించే ఎస్‌ఐపీలకు వరుసగా రెండు సార్లు చెల్లింపులు విఫలమైతే రద్దు చేస్తారు. ఎస్‌ఐపీ రద్దయినంత మాత్రాన గతంలో కొనుగోలు చేసిన మ్యూచువల్ ఫండ్ యూనిట్లు రద్దు కావు. అవి సంబంధిత పథకంలోనే కొనసాగుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి వాటి విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అయితే భవిష్యత్తులో జరగాల్సిన పెట్టుబడులు మాత్రమే నిలిచిపోతాయి. తిరిగి పెట్టుబడులు కొనసాగించాలంటే కొత్త ఎస్‌ఐపీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కార‌ణాల‌ను తెలుసుకోవాలి..

ఎస్‌ఐపీ చెల్లింపు విఫలమైనప్పుడు ముందుగా అందుకు గల కారణాన్ని ఇన్వెస్టర్లు తెలుసుకోవాలి. బ్యాంకు ఖాతాలో తగినంత నగదు ఉందా? ఆటో డెబిట్ మ్యాండేట్ యాక్టివ్‌గా ఉందా? బ్యాంకు ఖాతా లేదా కేవైసీ వివరాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలించాలి. బ్యాంకు ఖాతా మారినట్లయితే మ్యూచువల్ ఫండ్ సంస్థ లేదా పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లో వివరాలను అప్‌డేట్ చేసి, అవసరమైన మ్యాండేట్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒక్క ఎస్‌ఐపీ మిస్ అయినంత మాత్రాన పెట్టుబడులు పోవు, సిబిల్ స్కోర్ తగ్గదు. కానీ బ్యాంకు ఛార్జీలు పడే అవకాశం, వరుస వైఫల్యాలతో ఎస్‌ఐపీ రద్దయ్యే ప్రమాదం ఉన్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement
Advertisement