త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Movies | టాలీవుడ్‌లో తెలంగాణ మ‌ట్టి క‌థ‌ల గుబాళింపు

తెలంగాణ క‌థ‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ట్రెండ్ టాలీవుడ్‌లో పెరిగింది. తెలంగాణ మ‌ట్టి వాస‌న‌లు, ఇక్క‌డి యాస భాష‌ల‌తో తెర‌కెక్కిన సినిమాలో గ్లోబ‌ల్ వైడ్‌గా ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. తెలంగాణ క‌థ‌ల్లో న‌టించ‌డానికి స్టార్ హీరోలు రెడీ అంటున్నారు.

N

News | Published On Mar 23, 2026, 1.14 pm IST

Telangana Movies | టాలీవుడ్‌లో తెలంగాణ మ‌ట్టి క‌థ‌ల గుబాళింపు
Advertisement

Telangana Movies | తెలంగాణ తాలూకు బ‌తుకు చిత్రం ఇప్పుడు వెండితెర దృశ్య‌మానం అవుతోంది. ఒక‌ప్పుడు అభ్యుద‌య సాహిత్యం, జాన‌ప‌ద క‌ళారూప‌లు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేవి. కానీ నేడు తెలంగాణ సాంస్కృతిక గ‌ళాన్ని వినిపించ‌డానికి సినిమా చ‌క్క‌టి వేదిక‌గా మారింది. తెలంగాణ రూటెడ్ క‌థ‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ట్రెండ్ పెరిగింది. ఈ ప్రాంత లోక‌ల్ క‌థ‌లు గ్లోబ‌ల్ వైడ్‌గా స‌త్తా చాటుతోన్నాయి. తెలంగాణ మ‌ట్టి వాస‌న‌ల‌ను, అస్తిత్వ మూలాల‌ను, ఈ ప్రాంత పోరాటాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఆవిష్క‌రిస్తూ ప‌లు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే

నాని ప్యార‌డైజ్‌...

టాలీవుడ్‌లో కొత్త ద‌ర్శ‌కుల‌ను, కాన్సెప్ట్‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో హీరో నాని ముందువ‌రుస‌లో నిలుస్తుంటారు. ద‌స‌రా త‌ర్వాత మ‌రోసారి తెలంగాణ క‌థ‌తో నాని ది ప్యార‌డైజ్ సినిమా చేస్తున్నారు, శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ఆగ‌స్ట్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ద‌స‌రాలో సింగ‌రేణి సంస్కృతి, అక్క‌డి పీడిత ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను క‌మ‌ర్షియ‌ల్ కోణంలో ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ప్యార‌డైజ్‌లో 1980ల కాలం నాటి హైద‌రాబాదీ ప్ర‌జ‌ల జీవితాల‌ను, మ‌నుగ‌డ కోసం వారు చూపించిన తెగువ‌ను చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. స్ల‌మ్ ఏరియాలో పుట్టిన ఓ సాధార‌ణ యువ‌కుడు హైద‌రాబాద్ సిటీనే శాసించే స్థాయికి ఎలా ఎదిగాడ‌నే పాయింట్‌తో ది ప్యార‌డైజ్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలోని డైలాగ్స్ కంప్లీట్ హైద‌రాబాదీ స్లాంగ్‌లోనే సాగుతాయ‌ట‌. అంతే కాకుండా సెట్స్ ద్వారా అల‌నాటి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మేక‌ర్స్ రీక్రియేట్ చేశార‌ట‌. ఇందులో నాని క్యారెక్ట‌రైజేష‌న్, లుక్ విభిన్నంగా ఉంటాయ‌ని అంటున్నారు. ప్యార‌డైజ్ మూవీలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరోమోహ‌న్ బాబు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

ఎల్ల‌మ్మ‌....

ప్రియ‌ద‌ర్శి హీరోగా వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బ‌ల‌గం మూవీ తెలంగాణ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. తెలంగాణ రూటెడ్ క‌థ‌ల‌తో సినిమాలు చేసి విజ‌యాల‌ను అందుకోవ‌చ్చ‌నే ధైర్యాన్ని ఫిల్మ్ మేక‌ర్స్‌లో క‌లిగించింది. కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా తెర‌కెక్కిన బ‌ల‌గం 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. బ‌ల‌గం త‌ర్వాత డైరెక్ట‌ర్ వేణు ఎల్దండి మ‌రోసారి తెలంగాణ నేటివిటీతోనే ఎల్ల‌మ్మ మూవీ రూపొందించ‌బోతున్నారు. ఈ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నిమ్న కులానికి చెందిన ఓ డ‌ప్పు క‌ళాకారుడు ఎదుర్కొన్న సామాజిక వివ‌క్ష‌, సంఘ‌ర్ష‌ణ‌తో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. అంత‌ర్లీనంగా ఇందులో భ‌క్తి ఎలిమెంట్ ఉంటుంద‌ని అంటున్నారు. తెలంగాణ మూలాల‌ను, గ్రామీణ ఆచార వ్య‌వ‌హారాల‌ను, అస్తిత్వం కోసం సాగించిన తండ్లాట‌ను ఎల్ల‌మ్మ మూవీలో గ‌త సినిమాల‌కు భిన్నంగా ద‌ర్శ‌కుడు చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఎల్ల‌మ్మ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

శ‌ర్వానంద్ భోగి....

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న భోగి మూవీ తెలంగాణ నేప‌థ్య క‌థ‌తోనే రూపొందుతోంది. తెలంగాణ‌లోని ఆదిలాబాద్, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఓ గ్రామంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. భోగి కోసం హీరో శ‌ర్వానంద్ తెలంగాణ స్లాంగ్ నేర్చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆదిలాబాద్ ప‌ల్లె సంస్కృతిని వాణిజ్య హంగుల‌తో ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మారెమ్మ‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ సోద‌రుడి కుమారుడు మాధ‌వ్ మారెమ్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలోనే రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు మంచాల నాగ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలంగాణ యువ‌కుడిగా మాధ‌వ్ ట్రాన్స్‌ఫ‌ర్మ్ అయిన తీరు ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ - క్రేజీ క‌ళ్యాణం...

తెలంగాణ పెళ్లి వేడుక తాలూకు ఔన్న‌త్యాన్ని వివ‌రిస్తూ క్రేజీ క‌ళ్యాణం పేరుతో రూర‌ల్ కామెడీ డ్రామా మూవీ రాబోతుంది. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, త‌రుణ్ భాస్క‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం తెలంగాణ‌లోనే సాగ‌డం గ‌మ‌నార్హం. ప‌ల్లెటూరి అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌కు ప్రాధాన్య‌మిస్తూ ద‌ర్శ‌కుడు బ‌ద్ర‌ప్ప ఈ సినిమాను రూపొందించారు.

ర‌ష్మిక మంద‌న్న మైసా...

ర‌ష్మిక మంద‌న్న మైసా మూవీ కూడా తెలంగాణ నేటివిటీతోనే సాగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గోండు తెగ‌ల చుట్టూ సాగే క‌థ‌తో ద‌ర్శ‌కుడు ర‌వీంద్ర పుల్లే ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచార. త‌న జాతి ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌డం కోసం ఓ యువ‌తి సాగించిన అసాధార‌ణ పోరాటం నేప‌థ్యంలో పాన్ ఇండియ‌న్ మూవీగా మైసా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.
కోర్ట్ ఫేమ్ హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి జంట‌గా న‌టించిన బ్యాండ్‌మేళం మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు స‌తీష్ జ‌వ్వాజి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీనియ‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ బ్యాండ్‌మేళం సినిమాను నిర్మించారు. ఇవే కాకుండా తెలంగాణ మ‌ట్టివాస‌న‌ల‌ను, ఇక్క‌డి బ‌తుకు చిత్రాల‌ను ఆవిష్క‌రిస్తూ ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement