త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comrade Kalyan Review | ప్రేమ కోసం కామ్రేడ్‌గా మారిన క‌ళ్యాణ్ క‌థ‌

క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఇతివృత్తాలుగా చేసుకుంటూ విప్ల‌వ నేప‌థ్యాలు రూపొందుతుంటాయి. ఈ పంథాకు భిన్నంగా న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌కు వినోదాన్ని జోడించి రూపొందిన సినిమానే కామ్రేడ్ క‌ళ్యాణ్. శ్రీవిష్ణు హీరోగా న‌టించిన ఈ సినిమాకు జాన‌కిరామ్ మారెళ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

News | Published On Oct 9, 2026, 10.30 am IST

Comrade Kalyan Review | ప్రేమ కోసం కామ్రేడ్‌గా మారిన క‌ళ్యాణ్ క‌థ‌
Advertisement

Comrade Kalyan Review |  న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు తెర‌పై ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలొచ్చాయి. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను క‌థాంశాలుగా చేసుకుంటూ విప్ల‌వ నేప‌థ్యాల‌తో ఆర్ నారాయ‌ణ‌మూర్తి, మాదాల రంగారావు వంటి దిగ్గ‌జ న‌టులు రూపొందించిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఈ జాన‌ర్‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్స్ కూడా న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేశారు. స‌మాజంలోని అస‌మాన‌త‌లు, పెత్తందారి వ్య‌వ‌స్థ ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌శ్నించేలా సీరియ‌స్‌గా ఈ సినిమాలు సాగాయి. న‌క్స‌లిజం ఇతివృత్తాల‌తో గ‌తంలో వ‌చ్చిన సినిమాల‌కు భిన్నంగా ఆద్యంతం వినోదాత్మ‌కంగా కామ్రేడ్ క‌ళ్యాణ్ రూపొందింది.

జీవ‌నోపాధి...

1990 ద‌శ‌కంలో తెలుగు రాష్ట్రాల్లో న‌క్స‌లిజం ఉద్య‌మం ఉధృతంగా సాగింది. ఆదిలాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వ‌ర‌కు అన్న‌ల ప్రాబ‌ల్యం కొన‌సాగింది. న‌క్స‌లిజం సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితులై ఎంతో మంది యువ‌త అడ‌వి బాట ప‌ట్టారు. అన్న‌ల‌ను జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌లిపేందుకు ప్ర‌భుత్వం న‌క్స‌లైట్ ముక్తి భార‌త్ పేరుతో ఓ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. వారి జీవ‌నోపాధి కోసం ప్ర‌భుత్వం ప‌రిహారంగా డ‌బ్బు ఇచ్చింది. ఈ ప‌థ‌కాన్ని అడ్డుపెట్టుకొని కొంత మంది ఫేక్ న‌క్స‌లైట్లుగా అవ‌తారం ఎత్తారు. అలాంటి ఓ యువ‌కుడి క‌థే ఈ సినిమా. డ‌బ్బు కోసం దొంగ న‌క్స‌లైట్‌గా అవ‌తారం ఎత్తిన ఓ ఓ యువ‌కుడు అనుకోని ప‌రిస్థితుల్లో పోలీసుల‌తో పాటు ప్ర‌భుత్వం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ న‌క్స‌లైట్‌గా ఎలా మారాడు అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు జాన‌కిరామ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

క‌ళ్యాణ్ క‌థ‌....

క‌ళ్యాణ్‌కు (శ్రీవిష్ణు) త‌ల్లి స‌ర‌స్వ‌తి (రాధికా శ‌ర‌త్‌కుమార్‌) త‌ప్ప ఎవ‌రూ ఉండ‌రు. ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్‌ను లీజుకు తీసుకొని న‌డిపిస్తుంటాడు. బాగా డ‌బ్బులు సంపాదించి ఆ థియేట‌ర్‌ను కొనాల‌న్న‌ది అత‌డి క‌ల‌. ఆ ఊరికి సితార (మ‌హిమా నంబియార్‌) అనే ఒరియా అమ్మాయి త‌న కుటుంబంతో క‌లిసి వ‌స్తుంది. క‌ళ్యాణ్ త‌ల్లి స‌ర‌స్వ‌తిని ఓ పెద్ద ప్ర‌మాదం నుంచి సితార కాపాడుతుంది. ఆమె మంచి మ‌న‌సుకు క‌ళ్యాణ్ ఫిదా అవుతాడు. సితార‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ వారి ప్రేమ‌కు భాష అడ్డంకిగా మారుతుంది. చాలా క‌ష్ట‌ప‌డి సితార‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌ని అనుకునే లోపు సితార ఒరియా అమ్మాయి కాదు...తెలుగ‌మ్మాయి అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. అప్పుల భారం భ‌రించ‌లేక పారిపోయి ఈ ఊరు వ‌చ్చార‌నిక‌ళ్యాణ్ తెలుసుకుంటాడు. సితార కుటుంబాన్ని అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఐదు ల‌క్ష‌లు అవ‌స‌రం అవుతాయి. స్నేహితుడు దుబాయ్ బాబు (స‌త్య‌) స‌ల‌హాతో దొంగ న‌క్స‌లైట్‌గా అవ‌తారం ఎత్తుతాడు. లొంగిపోవ‌డం ద్వారా ప్ర‌భుత్వం ఇచ్చే డ‌బ్బుతో సితార కుటుంబానికి సాయం చేయాల‌ని ప్లాన్ చేస్తాడు. కానీ పోలీస్ ఆఫీస‌ర్ జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో) వ‌ల్ల క‌ళ్యాణ్ ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. శంక‌ర‌న్న ద‌ళంలో మోస్ట్ వాంటెడ్ న‌క్స‌లైట్‌గా క‌ళ్యాణ్ మార‌తాడు. త‌ప్పించుకునేందుకు క‌ళ్యాణ్ చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టి ప్ర‌భుత్వంతో పాటు పోలీసుల‌కు టార్గెట్ అవుతాడు? క‌ళ్యాణ్ నిజ‌మైన న‌క్స‌లైట్ కాద‌నే శంక‌ర‌న్న ద‌ళం తెలుసుకుందా? జార్జ్ కుట్టి బారి నుంచి త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి క‌ళ్యాణ్ ఏం చేశాడు? తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్న‌దే మిగిలిన క‌థ‌.

సిద్ధాంతాల సంఘ‌ర్ష‌ణ‌...

రెండు వ‌ర్గాల మ‌ధ్య సిద్ధాంతాల ప‌రంగా నెల‌కొన్న వైరుధ్యాలు, సంఘ‌ర్ష‌ణ‌తో కూడుకున్న చాలా సున్నిత‌మైన క‌థాంశ‌మిది. త‌ప్పొప్పుల విష‌యంలో ఏ మాత్రం హ‌ద్దుదాటినా విమ‌ర్శ‌లు భారీగా వ‌స్తాయి. ఇలాంటి రిస్కీ స‌బ్జెక్ట్‌ను వినోదాత్మ‌కంగా ఆడియెన్స్‌కు చెప్ప‌డం అంటే క‌త్తి మీద సాములాంటిదే. ఈ ప్ర‌య‌త్నంలో కామ్రేడ్ క‌ళ్యాణ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. అటు ఉద్య‌మాన్ని స‌రిగా చూపించ‌లేదు. ఇటు కామెడీ స‌రిగ్గా పండ‌లేదు. మ‌ధ్య‌లోనే ఊగిస‌లాడింది.

గ్యాప్ లేకుండా పంచ్‌లు...

డ‌బ్బు కోసం హీరో వేసే ప్లాన్స్, త‌న థియేట‌ర్‌లో సినిమాల‌ను ఆడించేందుకు అత‌డు ప‌డే పాట్ల‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత హీరోయిన్ ఎంట్రీలో ల‌వ్‌స్టోరీలోకి క‌థ షిప్ట‌వుతుంది. భాష రాక ఆమెకు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసేందుకు హీరో చేసే ప్ర‌య‌త్నాల నుంచి ఫ‌న్‌ను జ‌న‌రేట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి చాలానే పాత్ర‌లు స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తాయి. ఆడియెన్స్‌ను న‌వ్వించేందుకు గ్యాప్ లేకుండా పంచ్‌లు వేస్తూనే ఉంటాయి. వీటిలో స‌త్య, సుద‌ర్శ‌న్ ట్రాక్‌లు కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తాయి. విచిత్ర‌మైన మ్యాన‌రిజ‌మ్స్‌, వ‌న్ లైన‌ర్స్‌తో శ్రీవిష్ణు న‌వ్వించాడు. హీరోయిన్ ఫ్యామిలీని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నంలో క‌ళ్యాణ్‌...కామ్రేడ్ క‌ళ్యాణ్‌గా ఎలా మారాడ‌నే ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి అడుగుపెట్టారు.

లిమిటేష‌న్స్‌...

అక్క‌డి నుంచే క‌థ‌లో కామెడీ గ్రాఫ్ త‌గ్గుతూ వ‌చ్చింది. విప్ల‌వ‌మే ఊపిరిగా ప‌నిచేసే వ్య‌క్తులు, వారి మ‌ధ్య అనుకోకుండా ఇరుక్కుపోయిన క‌ళ్యాణ్‌.. ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే ప‌రిణామాల నుంచి అనుకున్న స్థాయిలో వినోదం రాబ‌ట్టుకోలేక‌పోయారు. లిమిటేష‌న్స్ వ‌ల‌నో, విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌నే భ‌యంతోనూ డైరెక్ట‌ర్ ఆచితూచి అడుగులు వేశాడు. మినిస్ట‌ర్ కిడ్నాప్ ట్రాక్, ఉపేంద్ర లిమాయో ఎపిసోడ్ ఆరంభం బాగున్నా...పోనుపోను చిరాకు పెట్టిస్తాయి. ఓ చిన్న మెసేజ్ ఇచ్చి సినిమాను ఎండ్ చేశారు. అది అంత ఎఫెక్టివ్‌గా లేదు.

లాజిక్స్‌తో ప‌నిలేదు...

శ్రీవిష్ణు సినిమా అన‌గానే లాజిక్కుల‌తో ప‌నేం లేద‌ని డైరెక్ట‌ర్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఇలాంటి సీరియ‌స్ స‌బ్జెక్ట్‌లో లాజిక్‌లు లేక‌పోతే ఆడియెన్స్ క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే. విప్ల‌వ‌నేప‌థ్యానికి, వినోదానికి సింక్ స‌రిగ్గా కుద‌ర‌లేదు.
కామ్రేడ్ క‌ళ్యాణ్ లాజిక్‌ల‌తో ప‌ని లేకుండా టైమ్‌పాస్ కోసం చూస్తే ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఉద్య‌మం కోణం నుంచి చూస్తే క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే.

Advertisement
Advertisement