One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
One Nation One Election | ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బిల్లు పార్లమెంటులో ఈ దఫా ఆమోదం పొందితే జమిలి ఎన్నికలు 2034లో జరగాలని ముసాయిదా స్పష్టం చేస్తున్నది. అయితే.. 2028 ల్లోపు ఎన్నికల తేదీ పై రాజ్యాంగ సవరణ చేస్తే 2029 నుంచే జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నది.
2029లోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ కల నెరవేరేనా?
సంక్షిప్త సారాంశం
2034లో జమిలి ఎన్నికలు జరిగేలా బిల్లు ముసాయిదా ఉంటే దాదాపుగా ప్రతిపక్షాలు ఇందుకు అభ్యంతరం పెట్టే అవకాశం లేదు. కానీ ఒక వేళ 2029లోనే జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటే మాత్రం.. విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురయ్యే ప్రమాదం ఉంది. 543 మంది సభ్యులుండే లోక్ సభ (Lok Sabha) లో ప్రస్తుతం 540 మంది ఎంపీలు ఉన్నారు. 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ జరిగితే ప్రస్తుతం ఆమోదానికి కావాల్సిన 2/3 మెజారిటీ సంఖ్య 362. కానీ ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ (NDA) బలం 318 మాత్రమే.ఇండియా(INDIA) కూటమికి 184 మంది ఎంపీలు ఉన్నారు.
-
2034లోనే జమిలి జరగాలంటూ స్పష్టం చేస్తున్న ముసాయిదా బిల్లు
-
2029 లోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
-
2028లోగా రాజ్యాంగ సవరణ చేస్తే సాధ్యమేనని చెబుతున్న జేపీసీ అధ్యక్షుడు చౌదరీ
-
ఈ ప్రతిపాదనపై విపక్షాల అభ్యంతరం
-
రాజ్యాంగ సవరణ కోసం 2/3 మెజారిటీ కావాల్సిందే
-
సవరణకు తగినంత బలం లేని ఎన్డీఏ క్రాస్ ఓటింగ్ పైనే ఎన్డీఏ ఆశలు
One Nation One Election | త్రినేత్ర న్యూస్ : ఒకే దేశం ఒకే ఎన్నిక (One Nation One Election) . రాజకీయ వర్గాలన్నింటికీ ఓ వైపు ఆసక్తి రేపుతూనే ఉన్నా.. మరోవైపు అదే స్థాయిలో కొంత ఆందోళన కూడా కలిగిస్తున్న వ్యవహారం. 2029 నాటికి ఈ బిల్లు (one Nation One Election 'The Constitution 129th Amendment Bill 2024) ఆమోదం పొందితే 2034లో జమిలి ఎన్నికలు జరగాలంటూ ముసాయిదా స్పష్టం చేస్తుండగా.. ముసాయిదా(bill draft) లో మార్పులు చేసి రాజ్యాంగ సవరణ (Constitution Amendment) చేసి.. 2029లోనే ఈ ఎన్నికలు జరపాలని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం యోచిస్తున్నది. మరోవైపు ముసాయిదా బిల్లులో ఉన్నట్లుగా కాకుండా ఎన్నికలు జరిపే గడువును ముందుకు జరిపితే అందుకు ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా?..వంటి ప్రశ్నలు ఈ బిల్లును చుట్టుముడుతున్నాయి.
1967 వరకు జమిలి ఎన్నికలే
జమిలి ఎన్నికలు ఇదే మొదటి సారి కాదు. 1951 నుంచి 1967 వరకు వరుసగా 4 పర్యాయాలు లోకసభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. అయితే, 1968, 1969 సంవత్సరాల్లో కొన్ని రాష్ట్ర శాసనసభల ముందస్తు రద్దు వల్ల ఈ జమిలి ఎన్నికల ప్రస్థానానికి అంతరాయం కలిగింది. నాలుగో లోక్ సభ కూడా 1970లో ముందస్తుగా రద్దవగా.. 1971లో కొత్తగా ఎన్నికలు జరిగాయి.మొదటి మూడు లోక్ సభలూ అయిదేళ్ల కాలాన్ని పూర్తి చేయగా.. అందుకు భిన్నంగా, అత్యవసర పరిస్థితి ప్రకటన వల్ల అధికరణ 352 ద్వారా అయిదో లోక్ సభ కాలపరిమితిని 1977 వరకు పొడిగించారు. అప్పటి నుంచి ముందస్తు రద్దు, కాల పరిమితి పొడిగింపుల వల్ల జమిలి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. కాగా, ఈ జమిలి ఎన్నికల కోసం ఎన్డీఏ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ( former President Ram Nath Kovind) నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ (high level committee)ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వేలాది మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. 2024 మార్చి 14న తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (president Droupadi Murmu) సమర్పించారు. ఈ బిల్లును 2024 సెప్టెంబరు 18న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.
7 లక్షల కోట్లు ఆదా చేయడం కోసమే
ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి రెండు బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం 2024 డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టింది.లోక్ సభ, శాసనసభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. తదనంతరం.. ఈ జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు ఎంపీ పీపీ చౌదరి (Chairman Shri P.P. Chaudhary) అధ్యక్షతన 39 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (Joint committee on the Constitution on 'One Nation, One Election') ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు సంఘం గడువు పెంచారు. దేశంలో దాదాపు 98 కోట్ల మంది ఓటర్లు (సర్ ప్రక్రియకు ముందు) ఉన్నారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 11 లక్షల పోలింగ్ బూతుల్లో అటు పార్లమెంట్ ఎన్నికలు, శాసన సభ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. నిర్దిష్ట గడువు కలిగిన ఈ ఎన్నికలన్నింటికీ కలిపి దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని వీటిని ఆదా చేసేందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక లాభపడుతుందని పార్లమెంటరీ సంయుక్త సంఘం అధ్యక్షుడు పీపీ చౌదరి తెలిపారు.
2029 కోసం ప్రత్యేక వ్యూహం
ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బిల్లు పార్లమెంటులో ఈ దఫా ఆమోదం పొందితే జమిలి ఎన్నికలు 2034లో జరగాలని ముసాయిదా స్పష్టం చేస్తున్నది. అయితే.. 2028 ల్లోపు ఎన్నికల తేదీ పై రాజ్యాంగ సవరణ చేస్తే 2029 నుంచే జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రెండు రకాల వ్యూహాలను ప్రభుత్వం అవలంబిస్తున్నది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ..2029లోనే ఎన్నికలు వచ్చేలా పార్టీల మద్దతు కూడగడుతున్నది. అది సాధ్యం కాని పక్షంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి.. వారిని ఒప్పించి..ముందస్తుగా శాసన సభలను రద్దు చేయించి ఏక కాలంలో ఎన్నికలు జరిగేందుకు కసరత్తు చేస్తున్నది.
సభల్లో బలం సరిపోతుందా?
2034లో జమిలి ఎన్నికలు జరిగేలా బిల్లు ముసాయిదా ఉంటే దాదాపుగా ప్రతిపక్షాలు ఇందుకు అభ్యంతరం పెట్టే అవకాశం లేదు. కానీ ఒక వేళ 2029లోనే జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటే మాత్రం.. విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురయ్యే ప్రమాదం ఉంది. 543 మంది సభ్యులుండే లోక్ సభ (Lok Sabha) లో ప్రస్తుతం 540 మంది ఎంపీలు ఉన్నారు. 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ జరిగితే ప్రస్తుతం ఆమోదానికి కావాల్సిన 2/3 మెజారిటీ సంఖ్య 362. కానీ ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ (NDA) బలం 318 మాత్రమే.ఇండియా(INDIA) కూటమికి 184 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకే (DMK), వైఎస్సార్సీపీ, యాప్, ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ఏ పక్షానికీ చెందని వారు 38 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్య సభలో 250 మంది సభ్యులకు గాను సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్య 164. ప్రస్తుతం ఎన్డీఏ బలం 154 కు చేరింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన బలం ఎన్డీఏ వద్ద లేదని స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో సభలో అధికార పక్షం ఇక క్రాస్ ఓటింగ్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ అంత సులువైన వ్యవహారం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓటింగ్ రోజు.. కొందరు సభ్యులు హాజరు కాకపోతే?
బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యా బలం 362. అయితే.. సభలో ఓటింగ్ జరిగే రోజున ఎవరైనా సభ్యులు హాజరు కాకపోతే అది ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్షానికి సంఖ్యా బలం పెరుగుతుంది. ఏప్రిల్ 16 ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కొందరు ఓటింగ్ కు హాజరు కాకపోవడం కూడా బిల్లు వీగిపోయేలా చేయడమే ఇందుకు ఉదాహరణ.
17 రాష్ట్రాలు ఒప్పుకునే అవకాశం
ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి పదవిని కలిగి ఉంది. పార్లమెంటరీ సంయుక్త సంఘం చైర్మన్ పీపీ చౌదరి చెబుతున్నట్టుగా.. ఒక వేళ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపితే బీజేపీ పాలిత 17 రాష్ట్రాలు జమిలికి ఒప్పుకునే అవకాశం ఉన్నది. కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా .. ఇందుకు సమ్మతించవచ్చు.
సందిగ్ధత తొలిగేదెప్పుడు?
2029లో జమిలి ఎన్నికలు జరగవని.. 2034లోనే జరుగుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది చెప్పారు. కానీ 3 నెలల క్రితం.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్మన్ పీపీ చౌదరి మాట్లాడుతూ.. 2029లో కూడా జమిలి ఎన్నికలు సాధ్యమేనని వ్యాఖ్యానించడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేస్తామని చౌదరి..ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేని అధికార పక్షం .. ఒకే దేశం ఒకే ఎన్నికను 2029లో నిర్వహిస్తుందా లేక 2034 లో జరిపేలా నిర్ణయిస్తుందా..అన్నది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్






