త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

One Nation One Election | జమిలితో ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉంటుందా? జేపీసీ చైర్మన్ చౌద‌రి ఏమన్నారంటే!

One Nation One Election | దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ (One Nation One Election) ప్రతిపాదనపై కసరత్తు కొనసాగుతోంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన రాజ్యాంగ, రాజకీయ, ఆచరణాత్మక అంశాలను పరిశీలిస్తున్నట్లు కమిటీ చైర్మ‌న్ పీపీ చౌద‌రి తెలిపారు.

P

National | Published On Oct 31, 2026, 4.47 pm IST

One Nation One Election | జమిలితో ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉంటుందా? జేపీసీ చైర్మన్ చౌద‌రి ఏమన్నారంటే!
Advertisement

One Nation One Election | దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ (One Nation One Election) ప్రతిపాదనపై కసరత్తు కొనసాగుతోంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన రాజ్యాంగ, రాజకీయ, ఆచరణాత్మక అంశాలను పరిశీలిస్తున్నట్లు కమిటీ చైర్మ‌న్ పీపీ చౌద‌రి తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ 41 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపిందని వెల్లడించారు. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తోందని, వివిధ రాజకీయ పార్టీల నుంచి సూచనలు కోరుతున్నామని చెప్పారు.

నాలుగుసార్లు జమిలి ఎన్నికలు

1952 నుంచి 1967 వరకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు నాలుగుసార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయని చౌద‌రి గుర్తుచేశారు. ఎన్నికల సమయాన్ని సమన్వయం చేసేందుకు అప్పట్లో 8-9 రాష్ట్రాల అసెంబ్లీలను గడువు ముగియకముందే రద్దు చేశారని తెలిపారు. దీంతో లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆయా రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు. జమిలి ఎన్నికల ఆలోచన రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ పరిషత్‌ సభ్యుల దృక్పథంలోనూ ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయన్నారు.

ప‌ది రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాల సేకరణ

జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఇప్పటివరకు ఢిల్లీలో 25 సమావేశాలు నిర్వహించిందని చౌధరి తెలిపారు. దాదాపు 10 రాష్ట్రాల్లో పర్యటించి వివిధ వర్గాలతో చర్చించినట్లు చెప్పారు. పరిశ్రమల ప్రతినిధులు, పౌరసంఘాలు, రాజకీయ పార్టీలతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల అభిప్రాయాలు సేకరించినట్లు వివరించారు. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ స్పీకర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులతోనూ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. వీరంతా తమ అనుభవాల ఆధారంగా కీలక సూచనలు చేశారని, అవి ప్రతిపాదనపై సమగ్ర అవగాహనకు, నివేదిక రూపకల్పనకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాంతీయ పార్టీలపై ప్రభావం ఉంటుందా?

జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గుతుందా? దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై ప్రభావం పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని చౌద‌రి తెలిపారు. ఈ అంశాలపై నిపుణులు 1967 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల చరిత్రను విశ్లేషించినట్లు చెప్పారు. 1967, 1971, 1977, 1980, 1984, 1989 ఎన్నికలతోపాటు.. 1989-2014 మధ్య సంకీర్ణ ప్రభుత్వాల కాలం, 2014, 2019, 2024 ఎన్నికల సరళిని పరిశీలించినట్లు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరిగినప్పుడు కేంద్రంలో బలంగా ఉన్న అధికార పార్టీ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిపారు. దీనివల్ల ప్రాంతీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని వారి విశ్లేషణలో వెల్లడైనట్లు చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

నిపుణులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి అందిన సూచనలను కమిటీ పరిశీలిస్తోందని చౌద‌రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడంతోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే విధానాన్ని రూపొందించడమే లక్ష్యమని ఆయ‌న వెల్లడించారు.

ట్యాగ్స్:

Assembly ElectionsElection ReformsJoint Parliamentary CommitteeJPC ChairmanLok Sabha ElectionsOne Nation One ElectionOne Nation One Election BillPP ChaudharyRegional PartiesTelugu News
Advertisement
Advertisement