గోవాలోని ఫేమస్ టూరిస్టు ప్లేస్ అయిన ఆర్పోరాలో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిర్చ్ బై రోమియో లేన్ అనే పేరుతో ఉన్న నైట్ క్లబ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయాలపాలయ్యారు. మృతుల్లో టూరిస్టులు, క్లబ్ సిబ్బంది ఉన్నారు. ఇరుకైన దారి, ఆకుల అలంకరణే మృత్యుపాశాలు నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం భద్రతా ప్రమాణాలు లేకపోవడమే అని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన సమయంలో నైట్‌క్లబ్‌లో బాలీవుడ్ బ్యాంగర్ నైట్ పేరుతో డీజే ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో వంద మందికి పైగా పర్యాటకులు అక్కడ ఉన్నారు. ప్రమాదం జరగ్గానే అక్కడి నుంచి బయటపడటానికి చాలా మంది ప్రయత్నించినా ఇరుకైన దారి వల్ల బయటపడలేకపోయారు. ఇరుకు దారి అవడంతో తొక్కిసలాట జరగడం, పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక కొందరు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు క్లబ్ లోపల అలంకరణ కోసం ఎండిన తాటి ఆకులను వాడారు. మండే స్వభావం ఉన్న వెదురు బొంగులను వాడారు. అవి మంటలు వేగంగా వ్యాపించడానికి దోహదమయ్యాయి. నిజానికి మంటలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న డ్యాన్స్ ఫ్లోర్ వద్ద మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారు భయంతో కిచెన్ వైపు పరుగులు తీశారు. అక్కడి నుంచి బయటికి వెళ్లే దారి లేకపోవడంతో కిచెన్ వైపు వెళ్లిన వారంతా మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గోవా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఘటన స్థలానికి చేరుకొని మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. క్లబ్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. క్లబ్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.