త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి

తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర సహాయ మంత్రి పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఎల్. మురుగన్ రాజీనామా చేశారు.

J

National | Published On Oct 13, 2026, 6.52 pm IST

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి

సంక్షిప్త సారాంశం

కేంద్ర సమాచార-ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి డాక్టర్ ఎల్. మురుగన్ రాజీనామా చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలిపారు. రోజువారీ కూలీల కొడుకైన తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో ఐదేళ్లు అవకాశం కల్పించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మురుగన్ తాజా రాజీనామాతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.

Advertisement
  • కేంద్ర మంత్రివర్గానికి ఎల్. మురుగన్ రాజీనామా
  • రాజ్యసభ పదవికి సైతం గుడ్‌బై
  • తమిళనాడుపైనే పూర్తి దృష్టి

L Murugan resigns Union Minister | త్రినేత్ర న్యూస్ : కేంద్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఎల్. మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనను విధుల నుంచి తప్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఐదు పేజీల సమగ్ర లేఖను సమర్పించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు పూర్తి సమయాన్ని కేటాయించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

'నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్'

తన రాజీనామా నిర్ణయం గురించి సోషల్ మీడియా వేదికగా ఎల్. మురుగన్ స్పందించారు. "గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌తో పాటు తమిళనాడుకు సేవలందించడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవం. ఇప్పుడు నేను మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి, మన కార్యకర్తలతో కలిసి నిలబడాలని భావిస్తున్నాను. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు నన్ను నేను పూర్తిగా అంకితం చేసుకుంటాను. దేశమే మొదటిది.. పార్టీ తర్వాతి స్థానం.. స్వార్థం చిట్టచివరిది" అని ఆయన పేర్కొన్నారు.

ప్రధానికి భావోద్వేగ లేఖ

ప్రధాని మోదీకి రాసిన లేఖలో మురుగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని, మూలాలను గుర్తుచేసుకున్నారు. "నేను ఏ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా, పశువుల కాపరులుగా పనిచేశారు. కొణూరు గ్రామంలో ఇప్పటికీ వారు సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. వారి కొడుకు ఒకరోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తాడని వారు కలలో కూడా ఊహించి ఉండరు. నాపై నమ్మకం ఉంచి కేంద్ర కేబినెట్‌లో ఐదేళ్లు పనిచేసే అవకాశం కల్పించారు. ఆ నమ్మకాన్ని తమిళనాడు ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య అలుపెరగని శ్రమతో నిరూపించుకునేందుకు మీ ఆశీస్సులు కావాలి" అని ఆయన లేఖలో ప్రస్తావించారు.

ఎవరీ ఎల్.మురుగన్?

అరుణ్ధతియార్ సామాజిక వర్గానికి చెందిన ఎల్. మురుగన్.. తమిళనాడులోని నమక్కల్‌లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీ (ABVP) ద్వారా రాజకీయ ప్రవేశం చేసి, మూడు దశాబ్దాలకు పైగా సంఘ్ పరివార్, బీజేపీలతో కలిసి పనిచేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ వైస్-ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనను 2020లో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.

ఆ తర్వాత జూలై 2021లో మోదీ కేబినెట్‌లోకి సహాయ మంత్రిగా ప్రవేశించి, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నీలగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, కేంద్ర నాయకత్వం ఆయనకు మళ్లీ కేబినెట్ బెర్త్ కల్పించింది. వాస్తవానికి ఆయన రాజ్యసభ పదవీకాలం 2030 వరకు ఉన్నప్పటికీ, పార్టీ విస్తరణ కోసం స్వచ్ఛందంగా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.

త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ?

జూన్, జూలై నెలల్లో కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టూ తమ పదవుల నుంచి తప్పుకోగా, తాజాగా ఎల్. మురుగన్ కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) ఖాయమన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో మరింత ఊపందుకున్నాయి.

Advertisement
Advertisement