త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి భరోసా!

Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నగరానికి అదనంగా 60 ఎంజీడీల నీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. ప్రజలు 20 శాతం నీటిని పొదుపు చేస్తే రోజుకు 80 ఎంజీడీల నీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు.

P

Telangana | Published On Oct 13, 2026, 5.42 pm IST

Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి భరోసా!
Advertisement
  • 20 శాతం పొదుపు చేస్తే రోజుకు 80 ఎంజీడీలు ఆదా
  • మల్లన్నసాగర్‌ నుంచి నవంబర్‌లో అదనంగా 20 ఎంజీడీల నీరు
  • 60 రోజుల పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు
  • ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు

Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నగరానికి అదనంగా 60 ఎంజీడీల నీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. ప్రజలు 20 శాతం నీటిని పొదుపు చేస్తే రోజుకు 80 ఎంజీడీల నీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు 60 రోజుల పాటు విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అదనంగా 60 ఎంజీడీల నీరు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో తాగునీటి సరఫరా సన్నద్ధతపై మంగళవారం సచివాలయంలో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, మంజీరా, కృష్ణా, గోదావరి నదుల ద్వారా నగరానికి ప్రస్తుతం 560 ఎంజీడీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. అదనంగా కృష్ణా నుంచి 15 ఎంజీడీలు, మిషన్‌ భగీరథ ద్వారా 40 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి మరో 5 ఎంజీడీల నీటిని సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే పైప్‌లైన్‌ నిర్మాణం నవంబర్‌లో పూర్తికానుందని, తద్వారా అదనంగా 20 ఎంజీడీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత రెండు మూడు నెలలుగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో నగరంలో నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగిందని అధికారులు వివరించారు.

శుద్ధి చేసిన నీటితో అవసరాలు తీర్చుకోవాలి

గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు) పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సీఎస్‌ ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌, వాహనాల శుభ్రత వంటి గృహేతర అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీన్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మంజీరా, సింగూరు జలాశయాలపై ఆధారపడిన మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సంజయ్‌ జాజు తెలిపారు. ఆయా జిల్లాల్లో బోరుబావులు, ఇతర నీటి వనరులను ఇప్పటికే గుర్తించినట్లు పేర్కొన్నారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.

వృథాను అరికడితేనే నీటి భద్రత

జలమండలి సరఫరా చేసే తాగునీటితో వాహనాలను కడగడం, ఇతర అవసరాలకు నీటిని వృథా చేయడం వంటి చర్యలను అరికట్టాలని సీఎస్‌ ఆదేశించారు. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 60 రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, సినిమా నటులు, ప్రముఖులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి నీటి చుక్కను విలువైన వనరుగా భావించి పొదుపుగా వినియోగించాలని, ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని సంజయ్‌ జాజు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement