త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fauzi Musa | బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం

Fauzi Musa | జ‌మ్ము కశ్మీర్‌ (Jammu Kashmir) బుద్గాం జిల్లా (Budgam district)లో చోటు చేసుకున్న ఎన్‌కౌంట‌ర్‌లో లష్కరే తొయిబా (LeT) టాప్ క‌మాండ‌ర్ ఫౌజి ముసా హ‌త‌మ‌య్యాడు.

D

National | Published On Sep 30, 2026, 12.59 pm IST

Fauzi Musa | బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం
Advertisement

Fauzi Musa | త్రినేత్ర న్యూస్ : జ‌మ్ము కశ్మీర్‌ (Jammu Kashmir)లోని బుద్గాం జిల్లా (Budgam district)లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భద్రతా బలగాల (Security forces)కు, ఉగ్ర‌వాదుల‌ (Terrorists)కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబా (LeT) టాప్ క‌మాండ‌ర్ ఫౌజి ముసా హ‌త‌మ‌య్యాడు. అత‌డి అస‌లు పేరు సులైమాన్ షా (Suleyman Shah). అయితే, మొహ‌మ్మ‌ద్ ఆసిఫ్ అలియాస్ హ‌షిమ్ మూసాగా కూడా పిలుస్తారు.

యూజ్మార్గ్ సమీపంలోని కొరాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు న‌క్కి ఉన్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో ఇండియ‌న్ ఆర్మీ, జ‌మ్ము క‌శ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్త ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన బలగాలు వారిని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయితే, ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సైతం ఎదురు కాల్పుల‌కు దిగారు. దీంతో అట‌వీ ప్రాంతం కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే కమాండర్ ముసా హతమైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇంత‌కీ ఎవ‌రీ ఫౌజి ముసా..?

ఫౌజి ముసా (Fauzi Musa).. ఉగ్రవాది పాక్ సైన్యం తరహాలో ప్రత్యేక శిక్షణ పొందాడు. గతంలో అత‌డు పాకిస్థాన్‌ సైన్యంలోని ప్రత్యేక దళంలో పారా కమాండోగా పనిచేశాడు. ప్ర‌స్తుతం అత‌డు క‌రుడుగ‌ట్టిన టెర్రరిస్టుగా మారిన‌ట్లు అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర‌సంస్థ లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నాడు. లష్కరే తోయిబా సూత్రధారులే ముసాను కశ్మీర్‌కు పంపినట్లు స‌మాచారం. పూంచ్-రజౌరీ నుంచి కశ్మీర్ లోయ వరకు అనేక ఉగ్రదాడులకు ముసా ప్ర‌ధాన సూత్రధారిగా వ్యవహరించాడు.

సెప్టెంబర్ 2023లో కశ్మీర్‌లోకి చొరబడిన ఫౌజి.. గత మూడేళ్లుగా అక్కడ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 2025లో జరిగిన పెహ‌ల్గామ్ దాడి కేసులో కూడా ఇతడు నిందితుడిగా ఉన్నాడు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి విచార‌ణ‌లో ముసా పేరు తొలిసారి వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అత‌డిపై నిఘా పెట్టాయి. జమ్ము కశ్మీర్ రీజియన్‌లో జరిగిన అనేక వ్యూహాత్మక ఆకస్మిక దాడుల వెనుక ముసా గ్రూప్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.

2023 డిసెంబర్‌లో డేరా కీ గలీ (Dera Ki Gali) ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై జరిగిన ఆకస్మిక దాడి, 2024 మే నెలలో పూంచ్‌లో భారత వాయుసేన (IAF) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి, 2024 అక్టోబర్‌లో గుల్మార్గ్ సమీపంలోని బోటా పత్రి (Buta Pathri) వద్ద భద్రతా బలగాలపై జరిగిన దాడి వెనుక ముసా హ‌స్తం ఉన్న‌ట్లు తేల్చారు. ఈ నెల మొద‌టి వారంలోనే యూస్‌మార్గ్ కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముసా త‌ప్పించుకున్నాడు. ఆ ఎన్‌కౌంట‌ర్‌లో అత‌డి సహచరుడు యాసిర్ మరణించాడు. అప్పుడు త‌ప్పించుకున్న ముసా తాజా కాల్పుల్లో హ‌త‌మ‌య్యాడు.

Also Read..

తోటి జ‌వాన్ల‌పై కాల్పులు.. న‌లుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

అరేబియా సముద్రంలో రూ.3వేల కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌.. ఐదుగురు పాక్ జాతీయులు అరెస్ట్‌

యాపిల్ పే వ‌చ్చేసింది.. ఇక ఐఫోన్‌తోనే చెల్లింపులు..

Advertisement
Advertisement