త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Floating post office | దేశంలో ఏకైక తేలియాడే పోస్టాఫీస్.. ఇక‌పై ఉద‌యం 9 నుంచి రాత్రి 9 వ‌ర‌కు సేవ‌లు

Floating post office | ప్ర‌కృతి అందాల‌కు నెల‌వైన క‌శ్మీర్‌లోని (Jammu Kashmir) శ్రీన‌గ‌ర్‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డి ప్ర‌సిద్ధ దాల్ స‌ర‌స్సుపై (Dal Lake) తేలియాడే పోస్టాఫీసే (Floating post office) ఆ ప్ర‌త్యేక‌త‌. భార‌త‌దేశంలో ఉన్న‌ ఏకైక తేలియాడే పోస్టాఫీస్ అదే కావ‌డం విశేషం.

G

National | Published On Nov 10, 2026, 11.14 am IST

Floating post office | దేశంలో ఏకైక తేలియాడే పోస్టాఫీస్.. ఇక‌పై ఉద‌యం 9 నుంచి రాత్రి 9 వ‌ర‌కు సేవ‌లు
Advertisement

Floating post office | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌కృతి అందాల‌కు నెల‌వైన క‌శ్మీర్‌లోని (Jammu Kashmir) శ్రీన‌గ‌ర్‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డి ప్ర‌సిద్ధ దాల్ స‌ర‌స్సుపై (Dal Lake) తేలియాడే పోస్టాఫీసే (Floating post office) ఆ ప్ర‌త్యేక‌త‌. భార‌త‌దేశంలో ఉన్న‌ ఏకైక తేలియాడే పోస్టాఫీస్ అదే కావ‌డం విశేషం. ఇది పోస్టల్ సేవలతో పాటు కశ్మీర్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తున్న‌ది. స్థానికులకు సేవలు అందిస్తూనే పర్యాటకులను ఆకర్షిస్తూ.. 'మై స్టాంప్స్' ద్వారా ప్రత్యేక జ్ఞాపకాలను సృష్టిస్తున్నది. దాల్ స‌ర‌స్సులో హౌస్ బోట్లు, తేలియాడే తోట‌లు, ప‌డ‌వ‌ల‌తోపాటు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన ఈ ప్రతిష్టాత్మక పోస్టాఫీస్ ఇకపై అద‌న‌పు వేళ‌ల్లోనూ ప‌నిచేయ‌నుంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలందించనుంది.

నెహ్రూ పార్క్ (Nehru Park) వద్ద పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరగడం, సాధారణ కార్యాలయ వేళల తర్వాత కూడా తపాలా సేవల కోసం డిమాండ్ పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళలను పొడిగించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. దీనివల్ల స్థానికులు, హౌస్‌బోట్ నిర్వాహకులు, శికారా వాలాలు, పర్యాటక రంగ భాగస్వాములతో పాటు పర్యాటకులకు తపాలా సేవలను వినియోగించుకోవడానికి మరింత అవ‌కాశం లభించ‌నుందని వెల్లడించింది.

సంప్ర‌దాయ క‌శ్మీరీ చెక్క‌తో..

సుమారు 24 అడుగుల పొడ‌వు, 14 అడుగుల వెడ‌ల్పుతో సంప్ర‌దాయ క‌శ్మీరీ చెక్క‌ హౌస్‌బోట్‌లో ఈ పోస్టాఫీస్ న‌డుస్తున్న‌ది. శ్రీన‌గ‌ర్ స‌ర‌స్సులలో క‌నిపించే సాధార‌ణ షికారా ప‌డ‌వ‌ను పోలి ఉండే ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్‌ను 1953లో స్థానిక ప్ర‌జ‌ల‌కు పోస్ట‌ల్ సేవ‌ల‌ను అందించ‌డానికి ఇండియా పోస్ట్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు కశ్మీర్‌లోని సంప్రదాయ సరస్సు సంస్కృతిని కాపాడే ప్రయత్నాల్లో భాగంగా దీనిని పున‌రుద్ధ‌రించి 2011లో అధికారికంగా మార్చింది. ఇక్కడ సాధారణ పోస్టల్ సేవలు అందుతాయి. ఉత్తరాలు, ఇతర పోస్టులను సేకరించడం, స్టాంపులు అమ్మడం, బ్యాంకింగ్‌కు సంబంధించిన సేవలు అందించడం వంటివి జరుగుతాయి. ఇక్కడి నుండి పోస్ట్‌కార్డులు పంపే వారికి 'దాల్ సరస్సు`, 'షికారా' (Shikara) ముద్రతో కూడిన ప్రత్యేకమైన క్యాన్సిలేషన్ స్టాంప్ వేసి ఇస్తారు.

ఈ పోస్టాఫీస్‌లో కేవలం పోస్టు కౌంటర్లు మాత్రమే ఉండవు. ఇక్కడ చిన్న ఫిలాటెలీ మ్యూజియం కూడా ఉంది. ఇందులో పాత పోస్టల్ రికార్డులు, స్టాంపులు, కశ్మీర్ కమ్యూనికేషన్ చరిత్రకు సంబంధించిన ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక తేలియాడే పోస్టాఫీస్ నుంచి పోస్టల్ స్టాంప్ వేసి పోస్టుకార్డు పంపించుకోవడం ప్రత్యేక అనుభూతి కావడంతో చాలామంది పర్యాటకులు ఇక్కడి నుంచే పోస్టుకార్డులు పంపిస్తుంటారు.

అంత‌మైన ఇంటీరియ‌ర్‌..

ఈ పోస్టాఫీస్ సంప్రదాయ కశ్మీరీ చేతివృత్తి శైలిని ప్రతిబింబిస్తుంది. దాల్ లేక్‌లోని పాత హౌస్‌బోట్ల మాదిరిగానే ఇందులో చెక్కతో చేసిన అందమైన ఇంటీరియర్ ఉంటుంది. దీని నిర్మాణంలో ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న స్థానిక సరస్సు సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ కాలంలో కూడా, హిమాలయాల మధ్య ఓ సరస్సుపై ఒక చిన్న చెక్క పోస్టాఫీస్ నిశ్శబ్దంగా తేలుతూ ఉంది.

Advertisement
Advertisement