త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్‌ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం

Supreme Court | ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబులింగ్ (Food Item Labelling) విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు (Supreme Court) అల్టిమేటం జారీ చేసింది. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్యాకెట్లపై తప్పనిసరిగా హెచ్చరిక సందేశాలు ఉండాలని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో అధికారులు కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి తలొగ్గుతున్నారా..? అంటూ ప్ర‌శ్నించింది. ఇది పౌరుల ఆరోగ్యానికి, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్ల‌ల‌కు సంబంధించిన అంశ‌మ‌ని వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాల్లో కార్పొరేట్ ఒత్తిళ్ల‌కు తలొగ్గ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Aug 13, 2026, 4.48 pm IST

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్‌ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబులింగ్ (Food Item Labelling) విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు (Supreme Court) అల్టిమేటం జారీ చేసింది. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్యాకెట్లపై తప్పనిసరిగా హెచ్చరిక సందేశాలు ఉండాలని స్ప‌ష్టం చేసింది.

హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Food Safety and Standards Authority of India)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విష‌యంలో అధికారులు కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి తలొగ్గుతున్నారా..? అంటూ ప్ర‌శ్నించింది. ఇది పౌరుల ఆరోగ్యానికి, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్ల‌ల‌కు సంబంధించిన అంశ‌మ‌ని వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాల్లో కార్పొరేట్ ఒత్తిళ్ల‌కు తలొగ్గ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోకుంటే.. తామే రంగంలోకి దిగుతామని పేర్కొంది. "మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం" అంటూ గట్టి హెచ్చరిక జారీ చేసింది.

ఆహార పదార్థాల లేబులింగ్ విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచార‌ణ జ‌రిపింది. అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల గురించి అవగాహన కలిగించేందుకు ప్యాకెట్‌ల ముందు భాగంలో స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంలో ఆహార పరిశ్రమ అభ్యంతరాలను మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిగణనలోకి తీసుకుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చక్కెర, ఉప్పు, కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారాల వినియోగాన్ని తగ్గించడానికి హెచ్చరిక లేబుళ్లు ఎంత అవసరమో పౌర సమాజం ప్రతినిధులు సమర్పించిన ఆధారాలను పూర్తిగా విస్మరించిందన్నారు.

దీనిపై స్పందించిన ధర్మాస‌నం FSSAI తీరును తీవ్రంగా తప్పుబట్టింది. లేబుల్ మీద హెచ్చరికలు ఉంచడం అంటే అమ్మకాలను ఆపడం కాదని, ఏమి తింటున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజెప్పడమేనని తేల్చి చెప్పింది. "తయారీదారులు తమ వ్యాపారం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఈ లేబుళ్లను వ్యతిరేకించవచ్చు. కానీ తాము కొనుగోలు చేసే వస్తువులో ఏయే పదార్థాలు ఉన్నాయో తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది" అని కోర్టు స్ప‌ష్టం చేసింది.

అదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ విష‌యంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్ర‌భుత్వం సిద్ధంగా లేదా..? అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చాహర్‌ను సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, తమ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని స్ప‌ష్టం చేసింది. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని, దానికి లొంగిపోయింద‌ని వ్యాఖ్యానించింది.

స్పందించిన అదనపు సొలిసిటర్ జనరల్.. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తే నమ్‌కీన్ వంటి భారతీయ సంప్రదాయ ఆహార పదార్థాలపై కూడా రెడ్ మార్క్ పడుతుందని వాదించారు. అయితే, ఈ వాదనను ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత కాదా..? అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తెలియజేయాలని స్ప‌ష్టం చేసింది. లేనిపక్షంలో తదుపరి విచారణలో తామే తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని తేల్చి చెప్పింది.

Also Read..

కుంభ‌క‌ర్ణుడు నిద్ర లేచారు.. అమిత్ షాపై గౌర‌వ్ గొగోయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు

నో గ్లామ‌ర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజ‌న రాణిగా జాన్వీక‌పూర్ - దీపికా, ర‌ష్మిక‌ల‌కు ధీటుగా!

Advertisement
Advertisement