త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | హైదరాబాద్‌ నీటి కష్టాలకు చెక్‌!

HMWSSB | హైదరాబాద్‌ మహానగర తాగునీటి స‌మ‌స్య తీర‌నున్న‌ది. న‌గ‌ర అవసరాలకు మరో జలవనరు అందుబాటులోకి రానుంది. సింగూరు–మంజీరా జలాల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో నగరానికి గోదావరి అదనపు జలాలను తరలించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఎంబీఆర్‌)కు రోజుకు 40 మిలియన్‌ గ్యాలన్ల (ఎంజీడీలు) గోదావరి జలాలను తరలించేలా చేపట్టిన పైప్‌లైన్‌ అనుసంధాన పనులను మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

P

Hyderabad | Published On Nov 20, 2026, 5.09 pm IST

HMWSSB | హైదరాబాద్‌ నీటి కష్టాలకు చెక్‌!
Advertisement
  • గోదావరి జలాల తరలింపునకు ట్రయల్‌ రన్‌
  • రెండు రోజుల్లో పైప్‌లైన్‌ అనుసంధాన పనులు పూర్తి చేయాలని లక్ష్యం
  • రోజుకు 40 ఎంజీడీల అదనపు జలాలు నగరానికి
  • సింగూరు–మంజీరా నీటి లభ్యత తగ్గినా సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు
  • ఘన్‌పూర్‌ ఎంబీఆర్‌ వద్ద జంక్షన్‌ పనులు పూర్తి
  • పనుల పురోగతిని పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

HMWSSB | హైదరాబాద్‌ మహానగర తాగునీటి స‌మ‌స్య తీర‌నున్న‌ది. న‌గ‌ర అవసరాలకు మరో జలవనరు అందుబాటులోకి రానుంది. సింగూరు–మంజీరా జలాల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో నగరానికి గోదావరి అదనపు జలాలను తరలించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఎంబీఆర్‌)కు రోజుకు 40 మిలియన్‌ గ్యాలన్ల (ఎంజీడీలు) గోదావరి జలాలను తరలించేలా చేపట్టిన పైప్‌లైన్‌ అనుసంధాన పనులను మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ వెంటనే ట్రయల్‌ రన్‌ నిర్వహించి నీటి తరలింపునకు మార్గం సుగమం చేయనున్నారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాపై ఒత్తిడి తగ్గనుంది. ఈ మేరకు 1600 మి.మీ. వ్యాసం కలిగిన మిషన్‌ భగీరథ–జలమండలి పైప్‌లైన్‌ అనుసంధాన పనులను జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ట్రయల్‌ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.

రాతి పొరలతో పనుల్లో జాప్యం

పైప్‌లైన్‌ నిర్మాణం, అనుసంధాన పనులను ఈ నెల 15 నాటికే పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, అటవీ ప్రాంతం గుండా వెళ్లే 150 మీటర్ల పైప్‌లైన్‌ మార్గంలో భారీ రాతి పొరలు అడ్డంకిగా మారాయి. వాటిని తొలగించాల్సి రావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం మిగిలిన పనులను వేగవంతం చేశారు. మరో రెండు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘన్‌పూర్‌ ఎంబీఆర్‌ ప్రాంగణంలో జలమండలి చేపట్టిన పైప్‌లైన్‌ జంక్షన్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ జంక్షన్‌ వినియోగానికి సిద్ధంగా ఉంది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ అనుసంధాన పనులు పూర్తయిన వెంటనే ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. అనంతరం గోదావరి అదనపు జలాలను ఘన్‌పూర్‌ ఎంబీఆర్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభం కానుంది.

సింగూరు–మంజీరాకు ప్రత్యామ్నాయంగా..

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు–మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉండటంతో జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. నగర తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురానుంది. సింగూరు–మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఏర్పడే లోటును గోదావరి జలాలతో సుమారు 50 శాతం మేర భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్‌ భగీరథ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన సాంకేతిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎండీ అశోక్‌రెడ్డి సూచించారు. ఆయ‌న వెంట జలమండలి టెక్నికల్‌ డైరెక్టర్‌ ప్రభు, సీజీఎం బలరాం రాజు, మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజినీర్‌ రాంచందర్‌ నాయక్‌, ఎస్సీ వెంకట్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement