త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand High Court | ఒక‌ట్రెండుసార్లు క‌నిపించిన అసాధార‌ణ ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా విడాకులు ఇవ్వ‌లేం : జార్ఖండ్ హైకోర్టు

Jharkhand High Court | ఒక‌టి రెండు సార్లు కనిపించిన మానసిక అనారోగ్యం (psychiatric illness) లేదా అసాధారణ ప్రవర్తన ఆధారంగా విడాకులు (Divorce) మంజూరు చేయడం కుదరదని జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Nov 13, 2026, 5.26 pm IST

Jharkhand High Court | ఒక‌ట్రెండుసార్లు క‌నిపించిన అసాధార‌ణ ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా విడాకులు ఇవ్వ‌లేం : జార్ఖండ్ హైకోర్టు
Advertisement

Jharkhand High Court | త్రినేత్ర న్యూస్ : ఒక‌టి రెండు సార్లు కనిపించిన మానసిక అనారోగ్యం (psychiatric illness) లేదా అసాధారణ ప్రవర్తన ఆధారంగా విడాకులు (Divorce) మంజూరు చేయడం కుదరదని జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) స్ప‌ష్టం చేసింది. జీవిత భాగస్వామికి మానసిక రుగ్మత ఉందని కేవలం ఆరోపణలు చేస్తే సరిపోద‌ని.. ఆ సమస్య తీవ్రతను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ఓ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం స‌మ‌ర్థించింది.

ఇదీ కేసు..

ధ‌న్‌బాద్‌కు చెందిన మ‌యాంక్ కుమార్‌, సౌమ్య కుమారిల‌కు 2021 జులై వివాహం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ జంట అమెరికా వెళ్లిపోయింది. అయితే, త‌న‌ను పెళ్లి చేసుకోవ‌డం సౌమ్య‌కు ఇష్టం లేద‌ని, కుటుంబ స‌భ్యుల ఒత్తిడి వ‌ల్లే వివాహం చేసుకున్నట్లు మ‌యాంక్ తెలిపాడు. భార్య అసాధారణంగా ప్రవర్తిస్తోందని, మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న భార్య మాన‌సిక రుగ్మ‌త‌కు గ‌తంలో ముంబైలో చికిత్స కూడా తీసుకుంద‌ని ఆమె త‌ల్లిదండ్రులు వెల్ల‌డించార‌ని కూడా అత‌డు త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నాడు.

భ‌ర్త ఆరోప‌ణ‌లు

2023 జనవరిలో తన తండ్రి మృతి చెందడంతో భారత్‌కు రావాల్సి ఉండ‌గా.. భార్య పరిస్థితి క్షీణించిందని, అమెరికాలోని విల్మింగ్టన్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించగా సైకోటిక్ డిజార్డర్, రక్తహీనత ఉన్నట్లు నిర్ధార‌ణ అయ్యింద‌ని కోర్టుకు తెలిపాడు. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌ను భార్య ఖండించింది. తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని స్ప‌ష్టం చేసింది. భర్త, అత్తింటి వారే తన ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తూ వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని వాపోయింది. తాను భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని కోర్టుకు విన్న‌వించుకుంది.

విడాకులు ఇవ్వ‌డం కుద‌ర‌దు

వాద‌న‌లు విన్న జస్టిస్ సుజిత్ నారాయణ్ ప్రసాద్, జస్టిస్ అఖిల్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13(1)(iii) ప్రకారం విడాకులు పొందాలంటే రెండు అంశాలు ముఖ్యమని తెలిపింది. జీవిత భాగస్వామికి నయం కాని మానసిక అస్వస్థత ఉండటం, లేదా త‌న జీవిత‌భాగ‌స్వామితో కలిసి కాపురం చేయడం అసాధ్యమయ్యేంత తీవ్రమైన మానసిక రుగ్మత ఉన్నప్పుడు మాత్రమే విడాకులకు అర్హత ఉంటుందని స్ప‌ష్టం చేసింది.

సరైన వైద్య ఆధారాలు లేకపోవడంతో పాటు, కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా బంధాన్ని ర‌ద్దు చేయ‌లేమ‌ని తేల్చి చెప్పింది. ఈ సంద‌ర్భంగా వైవాహిక జీవితంలో అనారోగ్యాలు, కష్టనష్టాలు సహజమని, అటువంటి సమయాల్లో జీవిత భాగస్వాములు ఒకరికొకరు అండగా నిలవాలని సుప్రీంకోర్టు గత తీర్పులను హైకోర్టు ఉద‌హ‌రించింది. ఈ మేర‌కు భర్త తన ఆరోపణలను నిరూపించడంలో విఫలమైనందున అతని అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. భర్త తన ఆరోపణలను చట్టపరంగా నిరూపించడంలో విఫలమయ్యాడని పేర్కొంటూ.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.

Also Read..

ఎన్సీపీ విలీనంపై ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌లేదు : మ‌హారాష్ట్ర మంత్రి

రైల్వే ప్రయాణికులకు మరింత చేరువగా ‘భోలు ఏఐ’!

ఆటో డ్రైవ‌ర్ల‌కు కొత్త హౌసింగ్ స్కీమ్‌.. అది కూడా హైద‌రాబాద్‌లో.. వివ‌రాలివే

Advertisement

తాజావార్తలు

Advertisement