త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BHOLU AI | రైల్వే ప్రయాణికులకు మరింత చేరువగా ‘భోలు ఏఐ’!

BHOLU AI | రైల్వే ప్రయాణికులకు మరింత వేగంగా, సులభంగా సమాచారాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ ‘భోలు ఏఐ’ (BHOLU AI)ను మరింత ఆధునికీకరించి, ఐదు ప్రధాన రైల్వే స్టేషన్లకు విస్తరించింది. రైల్వే అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించిన స్వదేశీ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (యాత్రి ఎల్‌ఎల్‌ఎం)ను ఇందులో అనుసంధానించింది. దీంతో ప్రయాణికులు తమ సందేహాలను సహజమైన భాషలో అడిగి, తక్షణమే రైల్వే సమాచారాన్ని పొందే అవకాశం క‌లుగుతోంది.

P

Telangana | Published On Nov 13, 2026, 5.07 pm IST

BHOLU AI | రైల్వే ప్రయాణికులకు మరింత చేరువగా ‘భోలు ఏఐ’!
Advertisement
  • ఐదు ప్రధాన స్టేషన్లకు విస్తరణ..
  • రైల్వే సేవల్లో సరికొత్త సాంకేతికత

BHOLU AI | రైల్వే ప్రయాణికులకు మరింత వేగంగా, సులభంగా సమాచారాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ ‘భోలు ఏఐ’ (BHOLU AI)ను మరింత ఆధునికీకరించి, ఐదు ప్రధాన రైల్వే స్టేషన్లకు విస్తరించింది. రైల్వే అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించిన స్వదేశీ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (యాత్రి ఎల్‌ఎల్‌ఎం)ను ఇందులో అనుసంధానించింది. దీంతో ప్రయాణికులు తమ సందేహాలను సహజమైన భాషలో అడిగి, తక్షణమే రైల్వే సమాచారాన్ని పొందే అవకాశం క‌లుగుతోంది.

ఐదు స్టేషన్లకు విస్తరణ

ఈ ఏడాది మే నెలలో కాచిగూడ, మల్కాజిగిరి రైల్వే స్టేషన్లలో భోలు మినీ, భోలు మ్యాక్స్‌ పేర్లతో ఏఐ ఆధారిత ప్రయాణికులకు ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. తాజాగా ఈ సేవలను కర్నూలు సిటీ, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ స్టేషన్లకు విస్తరించింది. దీంతో మొత్తం ఏడు స్టేషన్లలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ దశలో రోజుకు సుమారు 200 మంది ప్రయాణికులు వినియోగించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2,000 దాటినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ప్రత్యేకంగా ‘యాత్రి ఎల్‌ఎల్‌ఎం’

రైల్వే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన యాత్రి ఎల్‌ఎల్‌ఎంను భోలు ఏఐలో ప్రవేశపెట్టారు. ఇది ప్రయాణికులు అడిగే ప్రశ్నలను సహజ భాషలో అర్థం చేసుకుని సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. సాధారణ విచారణల కోసం కౌంటర్లపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించడంతోపాటు, వృద్ధులు, దివ్యాంగులు, తొలిసారి ప్రయాణించేవారు, డిజిటల్‌ అప్లికేషన్లపై అవగాహన లేనివారికి సైతం ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.

మరిన్ని ప్రత్యేకతలు ఇవీ..

భోలు ఏఐ తాజా వెర్షన్‌లో ప్రాథమిక విచారణలకు మించి పలు అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.

  • లైవ్‌ ట్రైన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డు: రైళ్ల రాకపోకలు, ప్రస్తుత రన్నింగ్‌ స్టేటస్‌ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
  • రైలు, బెర్త్‌ లభ్యత: రైళ్ల వివరాలతోపాటు సీట్లు, బెర్తుల లభ్యతను సులభంగా పరిశీలించవచ్చు.
  • కోచ్‌ పొజిషన్‌ సమాచారం : ప్లాట్‌ఫామ్‌పై రైలు బోగీలు ఎక్కడ ఆగుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.
  • క్యూఆర్‌ కోడ్‌ సదుపాయం : కియోస్క్‌లపై ప్రదర్శించే క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి, కోచ్‌ వివరాలు, అవసరమైన సమాచారాన్ని మొబైల్‌లో పొందవచ్చు.
  • స్టేషన్‌ మ్యాప్స్ : స్టేషన్‌ లేఅవుట్‌, ప్లాట్‌ఫామ్‌ల అనుసంధానం, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల వివరాలను ఇంటరాక్టివ్‌ మ్యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఇతర సదుపాయాల సమాచారం : మరుగుదొడ్లు, తాగునీరు, క్యాటరింగ్‌ స్టాళ్లు, వెయిటింగ్‌ హాళ్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్ల వివరాలు అందుబాటులో ఉంటాయి.

రెండు రకాలుగా సేవలు

ప్రయాణికుల సౌలభ్యం కోసం భోలు ఏఐ రెండు రూపాల్లో పనిచేస్తుంది. భోలు మినీ కాంపాక్ట్‌ వాయిస్‌ ఆధారిత సహాయక వ్యవస్థ కాగా.. భోలు మ్యాక్స్‌లో వాయిస్‌తోపాటు టచ్‌స్క్రీన్‌ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు. భోలు ఏఐ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని వేగంగా అందించడంతోపాటు, మానవ వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులను ఆయన అభినందించారు. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ వర్మ, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ తదితరుల కృషిని ప్రశంసించారు.

Advertisement
Advertisement