త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay TVK | దళపతి విజయ్‌కు గవర్నర్ షాక్.. టీవీకే మెజారిటీపై డౌట్స్, రేపు సీఎంగా ప్రమాణస్వీకారం లేనట్టే!

తమిళనాడులో అనూహ్య పరిణామం. మ్యాజిక్ ఫిగర్‌పై అనుమానాలతో టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ బ్రేక్. కాంగ్రెస్ మద్దతిచ్చినా దక్కని మెజారిటీ.

J

National | Published On May 6, 2026, 5.58 pm IST

Thalapathy Vijay TVK | దళపతి విజయ్‌కు గవర్నర్ షాక్.. టీవీకే మెజారిటీపై డౌట్స్, రేపు సీఎంగా ప్రమాణస్వీకారం లేనట్టే!
Advertisement
  • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసి సన్నద్ధత వ్యక్తం చేసిన TVK అధినేత విజయ్
  • మెజారిటీ (118 సీట్లు) పై గవర్నర్‌కు అనుమానాలు; రేపు జరగాల్సిన ప్రమాణస్వీకారం వాయిదా?
  • విజయ్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్; వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రంగా మండిపడ్డ డీఎంకే
  • కొలత్తూరులో ఓటమిపాలై, ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసిన ఎంకే స్టాలిన్

Thalapathy Vijay TVK | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu assembly election) ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు వేశారు. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సంఖ్యాబలం టీవీకే (TVK) కు ఉందా లేదా అన్నదానిపై గవర్నర్ ఇంకా ఒక స్పష్టతకు రాలేదని సమాచారం. దీంతో రేపు (గురువారం) జరగాల్సిన విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడే అవకాశం కనిపిస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా ఎన్నంటే?

తమిళగ వెట్రి కజగం (TVK) ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా (Single-largest party) అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ 118 కి ఇంకా 10 సీట్లు తక్కువ పడ్డాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమకున్న 5 సీట్లతో విజయ్‌కు మద్దతు ప్రకటించింది. విజయ్ స్వయంగా రెండు చోట్ల గెలవడంతో ఒక సీటును మినహాయిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే విపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) కు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

కాంగ్రెస్ సపోర్ట్.. మండిపడ్డ డీఎంకే!

మరోవైపు, టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నాయి. అయితే ఈ నిర్ణయంపై డీఎంకే (DMK) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందు తమతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఇప్పుడు కేవలం రెండు మంత్రి పదవుల కోసం తమిళ ప్రజలను వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నామలై మండిపడ్డారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో ప్రతిపక్ష 'ఇండియా (INDIA)' కూటమి కుప్పకూలిపోయిందని, ఇది ఆ కూటమికి చివరి అంకమని బీజేపీ విమర్శించింది.

ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్!

ఈ ఎన్నికల్లో టీవీకే భారీ విజయం సాధించడంతో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి బ్రేక్ పడింది. కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయిన ఎంకే స్టాలిన్, ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అటు సీపీఐ, సీపీఎం లాంటి వామపక్ష పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై మే 8 నాటికి స్పష్టత రానుంది. తదుపరి దశలో విజయ్ తన మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement