త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | క‌రూర్ ఘ‌ట‌న ప‌క్కా కుట్ర‌.. సిగ్గులేకుండా నాపై నింద‌లేశారు : సీఎం విజ‌య్‌

CM Vijay | గ‌తేడాది చోటు చేసుకున్న క‌రూర్‌ తొక్కిస‌లాట (Karur stampede) దుర్ఘ‌ట‌న త‌న‌ జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన క్ష‌ణం అని ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay) అన్నారు. ర్యాలీ జ‌రిగిన రోజున పోలీసులు త‌ప్పుడు స‌మాచారంతో త‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. ర్యాలీకి ఎక్కువ మంది వ‌చ్చార‌ని తెలిసినా.. త‌మ‌ను అలర్ట్ చేయ‌లేద‌న్నారు. పోలీసుల‌ను ఎంతో న‌మ్మాన‌ని.. కానీ వాళ్లు త‌న‌పై నిందారోప‌ణ‌లు చేశార‌ని విజ‌య్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

D

National | Published On Jul 10, 2026, 3.02 pm IST

CM Vijay | క‌రూర్ ఘ‌ట‌న ప‌క్కా కుట్ర‌.. సిగ్గులేకుండా నాపై నింద‌లేశారు : సీఎం విజ‌య్‌
Advertisement

CM Vijay | త్రినేత్ర‌.న్యూస్ : కరూర్‌ ఘటనలో (Karur stampede) తనపై నిందారోపణలు చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)​ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌న త‌ర్వాత విజ‌య్ తొలిసారి క‌రూర్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా గ‌తేడాది జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌ను క‌లిశారు. వారికి ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించారు. నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన విజ‌య్‌.. ప్ర‌తిప‌క్ష డీఎంకే, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

సిగ్గులేకుండా నాపై నింద‌లేశారు..

"గ‌తేడాది చోటు చేసుకున్న తొక్కిస‌లాట నా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన క్ష‌ణం. ఒక‌రు జీవితంలో విజ‌య‌తీరాల‌కు చేరుక‌న్నా.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎదుర్కోక త‌ప్పుదు. నా రాజ‌కీయ జీవితంలో క‌రూర్ దుర్ఘ‌ట‌న కూడా అలాంటిదే. ఈ ఘ‌ట‌న న‌న్ను ఎప్ప‌టికీ వెంటాడుతూనే ఉంటుంది" అని విజ‌య్ అన్నారు. ర్యాలీ జ‌రిగిన రోజున పోలీసులు త‌ప్పుడు స‌మాచారంతో త‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. ర్యాలీకి ఎక్కువ మంది వ‌చ్చార‌ని తెలిసినా.. పోలీసులు త‌మ‌ను అలర్ట్ చేయ‌లేద‌న్నారు. క‌నీసం స‌భను మ‌ధ్య‌లోనే ఎందుకు ర‌ద్దు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

దీనికి ఎవ‌రు బాధ్యులు..?

స‌భ‌ను ర‌ద్దు చేసే పూర్తి హ‌క్కు వారికి ఉన్నా.. ఆ ప‌ని చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. క‌రూర్‌లోని ప్ర‌వేశించ‌కుండా త‌న‌ను ఆపి ఉండొచ్చు క‌ద‌..? అంటూ నిల‌దీశారు. ర‌ద్దీని నియంత్రించ‌గ‌ల‌ర‌ని తాను పోలీసుల‌ను ఎంతో న‌మ్మాన‌ని చెప్పారు. కానీ, ఈ ఘ‌ట‌న విష‌యంలో త‌న‌పైనే నింద‌లు మోపార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎంతో మంది త‌ల్లులు త‌మ పిల్లల్ని కోల్పోయార‌ని సీఎం విజ‌య్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి ఎవ‌రు బాధ్యులు..? దీని వెనుక ఎవరు కుట్ర పన్నారు..? అంటూ ప్ర‌శ్నించారు.

"పోలీసులు తగినంత మంది సిబ్బందిని మోహరించారా..? వారు సిగ్గులేకుండా నాపై నిందలు వేశారు. ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో రాజకీయం చేశారు. టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ విషాదాన్ని సృష్టించారు. కానీ వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో మేం విజ‌యంసాధించాం" అని సీఎం విజ‌య్ చెప్పుకొచ్చారు.

నేను ఎక్క‌డికీ పారిపోలేదు..

తొక్కిస‌లాట త‌ర్వాత తాను పారిపోయానంటూ వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై కూడా విజ‌య్ ఘాటుగా స్పందించారు. తాను ఎక్క‌డికీ పారిపోలేద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌రూర్ దుర్ఘ‌ట‌న త‌ర్వాత తాను తీవ్ర‌మైన బాధతో కుంగిపోతున్న స‌మ‌యంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై ఎగ‌తాళిగా మాట్లాడార‌ని మండిప‌డ్డారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు, పోలీసులే కుట్ర ప‌న్నారంటూ విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన బాధితుల జ్ఞాప‌కార్థం త‌న పార్టీ త‌ర‌ఫున స్మార‌కం నిర్మిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్ ప్ర‌క‌టించారు.

మ‌మ్మ‌ల్ని అధికారంలో నుంచి దించ‌లేరు..

టీవీకే ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు జ‌రిగిన కుట్ర‌ల‌పై కూడా విజ‌య్ ఈ సంద‌ర్భంగా స్పందించారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా త‌మ ప్ర‌భుత్వాన్ని అధికారంలో నుంచి దించ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు ప్ర‌జ‌ల పూర్తి మ‌ద్ద‌తు ఉంద‌ని చెప్పారు.

భ‌ద్ర‌తా వైఫ‌ల్యం..

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపం త‌లెత్తింది. క‌రూర్‌లోకి ప్ర‌వేశిస్తుండ‌గా భారీ భ‌ద్ర‌త‌ను దాటుకుని ఓ వ్య‌క్తి సీఎం కాన్వాయ్‌లోకి దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే స్పందించి అత‌డిని అడ్డుకున్నారు. ఇక సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి క‌రూర్ వ‌చ్చిన విజ‌య్‌కి దారి పొడ‌వునా ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. వేలాది మంది మ‌ద్ద‌తుదారులు విజ‌య్‌కి పూల రేకులు చ‌ల్లుతూ స్వాగ‌తం ప‌లికారు.

41 మంది మృతి..

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో గతేడాది సెప్టెంబ‌ర్‌లో క‌రూర్‌లో నిర్వ‌హించిన టీవీకే స‌భ‌లో తొక్కిస‌లాట చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపింది. విజ‌య్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని అప్ప‌టి డీఎంకే ప్ర‌భుత్వం ఆరోపించింది.

Advertisement
Advertisement