త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్ కావడంతో గ్రూప్-1 అక్రమాలు బయటపడ్డాయని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

J

Telangana | Published On Nov 10, 2026, 5.02 pm IST

TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

సంక్షిప్త సారాంశం

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ కార్యదర్శి హరితకు వినతిపత్రం సమర్పించారు. పోలీస్ అకాడమీ శిక్షణలో 35 శాతం మంది (సుమారు 40 మంది) కొత్త డీఎస్పీలు ఫెయిల్ కావడమే నియామక ప్రక్రియలోని లోపాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, ఆన్సర్ షీట్లను పారదర్శకంగా రీ-వాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని, ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు.

Advertisement
  • టీజీపీఎస్సీకి బీఆర్ఎస్ వినతి

TGPSC Group 1 Mains Controversy | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో గ్రూప్-1 నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఇందులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు, నిరుద్యోగ అభ్యర్థులు మంగళవారం టీజీపీఎస్సీ (TGPSC) కార్యదర్శి హరిత ఐఏఎస్ కు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, అశోక్ నగర్ గ్రూప్-1 అభ్యర్థులు కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లి తమ డిమాండ్లతో కూడిన రిప్రజెంటేషన్ అందజేశారు.

శిక్షణలో 35 శాతం డీఎస్పీలు ఫెయిల్ కావడమే నిదర్శనం

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, టీజీపీఎస్సీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కొత్త డీఎస్పీ ట్రైనీలలో ఏకంగా 35 శాతం మంది (సుమారు 40 మంది) ట్రైనింగ్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారని ఆయన వెల్లడించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పా (APPA) ఉన్నప్పటి నుంచి నేటి వరకు దేశంలో ఎక్కడా కూడా ఇలా 35 నుంచి 40 శాతం మంది డీఎస్పీలు శిక్షణా పరీక్షల్లో ఫెయిల్ అయిన దాఖలాలు లేవన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రవేశ పరీక్షల్లోనే భారీ అవకతవకలు జరిగాయనడానికి ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

జీవో 29 నుంచి అపాయింట్‌మెంట్ల వరకు అంతా గూడుపుఠాణి

అశోక్ నగర్‌లో ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులు జీవో 29 వల్ల తీవ్ర అన్యాయానికి గురయ్యారని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 29 మొదలుకొని గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ, ఆ తర్వాత హడావుడిగా అపాయింట్‌మెంట్లు ఇవ్వడం వరకు అంతా ఒక గూడుపుఠాణిలా జరిగిందని అభ్యర్థులు మొత్తుకున్నా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు, కమిషన్ అధికారులు పట్టించుకోకుండా కొట్టిపడేశారని విమర్శించారు. ఇవాళ కమిషన్ చేసిన నిర్వాకం నగ్నంగా బయటపడిందని ధ్వజమెత్తారు.

హైకోర్టు సింగిల్ బెంచ్ అనుమానాలే నిజమయ్యాయి

గ్రూప్-1 అక్రమాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినప్పుడు, సింగిల్ బెంచ్ జడ్జి దాదాపు 40-50 గంటల పాటు వాదోపవాదాలు విని సుదీర్ఘమైన తీర్పు ఇచ్చారని శ్రవణ్ గుర్తుచేశారు. మెయిన్స్ నిర్వహణలో కమిషన్ పారదర్శకత పాటించలేదని, సొంత రూల్స్ ఉల్లంఘించి పక్షపాతంతో వ్యవహరించిందని, కమిషన్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ నిరుద్యోగ యువత నష్టపోయిందని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. "ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఎవాల్యుయేషన్ అనామలీస్, మాల్ ప్రాక్టీసెస్" (విధానపరమైన లోపాలు, మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలు) జరిగాయని హైకోర్టు ఘాటైన పదజాలంతో తప్పుబట్టిందని వివరించారు.

అయితే 50 గంటల వాదనలను డివిజన్ బెంచ్ కనీసం 50 నిమిషాలు కూడా వినకుండా కేసును కొట్టివేసిందని, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. నాడు హైకోర్టు సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన అనుమానాలన్నీ నిజమేనని నేడు ట్రైనీ డీఎస్పీల ఫెయిల్యూర్ రుజువు చేస్తోందని పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ ముందు ఉంచిన 3 ప్రధాన డిమాండ్లు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు, సతీష్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్ తదితరులు కమిషన్ ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ: 35 శాతం ట్రైనీ డీఎస్పీల ఫెయిల్యూర్, హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు నేపథ్యంలో గ్రూప్-1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలి.

ఫోరెన్సిక్ ఆడిట్, రీ-వాల్యుయేషన్: గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, ఆన్సర్ షీట్లను పారదర్శకంగా రీ-వాల్యుయేషన్ చేయాలి.

అభ్యర్థులకు న్యాయం: నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ఏ ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement