త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Raghuvanshi | సోనమ్ రఘువంశికి సుప్రీంకోర్టులో ఊరట.. బెయిల్ రద్దుకు నో..

Sonam Raghuvanshi | భర్త రాజా రఘువంశి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశికి సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలన్న మేఘాలయ ప్రభుత్వ విజ్ఞప్తిని స‌ర్వోన్న‌త న్యాయస్థానం తిరస్కరించింది.

P

National | Published On Jul 3, 2026, 3.38 pm IST

Sonam Raghuvanshi | సోనమ్ రఘువంశికి సుప్రీంకోర్టులో ఊరట.. బెయిల్ రద్దుకు నో..
Advertisement

Sonam Raghuvanshi | భర్త రాజా రఘువంశి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశికి సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలన్న మేఘాలయ ప్రభుత్వ విజ్ఞప్తిని స‌ర్వోన్న‌త న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారంలో స్పంద‌న చెప్పాల‌ని మేఘాల ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న కోరింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు విధించిన బెయిల్ షరతుల ప్రకారం సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలై ప్రస్తుతం షిల్లాంగ్‌లో ఉన్నట్లు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ ఎంఎం సుంద‌రేష్, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ కేసులో తొలి దృష్ట్యా బెయిల్ మంజూరుపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.

అయితే, అరెస్టు కారణాలను సోనమ్‌కు తెలియజేయలేదన్న పరిస్థితి ఈ కేసులో లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమె బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపింది. ఈ వ్యవహారంలో తుది నిర్ణయం ట్రయల్ కోర్టు విచారణలోనే వెలువడాల్సి ఉందని పేర్కొంటూ సోనమ్ తరఫు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సోనమ్ ఇప్పటికే కొంతకాలం జైలులో గడిపిన అంశాన్ని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. నేరం ఎంత తీవ్రమైనదైనా "బెయిల్ అనేది సాధారణ నిబంధన.. జైలు మినహాయింపు" అనే సూత్రాన్ని విస్మరించలేమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఈ కేసును మేఘాలయ హైకోర్టు నిర్వహించిన తీరుపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని కూడా ధర్మాసనం పేర్కొంది.

హైకోర్టు తీర్పును సవాల్ చేసిన మేఘాలయ ప్రభుత్వం

సోనమ్‌కు మంజూరైన బెయిల్‌ను సమర్థిస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025లో హనీమూన్ సందర్భంగా భర్త రాజా రఘువంశి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్‌కు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 27న బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ డబ్ల్యూ డియెంగ్‌డో నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తిరస్కరించింది. అరెస్టు కారణాలను నమోదు చేసిన తీరులో న్యాయపరమైన విచక్షణ కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సోనమ్‌పై ఉన్న నిర్దిష్ట ఆరోపణలను అరెస్టు మెమోలో స్పష్టంగా పేర్కొనలేదని, సరైన పరిశీలన లేకుండానే ఆ పత్రాలను సిద్ధం చేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ తీరులో న్యాయపరమైన ఆలోచన లోపించిందని పేర్కొన్న హైకోర్టు, బెయిల్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితులు లేవని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్ రఘువంశిని గత ఏడాది జూన్‌లో భర్త రాజా రఘువంశి హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మే 23న మేఘాలయలోని సోహ్రా ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిన ఈ దంపతులు అదృశ్యమయ్యారు. అనంతరం జూన్ 2న రాజా రఘువంశి మృతదేహం లోయలో లభ్యమైంది. ఆర్థిక ప్రయోజనాల కోసం కిరాయి హంతకులతో కలిసి భర్త హత్యకు సోనమ్ కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement