త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garmin | గార్మిన్ కొత్త ఫోర్‌రన్నర్ సిరీస్.. ఏఐ ట్రైనింగ్, మ్యూజిక్‌తో మూడు స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..

Garmin | భారత మార్కెట్‌లో రన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లను గార్మిన్ విడుదల చేసింది. గార్మిన్ ఫోర్‌రన్నర్ 70, ఫోర్‌రన్నర్ 170, ఫోర్‌రన్నర్ 170 మ్యూజిక్ పేర్లతో మూడు కొత్త మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.

S

Technology | Published On Jul 3, 2026, 4.41 pm IST

Garmin | గార్మిన్ కొత్త ఫోర్‌రన్నర్ సిరీస్.. ఏఐ ట్రైనింగ్, మ్యూజిక్‌తో మూడు స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..
Advertisement

Garmin | భారత మార్కెట్‌లో రన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లను గార్మిన్ విడుదల చేసింది. గార్మిన్ ఫోర్‌రన్నర్ 70, ఫోర్‌రన్నర్ 170, ఫోర్‌రన్నర్ 170 మ్యూజిక్ పేర్లతో మూడు కొత్త మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది. ప్రారంభ స్థాయి నుంచి అడ్వాన్స్‌డ్ ఫిట్‌నెస్ యూజర్ల వరకు అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌ను రూపొందించినట్లు గార్మిన్ తెలిపింది. ఈ మూడు మోడళ్లలో కూడా 1.2 ఇంచుల అమోలెడ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ జీపీఎస్, ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు, స్మార్ట్ నోటిఫికేషన్లు, సేఫ్టీ అండ్ ట్రాకింగ్ ఫీచర్లు, అలాగే పలురోజుల బ్యాటరీ బ్యాకప్ అందుబాటులో ఉన్నాయి. స్ట్రక్చర్డ్ ట్రైనింగ్, రికవరీ ట్రాకింగ్, రోజువారీ ఫిట్‌నెస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్‌వాచ్‌లను రూపొందించారు.

గార్మిన్ ఫోర్‌రన్నర్ 70..

ఫోర్‌రన్నర్ 70 రన్నింగ్ ప్రారంభించిన వారికి, అలాగే క్రమబద్ధమైన ట్రైనింగ్ కోరుకునే వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పనితీరు, రికవరీ ఆధారంగా ట్రైనింగ్ సూచనలను అందించే సామర్థ్యం ఇందులో ఉంది. ఈ వాచ్‌లో బిల్ట్-ఇన్ జీపీఎస్ ద్వారా పేస్, దూరం, సమయం, మణికట్టు ద్వారా హార్ట్‌రేట్ ట్రాకింగ్ అందుబాటులో ఉంది. గార్మిన్ కోచ్ అడాప్టివ్ ట్రైనింగ్ ప్లాన్‌లు, రోజువారీ సూచించిన వర్కౌట్‌లు, రన్-వాక్ గైడెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రైనింగ్ రెడీనెస్, ట్రైనింగ్ స్టేటస్, ట్రైనింగ్ ఎఫెక్ట్, హెచ్‌ఆర్‌వీ స్టేటస్, రికవరీ టైమ్, అక్యూట్ లోడ్, రన్నింగ్ పవర్, రన్నింగ్ డైనమిక్స్ వంటి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ అనలిటిక్స్‌ను కూడా ఇది అందిస్తుంది.

రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా సహా 80కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. 24 గంటల హెల్త్ ట్రాకింగ్‌లో భాగంగా స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, హెల్త్ స్టేటస్, బాడీ బ్యాటరీ ఎనర్జీ మానిటరింగ్, మార్నింగ్ రిపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గార్మిన్ కనెక్ట్ ఇంటిగ్రేషన్‌తో సేఫ్టీ, ట్రాకింగ్ సదుపాయాలు కూడా లభిస్తాయి. స్మార్ట్‌వాచ్ మోడ్‌లో గరిష్టంగా 13 రోజుల బ్యాటరీ బ్యాకప్ ల‌భిస్తుంది.

గార్మిన్ ఫోర్‌రన్నర్ 170..

ఫోర్‌రన్నర్ 170, ఫోర్‌రన్నర్ 70లోని అన్ని ప్రధాన ఫీచర్లతోపాటు మరింత అడ్వాన్స్‌డ్ పనితీరు విశ్లేషణ, రికవరీ సమాచారం, రోజువారీ వినియోగానికి ఉపయోగపడే అదనపు సదుపాయాలను అందిస్తుంది. రన్నింగ్ డైనమిక్స్, రన్నింగ్ పవర్, అక్యూట్ లోడ్, ట్రైనింగ్ రెడీనెస్, ట్రైనింగ్ స్టేటస్, హెచ్‌ఆర్‌వీ స్టేటస్, రికవరీ టైమ్ వంటి మెరుగైన రన్నింగ్ మెట్రిక్స్ ఇందులో ఉన్నాయి. రోజంతా హార్ట్‌రేట్ మానిటరింగ్, బాడీ బ్యాటరీ ఎనర్జీ ట్రాకింగ్‌తోపాటు స్లీప్ కోచ్, స్ట్రెస్ ట్రాకింగ్, రెస్పిరేషన్ ట్రాకింగ్, మార్నింగ్ రిపోర్ట్, ఈవెనింగ్ రిపోర్ట్, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, హెచ్‌ఐఐటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, ఇండోర్ వర్కౌట్‌లతో సహా 80కి పైగా స్పోర్ట్స్ ప్రొఫైల్‌లకు మద్దతు ఉంది. 43 మిల్లీమీటర్ల తేలికైన కేస్ డిజైన్‌తో వచ్చిన ఈ మోడల్ స్మార్ట్‌వాచ్ మోడ్‌లో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.

ఫోర్‌రన్నర్ 170 మ్యూజిక్..

ఫోర్‌రన్నర్ 170 మ్యూజిక్‌లో ఫోర్‌రన్నర్ 170లోని అన్ని ఫీచర్లతోపాటు ఆఫ్‌లైన్ మ్యూజిక్ సపోర్ట్ కూడా ఉంది. సపోర్ట్ చేసే స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి ప్లేలిస్టులను నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని, బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ల ద్వారా ఫోన్ అవసరం లేకుండానే రన్నింగ్ లేదా వర్కౌట్ సమయంలో పాటలు వినే అవకాశం ఉంటుంది.

గార్మిన్ ఫోర్‌రన్నర్ 70 ధరను రూ.32,990గా నిర్ణయించారు. ఫోర్‌రన్నర్ 170 ధర రూ.39,490 ఉండ‌గా, ఫోర్‌రన్నర్ 170 మ్యూజిక్ ధర రూ.45,990గా ఉంది. ఫోర్‌రన్నర్ 70 శుక్ర‌వారం నుంచే గార్మిన్ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, గార్మిన్ బ్రాండ్ స్టోర్లు, జస్ట్ ఇన్ టైమ్, హీలియోస్, రిలయన్స్ డిజిటల్, మలబార్ వాచెస్ వంటి రిటైల్ భాగస్వాముల వద్ద అందుబాటులోకి వ‌చ్చింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందస్తు యాక్సెస్ కల్పిస్తున్నారు. ఫోర్‌రన్నర్ 170, ఫోర్‌రన్నర్ 170 మ్యూజిక్ మోడళ్లు శ‌నివారం నుంచి గార్మిన్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement