త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Agriculture | తెలంగాణ‌లో 10.20 ల‌క్ష‌ల ఎక‌రాలు త‌గ్గిన సాగు.. మ‌రి వ‌రి సాగు ఎంతో తెలుసా..?

Telangana Agriculture | వానాకాలం ప్రారంభ‌మైంది.. కానీ ఎల్‌నినో ఎఫెక్ట్ కార‌ణంగా వ‌ర్షాలు లేవు. చాలా జిల్లాల్లో జూన్ మాసంలో లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో సాగుకు రైతులు ఆస‌క్తి చూప‌డం లేదు. వ‌ర్షాలు స‌మృద్ధిగా కురిసి ఉంటే.. ఇప్ప‌టికే పంట పొలాలు రైతులు, కూలీల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవి. కానీ ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తానికి ప‌చ్చ‌గా ఉండాల్సిన పంట పొలాల‌న్నీ బోసిపోయాయి.

S

Telangana | Published On Jul 3, 2026, 5.22 pm IST

Telangana Agriculture | తెలంగాణ‌లో 10.20 ల‌క్ష‌ల ఎక‌రాలు త‌గ్గిన సాగు.. మ‌రి వ‌రి సాగు ఎంతో తెలుసా..?
Advertisement

గ‌తేడాది 43.48 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు
ఈ ఏడాది 33 ల‌క్ష‌ల ఎక‌రాల‌కే ప‌రిమితం
త‌గ్గిన వ‌రి, మొక్క‌జొన్న సాగు
లోటు వ‌ర్ష‌పాత‌మే కాదు..
గ‌ణ‌నీయంగా త‌గ్గిన నీటి ల‌భ్య‌త‌
అడుగంటిన భూగ‌ర్భ జ‌లాలు
రుతుప‌వ‌నాల ఆల‌స్య‌మే అంటున్న అధికారులు

Telangana Agriculture | త్రినేత్ర‌.న్యూస్ : వానాకాలం ప్రారంభ‌మైంది.. కానీ ఎల్‌నినో ఎఫెక్ట్ కార‌ణంగా వ‌ర్షాలు లేవు. చాలా జిల్లాల్లో జూన్ మాసంలో లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో సాగుకు రైతులు ఆస‌క్తి చూప‌డం లేదు. వ‌ర్షాలు స‌మృద్ధిగా కురిసి ఉంటే.. ఇప్ప‌టికే పంట పొలాలు రైతులు, కూలీల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవి. కానీ ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తానికి ప‌చ్చ‌గా ఉండాల్సిన పంట పొలాల‌న్నీ బోసిపోయాయి. గ‌తేడాదితో పోల్చితే తెలంగాణ‌లో సాగు విస్తీర్ణం పూర్తిగా త‌గ్గిపోయింది. ఇందుకు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ గ‌ణాంకాలే నిద‌ర్శ‌నం.

లోటు వ‌ర్ష‌పాతం, సాగునీటి ల‌భ్య‌త‌, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు లేక‌పోవ‌డం కార‌ణంగానే రైతులు పంట‌లు వేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. గ‌తేడాదితో పోల్చితే.. రాష్ట్రంలో ఖ‌రీఫ్ సీజ‌న్‌లో(వానాకాలం) సాగు విస్తీర్ణం 10.20 ల‌క్ష‌ల ఎకరాలు త‌గ్గింది.

ఏడాది వ్య‌వ‌ధిలోనే 23.5 శాతం త‌గ్గుద‌ల‌

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం.. రాష్ట్రంలో సాధార‌ణ సాగు విస్తీర్ణం మొత్తం 132.44 ల‌క్ష‌ల ఎక‌రాలు కాగా, ప్ర‌స్తుతం ఈ సీజ‌న్‌లో జులై 1వ తేదీ నాటికి 33.27 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేశారు. అదే గ‌తేడాది గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే.. ఇదే సీజ‌న్‌లో 43.48 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేశారు. అంటే గ‌తేడాదితో పోల్చితే 10.20 ల‌క్ష‌ల ఎకరాలు సాగు విస్తీర్ణం త‌గ్గింది. ఏడాది కాలంలోనే దాదాపు 23.5 శాతం సాగు విస్తీర్ణం త‌గ్గింది.

లోటు వ‌ర్ష‌పాతంతో పాటు నీటి ల‌భ్య‌త లేక‌పోవ‌డం..

సాగు విస్తీర్ణం త‌గ్గానికి ప్ర‌ధానంగా లోటు వ‌ర్ష‌పాతంతో పాటు సాగు నీటి ప్రాజెక్టుల్లో నీటి ల‌భ్య‌త లేక‌పోవ‌డ‌మే. ఈ ఏడాది జూన్ 1 నుంచి జులై 1 వ‌ర‌కు తెలంగాణ‌లో 123.1 మి.మీ. వ‌ర్ష‌పాతం(సాధార‌ణ వ‌ర్ష‌పాతం 134.7 మి.మీ.) న‌మోదైంది. అంటే 9 శాతం లోటు న‌మోదైంది. ఇక ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్ల‌లో నీటి నిల్వ‌లు కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. గ‌తేడాది ఈ స‌మ‌యానికి ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్ల‌లో 458.15 టీఎంసీల నీరు నిల్వ ఉండ‌గా, ప్ర‌స్తుతం 338.60 టీఎంసీల‌కు ప‌డిపోయింది. దీనికి తోడు భూగ‌ర్భ జ‌ల‌మ‌ట్టాలు కూడా ప‌డిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో భూమి ఉపరితలం నుండి సగటున 9.06 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం, మే నాటికి 9.26 మీటర్ల లోతుకు చేరింది.

త‌గ్గిన వ‌రి సాగు

ప్ర‌ధాన పంట‌ల సాగు పూర్తిగా త‌గ్గిపోయింది. రాష్ట్రంలో ప్ర‌ధాన పంట వ‌రి సాగు కాగా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌తేడాదితో పోల్చితే 1.1 ల‌క్ష‌ల ఎక‌రాలు త‌గ్గింది. ఇదే సీజ‌న్‌లో గతేడాది 1.82 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగు చేశారు. మొక్క జొన్న సాగు 2.48 ల‌క్ష‌ల ఎక‌రాల నుంచి 1.03 ల‌క్ష‌ల ఎకరాల‌కు, కంది పంట 2.70 ల‌క్ష‌ల ఎక‌రాల నుంచి 1.43 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు త‌గ్గింది. ఆహార ధాన్యాల సాగు 7.91 ల‌క్ష‌ల ఎక‌రాల నుంచి 3.91 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు త‌గ్గింది.

వాణిజ్య పంట‌లు కూడా అంతే..

వాణిజ్య పంట‌ల సాగు కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ప‌త్తి 26.83 ల‌క్ష‌ల ఎక‌రాల‌కే ప‌రిమితం కాగా, గ‌తేడాది 30.69 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేశారు. సోయాబీన్ 2.64 ల‌క్ష‌ల ఎక‌రాల నుంచి 1.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు త‌గ్గింది.

రుతుప‌వ‌నాల ఆల‌స్య‌మే కార‌ణం

ఈ తీవ్ర‌మైన సంక్షోభానికి ప్ర‌ధాన కార‌ణం రుతుప‌వ‌నాల ఆల‌స్య‌మేన‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు ప్రాజెక్టుల్లో నీటి నిల్వ‌లు త‌గ్గ‌డం, భూగ‌ర్భ జ‌ల‌మ‌ట్టాలు గ‌ణ‌నీయంగా ప‌డిపోవ‌డం కూడా రైతుల‌ను ఆందోళ‌న‌కు గురి చేశాయ‌ని తెలిపారు. రైతు భ‌రోసా స‌కాలంలో ఇవ్వ‌క‌పోవ‌డం కూడా సాగు విస్తీర్ణం త‌గ్గడానికి కార‌ణ‌మ‌ని ఆయా రైతు సంఘాలు పేర్కొన్నాయి.

మొత్తంగా లోటు వర్ష‌పాతం, ప్రాజెక్టుల్లో నీటి ల‌భ్య‌త లేక‌పోవ‌డం, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి భ‌రోసా లేక‌పోవ‌డంతో పాటు స‌రైన స‌మ‌యానికి విత్త‌నాలు, ఎరువులు అందుతాయో లేదో అనే అనుమానంతో రైతులు స‌రైన స‌మ‌యానికి విత్త‌నాలు వేసేందుకు కూడా ఆస‌క్తి చూప‌లేక‌పోయార‌ని కూడా రైతులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement