ఎన్నికల కమిషన్ భారీ ప్రక్షాళన ఓటర్ల జాబితాలో భారీ కోత SIR | కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. 2025 సంవత్సరంలో అకస్మాత్తుగా ప్రారంభమైన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇప్పటికే తొలి దశ విజయవంతంగా ముగియగా.. రెండో దశ మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. బీహార్‌తో ప్రారంభం 2025 జూన్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రక్షాళనను మొదట అక్కడ ప్రారంభించారు. కేవలం బీహార్‌లోనే సుమారు 65 లక్షల ఓట్లు తొలగించబడటం పెను సంచలనమైంది. దీనిపై విపక్షాలు 'ఓట్ల దొంగతనం' అంటూ మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఈసారి ప్రక్షాళన ఎందుకు భిన్నం? గతంలోనూ ఇలాంటి ఓటర్ల జాబితా ప్రక్షాళనను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినా దానికి, ప్రస్తుతం జరుగుతున్న ప్రక్షాళన భిన్నంగా ఉంటుంది. ఓటర్ల పుట్టిన తేదీని ఈసారి ఎన్నికల అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దాని కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేస్తేనే వాళ్ల ఓటు లిస్టులో ఉంటుంది. పౌరసత్వాన్ని నిర్ధారించడం కోసం ఆయా డాక్యుమెంట్లను ఓటర్లు ఖచ్చితంగా సమర్పించాల్సిందే. పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలను సరిపోల్చి అనర్హులను తొలగిస్తున్నారు. రెండో దశలోనూ భారీగానే ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో 58 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73 లక్షల ఓట్లు తొలగించారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ భారీ సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. అస్సాం వంటి సున్నితమైన రాష్ట్రాలను ప్రస్తుతానికి ఈ ప్రక్రియ నుండి మినహాయించడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఈసీ వివరణ ఏంటి? నకిలీ ఓటర్లు, మరణించిన వాళ్లు, వలస వెళ్లిన వారిని తొలగించి ఎలాంటి నకిలీ ఓట్లు లేని దోష రహిత ఓటర్ల జాబితాను తయారు చేయడమే తమ లక్ష్యమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. కానీ ఈ ప్రక్షాళనలో పారదర్శకత లోపించిందని, సామాన్యులపై డాక్యుమెంట్ల భారం మోపి ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సర్ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు ఔట్ కొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో ఎన్నికల వేడి కంటే కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లపైనే ఆ రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. దానికి కారణం.. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండో దశ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ చేపట్టి 58 లక్షల ఓట్లను తొలగించడంతో ఇప్పుడు ఆ రాష్ట్రం ఆ ఓట్లు లేకుండానే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. తొలి దశ కార్యక్రమం నవంబర్ 4న ప్రారంభం కాగా, ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ని డిసెంబర్ 16న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అందులో 5.8 మిలియన్ పేర్లను తొలగించింది. మరో 3.1 మిలియన్ పేర్లను పక్కన పెట్టిన ఎన్నికల కమిషన్.. డిసెంబర్ 27 నుంచి అనుమానం ఉన్న ఓటర్ల డేటాను మరోసారి తనిఖీ చేసి ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను ఫిబ్రవరి 14న ఈసీ విడుదల చేయనుంది. 2026లో ఐదు రాష్ట్రాల్లో, 2027 లో ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ 'ఓట్ల ప్రక్షాళన' ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.