త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver In Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్ రూపంలో బంగారం, వెండిని కొన‌వ‌చ్చా..?

Gold And Silver In Mutual Funds | అంత‌ర్జాతీయంగా ప్ర‌స్తుతం బంగారం, వెండి ధ‌ర‌లు ఆకాశానికి ఎలా ప‌రుగులు పెడుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం ఏడాది కాలంలోనే ఈ రెండు లోహ‌ల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి.

S

Business | Published On Jan 7, 2026, 10.17 am IST

Gold And Silver In Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్ రూపంలో బంగారం, వెండిని కొన‌వ‌చ్చా..?
Advertisement

Gold And Silver In Mutual Funds | అంత‌ర్జాతీయంగా ప్ర‌స్తుతం బంగారం, వెండి ధ‌ర‌లు ఆకాశానికి ఎలా ప‌రుగులు పెడుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం ఏడాది కాలంలోనే ఈ రెండు లోహ‌ల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల్లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు, అనిశ్చితి, రాజకీయాలు, యుద్ధాలు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల బంగారం, వెండి ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య ప్ర‌జ‌లు ఈ రెండింటినీ కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అయితే బంగారం, వెండిపై పెట్టుబ‌డి పెట్టేవారు మాత్రం వీటి పెరుగుద‌ల‌తో పండ‌గ చేసుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ రెండు లోహాలు పెట్టుబ‌డిదారులకు అద్భుత‌మైన లాభాల‌ను ఈ ఏడాదిలో అందించాయి. దీంతో చాలా మంది ఈ రెండు లోహాల‌పై పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు.

ఏయే ఫండ్స్‌లో పెట్ట‌వ‌చ్చు..

అయితే బంగారం లేదా వెండిపై పెట్టుబ‌డి పెట్టాలంటే ఆ రెండు లోహాల‌ను భౌతికంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే బంగారం, వెండి బిస్కెట్లు లేదా వాటితో చేసిన ఆభ‌ర‌ణాల‌ను కొనాలి. ఇక డిజిట‌ల్ రూపంలోనూ ఈ రెండింటిలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి సౌక‌ర్యానికి త‌గిన‌ట్లు వారు ఆయా మాధ్య‌మాల్లో పెట్టుబ‌డి పెడుతుంటారు. అయితే బంగారం, వెండిని మ్యుచువ‌ల్ ఫండ్స్ రూపంలోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చా, ఆ ర‌కంగా కూడా వాటిల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా..? అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అయితే దీనికి ఆర్థిక నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు. బంగారం, వెండిల‌ను మ్యుచువ‌ల్ ఫండ్స్ రూపంలోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు. అవి కూడా భౌతిక బంగారానికి స‌మాన‌మే. అలాగే బంగారం, వెండిని సిప్ రూపంలోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌), ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్‌), సిస్ట‌మాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్స్ (ఎస్‌టీపీ), మ‌ల్టీ అలోకేష‌న్ ఫండ్స్ రూపంలో బంగారం, వెండిల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. లేదా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

యూనిట్ ప్ర‌కారం కొనుగోలు..

ఆయా ఫండ్స్ లో బంగారం, వెండిపై ప్ర‌జ‌లు ఎంతైనా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అందుకు గ‌రిష్ట ప‌రిమితి అంటూ ఏమీ లేదు. దేశంలో ఒక్కో పౌరుడి ద‌గ్గ‌ర ఉండే భౌతిక బంగారంపై గ‌రిష్ట ప‌రిమితి ఉంది. కానీ ఆయా ఫండ్స్‌లో మాత్రం వీటిల్లో ఎంతైనా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అందుకు ప‌రిమితి అంటూ ఏమీ లేదు. బంగారాన్ని ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌) లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్‌) రూపంలో కొనుగోలు చేస్తే నెట్ ఆసెట్ వాల్యూ (NA V) ఉంటుంది. ఇది ఒక యూనిట్ ప్ర‌కారం ఉంటుంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగినా, త‌గ్గినా యూనిట్ ధ‌ర‌లో మార్పు ఉంటుంది. ఈ క్ర‌మంలో పెట్టుబ‌డి దారులు తాము పెట్టిన సొమ్ముకు గాను నిర్దిష్ట‌మైనన్ని యూనిట్ల‌ను ఇస్తారు. అలా ప్ర‌జ‌లు త‌మ‌కు కావ‌ల్సిన‌ప్పుడ‌ల్లా కొన్ని యూనిట్ల‌ను కొన‌వ‌చ్చు. ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవ‌చ్చు.

మ‌ల్టీ ఆసెట్ అలొకేష‌న్ ఫండ్స్ అయితే..

ఇక మ్యుచువల్ ఫండ్స్ ద్వారా అయితే మ‌ల్టీ ఆసెట్ అలొకేష‌న్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఫండ్ మేనేజ‌ర్లు పెట్టుబ‌డి దారుల సొమ్మును ప‌లు ర‌కాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. షేర్లు, బాండ్స్‌, డెబిట్ మార్కెట్‌తోపాటు బంగారం, వెండిలో కూడా సొమ్మును విభ‌జించి పెట్టుబ‌డి పెడ‌తారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు చెందిన మొత్తం సొమ్ములో స‌గ‌టున ఆయా లోహాల‌పై 10 నుంచి 25 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డి ఉండేలా ఆయా ఫండ్స్‌కు చెందిన ఫండ్ మేనేజ‌ర్స్ చూసుకుంటారు. అలా ఈ ఫండ్స్ ప‌నిచేస్తాయి. వీటిల్లో వినియోగ‌దారులు పెట్టుబ‌డి పెడితే బంగారం, వెండిపై కూడా పెట్టుబ‌డి పెట్టిన‌ట్లే అవుతుంది. కానీ ఫండ్‌ను వివిధ విభాగాల‌కు విభ‌జిస్తారు క‌నుక వినియోగ‌దారుల సొమ్ము గ‌రిష్టంగా ఈ లోహాల‌పై 10 నుంచి 25 శాతం వ‌ర‌కు మాత్రమే పెట్టుబ‌డిగా ఉంటుంది. మిగిలిన మొత్తం ఇత‌ర విభాగాల‌పై పెట్టుబ‌డిగా ఉంటుంది. అయితే ఈ ఫండ్స్‌లో బంగారం, వెండిల‌పై పూర్తి స్థాయిలో పెట్టుబ‌డి పెట్ట‌డం ఉండ‌దు. కేవ‌లం 10 నుంచి 25 శాతం వ‌ర‌కు మాత్ర‌మే పెట్టుబ‌డి పెడ‌తారు. క‌నుక బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగినా కూడా ఈ ఫండ్స్ ద్వారా వాటికి లాభాలు పెద్ద‌గా రావు. క‌నుక ఈటీఎఫ్‌లు, ఎఫ్‌వోఎఫ్‌ల‌లో పెట్టుబ‌డి పెడితేనే మొత్తం సొమ్ము అంతా వాటిపైనే పెట్టుబ‌డిగా ఉంటుంది. దీంతో వాటి ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు లాభాలు కూడా భారీగా వ‌స్తాయి.

ప‌న్ను చెల్లించాల్సిందే..

ఇక మ‌ల్టీ ఆసెట్ అలోకేష‌న్ ఫండ్స్‌లోనూ సిప్‌లు, సిస్ట‌మాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్స్ (ఎస్‌టీపీ)ను ఎంచుకోవ‌చ్చు. నెల నెలా కొద్ది మొత్తంలో సొమ్మును వీటిలో పెట్టుబ‌డిగా పెట్ట‌వ‌చ్చు. అయితే ఆయా ఫండ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్ల‌లో వేటిలో పెట్టుబ‌డి పెట్టినా వినియోగ‌దారులు త‌మ పెట్టుబ‌డులు, లాభాల‌కు గాను క‌చ్చితంగా ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వ‌ల్ప కాలం పాటు మాత్ర‌మే.. అంటే 12 నెల‌ల కాలవ్య‌వ‌ధితో వాటిలో పెట్టుబ‌డి పెడితే షార్ట్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ప్ర‌కారం 15 నుంచి 20 శాతం మేర పన్ను చెల్లించాల్సి వ‌స్తుంది. అదే 12 నెల‌ల క‌న్నా అధిక వ్య‌వ‌ధితో వీటిల్లో పెట్టుబ‌డి పెడితే అప్పుడు లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ప్ర‌కారం ఫ్లాట్ 12.5 శాతాన్ని ప‌న్నుగా చెల్లించాల్సి ఉంటుంది. గ‌తంలో ఈ పన్నులు త‌క్కువ‌గానే ఉండేవి. కానీ ఈమ‌ధ్య‌కాలంలోనే పెంచారు. ఇలా ఎవ‌రైనా బంగారం, వెండిల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement