త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్క‌లేనంత‌మంది అవినీతి జ‌డ్జీలు.. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ధ‌న‌వంతుల‌కే అధిక ప్రాధాన్య‌త : దుష్యంత్ ద‌వే

Dushyant Dave | "సుప్రీంకోర్టు (Supreme Court)లో చాలా మంది అవినీతి జ‌డ్జీలు ఉన్నారు. వారి ప్రవర్తన వల్ల న్యాయవ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది" అంటూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ ద‌వే (Dushyant Dave) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ధ‌న‌వంతులు, అధికారంలో ఉన్న వారే మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌ను హైజాక్ చేశారని ఆరోపించారు.

D

National | Published On Sep 28, 2026, 5.04 pm IST

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్క‌లేనంత‌మంది అవినీతి జ‌డ్జీలు.. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ధ‌న‌వంతుల‌కే అధిక ప్రాధాన్య‌త : దుష్యంత్ ద‌వే
Advertisement

Dushyant Dave | సుప్రీంకోర్టు (Supreme Court)లో చాలా మంది అవినీతి జ‌డ్జీలు ఉన్నారంటూ (Supreme Court has had many corrupt judges) సీనియర్ న్యాయవాది దుష్యంత్ ద‌వే (Dushyant Dave) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వారి ప్రవర్తన వల్ల న్యాయవ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కేరళలో జరిగిన 17వ కేఎమ్‌ బషీర్ మెమోరియల్ లెక్చర్ (KM Bashir Memorial Lecture) కార్యక్రమంలో "మనం రాజ్యాంగాన్ని విఫలం చేస్తున్నామా లేదా రాజ్యాంగమే మనల్ని విఫలం చేసిందా?" అనే అంశంపై ఆయ‌న ప్ర‌సంగించారు.

"సుప్రీంకోర్టులో కొందరు అసాధారణమైన న్యాయమూర్తులు ఉన్నప్పటికీ.. నా 48 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వృత్తిలో ఎంతో మంది అవినీతి జడ్జీలను చూశాను. వారి సంఖ్య‌ను లెక్కించ‌డం కూడా క‌ష్ట‌మే. వారి వ‌ల్ల న్యాయ‌వ్య‌వ‌స్థ‌, న్యాయానికి తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంది. ధ‌న‌వంతులు, అధికారంలో ఉన్న వారే మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌ను హైజాక్ చేశారు. న్యాయవ్యవస్థ ధనవంతులు, శక్తిమంతులకు అనుకూలంగా మారింది. సాధారణ పౌరులకు లభించని ప్రాధాన్యత వారికి దక్కుతోంది. వారి కేసులు కూడా చాలా వేగంగా విచారణకు వస్తున్నాయి.. అన్ని తీర్పులూ వారికే అనుకూలంగా వ‌స్తున్నాయి" అని ఆయన ఆరోపించారు.

దేశంలో ప‌రిస్థితులు అదుపుతప్పాయి

గ‌త 12 ఏళ్లుగా దేశంలో ప‌రిస్థితులు అదుపుత‌ప్పుతున్నాయ‌ని ద‌వే ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కార్యనిర్వాహక వర్గం (Executive) శృతిమించిన అధికారాలు చెలాయించడం కేవలం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కాలానికే పరిమితం కాలేద‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలోనూ ఇది కొనసాగుతోంద‌ని చెప్పారు. పౌరుల‌ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న సుప్రీంకోర్టు కనీసం జోక్యం చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేద‌ని విమ‌ర్శించారు.

సుప్రీం వైఖ‌రి ఆందోళ‌న‌క‌రం

అదేవిధంగా దేశ‌వ్యాప్తంగా వివాదాస్ప‌దంగా మారిన‌ స‌ర్ ప్ర‌క్రియ ప‌ట్ల సుప్రీంకోర్టు వైఖరిని ద‌వే తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వల్ల దేశంలో రాజ్యాంగబద్ధంగా లభించిన వయోజన ఓటు హక్కు (Universal Adult Franchise) కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరిట కోట్లాది మంది ఓటర్ల హక్కులను కాలరాస్తున్నా సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించిందని మండిప‌డ్డారు.

ఒక్క మ‌హిళ‌కూ అవ‌కాశం ఇవ్వ‌లేదు..

మాజీ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ త‌న ప‌ద‌వీకాలంలో 17 మంది సుప్రీంకోర్టు జ‌డ్జీల‌ను నియ‌మించిన‌ప్ప‌టికీ.. ఒక్క మ‌హిళ‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ద‌వే ఈ సంద‌ర్భంగా విమ‌ర్శించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయవ్యవస్థలో త‌గిన ప్రాతినిధ్యం ల‌భించిన‌ప్పుడే.. సమాజంలోని క్షేత్రస్థాయి సమస్యలు, వాటి సున్నితత్వం న్యాయమూర్తులకు అర్థమవుతాయని స్పష్టం చేశారు. తద్వారా సమర్థవంతమైన న్యాయం అందుతుందని స్పష్టం చేశారు.

మీడియాపై తీవ్ర విమర్శలు

మీడియాపై కూడా ద‌వే తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, పేద‌రికం, వ్య‌వ‌సాయ సంక్షోభం వంటి కీల‌క స‌మ‌స్య‌ల‌పై మీడియా ఎలాంటి వాస్త‌వాల‌నూ ప్ర‌సారం చేయ‌డం లేదని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి.. ఇతర అనవసరమైన అంశాలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విమ‌ర్శించారు. మీడియా ప్ర‌జాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉంటూ ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డాల‌ని అన్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఉన్న వాస్త‌వ ప‌రిస్థితుల‌ను చూపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంద‌ని ఆక్షేపించారు. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధాని మోదీ ఒక్క‌సారి కూడా మీడియా ముందుకొచ్చి ప్ర‌త్య‌క్ష ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. దుష్యంత్ ద‌వే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో న్యాయవ్యవస్థ జవాబుదారీతనం, పారదర్శకతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read..

టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నిక‌ల సంఘానికి సుప్రీం కీల‌క ఆదేశాలు

ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - సినిమాల‌కు మించి రెమ్యూన‌రేష‌న్‌?

ట్రూకాలర్‌ కొత్త టూల్‌.. ఫోన్ నంబర్, లింక్‌, మెసేజ్‌ల‌ను చెక్ చేయొచ్చు..

Advertisement
Advertisement