త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rafale fighter jets | ర‌ఫేల్ యుద్ధ‌విమానాలు అదృశ్య‌మంటూ వార్త‌లు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Rafale fighter jets | ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) స‌మ‌యంలో భార‌త్‌కు చెందిన నాలుగు ర‌ఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter jets) అదృశ్య‌మ‌య్యాయంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను రిటైర్డ్ ఎయిర్ మార్షల్ (former IAF vice chief) నర్మదేశ్వర్ తివారీ (Narmdeshwar Tiwari) ఖండించారు. ఈమేర‌కు బ్రిటిష్ ఏవియేషన్ మ్యాగజైన్ (British aviation magazine) గ‌ణాంకాలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని కొట్టిపారేశారు.

D

National | Published On Nov 20, 2026, 5.55 pm IST

Rafale fighter jets | ర‌ఫేల్ యుద్ధ‌విమానాలు అదృశ్య‌మంటూ వార్త‌లు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
Advertisement

Rafale fighter jets | త్రినేత్ర న్యూస్ : గ‌తేడాది జ‌రిగిన పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌పై చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) స‌మ‌యంలో భార‌త్‌కు చెందిన నాలుగు ర‌ఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter jets) అదృశ్య‌మ‌య్యాయంటూ బ్రిటిష్ ఏవియేషన్ మ్యాగజైన్ (British aviation magazine) సంచ‌ల‌న నివేదిక‌ను ప్ర‌చురించింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన 36 రఫేల్ విమానాలకు బదులుగా.. ప్రస్తుతం 32 మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయని ఆ నివేదిక స్ప‌ష్టం చేసింది.

బ్రిటిష్ ఏవియేషన్ మ్యాగజైన్ FlightGlobal తాజాగా విడుదల చేసిన 'వరల్డ్ ఎయిర్ ఫోర్సెస్ 2027' డైరెక్టరీలో (World Air Forces directory) భారత వైమానిక దళం వద్ద 32 రఫేల్ యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నట్లు జాబితా చేసింది. అయితే, నాలుగు విమానాలు తగ్గడానికి గల కారణాలను కానీ, అందుకు త‌గిన ఆధారాల‌ను గానీ ఫ్లైట్ గ్లోబ‌ల్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించ‌లేదు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై వివాదం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలో ఫ్లైట్ గ్లోబ‌ల్ నివేదిక‌పై సిందూర్ స‌మ‌యంలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా పనిచేసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ (former IAF vice chief) నర్మదేశ్వర్ తివారీ (Narmdeshwar Tiwari) ఘాటుగా స్పందించారు. ఈ గ‌ణాంకాలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని కొట్టిపారేశారు. ఆ ఏవియేషన్ మ్యాగజైన్ మూలాల విశ్వసనీయతను తీవ్రంగా ప్ర‌శ్నించారు.

స‌ద‌రు సంస్థ త‌న మూలాల‌ను పునఃప‌రిశీలించుకోవాల‌ని సూచించారు. గ‌తేడాది పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణల సమయంలో కూల్చివేయబడ్డాయని చెబుతున్న రఫేల్ విమానాల నిర్దిష్ట టెయిల్ నంబర్లను కూడా ఇవే మూలాలు గతంలో అందించాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆయా టెయిల్ నంబర్లు (Tail Numbers) ఉన్న విమానాలు సిందూర్ త‌ర్వాత కూడా అంత‌ర్జాతీయ విన్యాసాలు స‌హా ప‌లు కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

గ‌తేడాది ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో భారత వైమానిక దళపు తొలి మహిళా రఫేల్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌ను పాకిస్థాన్ బంధించిందంటూ వచ్చిన వార్తలపై కూడా ఎయిర్ మార్షల్ ప్రస్తావించారు. అవ‌న్నీ త‌ప్పుడు వాద‌న‌లేన‌ని స్ప‌ష్టం చేశారు. శివాంగి సింగ్‌ను యుద్ధ ఖైదీగా పట్టుకున్నారని కూడా ఇవే మూలాలు చెప్పాయని.. అయితే, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో మ‌నంద‌రికీ తెలుసు అని ఫ్లైట్‌గ్లోబల్ నివేదికకు ఎయిర్ మార్షల్ తివారీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

కాగా, మూడు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో ఆమె విమానం కూలిపోయిందని, ఆమెను యుద్ధ ఖైదీగా పట్టుకున్నారని పలు పాకిస్థానీ నివేదికలు పేర్కొన్న విష‌యం తెలిసిందే. అప్పట్లోనే ఆ వాదనలను భారత వైమానిక దళం పూర్తిగా ఖండించింది. ఆ తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ.. గ‌తేడాది అక్టోబర్‌లో హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రఫేల్ విమానంలో ప్రయాణించినప్పుడు స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ స్వయంగా దిగిన ఫొటోను రిలీజ్ చేసి పాక్ నోరు మూయించింది.

Also Read..

ఆ విష‌యం తేల్చ‌కుండా.. ఇళ్ల కొనుగోలుదారుల‌పై బ‌ల‌వంత‌పు రిక‌వ‌రీలు వ‌ద్దు

కీర్తి సురేష్‌, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాట‌తో ప్ర‌మోష‌న్స్ షురూ

ఇక‌నైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Advertisement
Advertisement