త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prashant Kishor | బీజేపీ కంచుకోటపై ప్రశాంత్ కిషోర్ కన్ను.. బరిలో ‘జన్ సురాజ్’.. కులమత రాజకీయాలకు చెక్ పెట్టేందుకేనా?

బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం. సేఫ్ సీటు వదిలేసి, బీజేపీకి కంచుకోట లాంటి బంకీపూర్ నుంచే ఎందుకు పోటీకి దిగుతున్నారో తెలుసా?

J

National | Published On Jul 6, 2026, 3.53 pm IST

Prashant Kishor | బీజేపీ కంచుకోటపై ప్రశాంత్ కిషోర్ కన్ను.. బరిలో ‘జన్ సురాజ్’.. కులమత రాజకీయాలకు చెక్ పెట్టేందుకేనా?
Advertisement
  • బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జూలై 30న ఉప ఎన్నిక
  • బీజేపీకి కంచుకోట అయిన ఈ స్థానం నుంచి 'జన్ సురాజ్' వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పోటీ
  • కుల, మత రాజకీయాలకు చెక్ పెట్టి, బీహార్‌లో మార్పు తేవడానికే ఈ టఫ్ సీటును ఎంచుకున్నట్లు పీకే వెల్లడి
  • పీకే నిర్ణయంపై బీజేపీ నేతలు గిరిరాజ్ సింగ్, సంజయ్ సరావగిల ఫైర్
  • ఎన్డీయే అభ్యర్థే గెలుస్తారని ధీమా

Prashant Kishor | త్రినేత్ర.న్యూస్ : ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బీహార్ రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే బంకీపూర్ అసెంబ్లీ బై-ఎలక్షన్‌లో ఆయన స్వయంగా బరిలోకి దిగుతున్నారు. అయితే అందరిలాగా గెలుపు ఈజీగా ఉండే 'సేఫ్ సీటు'ను కాకుండా.. ఏళ్ల తరబడి బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానాన్ని ఆయన ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కుల, మతాలకు అతీతంగా బీహార్ ఓటర్లు ఆలోచించాలనే బలమైన సందేశాన్ని ఇవ్వడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. సోమవారం ఏఎన్‌ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. లాలు ప్రసాద్ యాదవ్ లేదా బీజేపీ అంటే ఉన్న భయంతో గుడ్డిగా ఓట్లు వేయడం ఆపేయాలని ప్రజలను కోరారు.

బంకీపూర్‌నే ఎందుకు ఎంచుకున్నారు?

పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బంకీపూర్.. బీజేపీకి అత్యంత పటిష్టమైన అర్బన్ ఓటు బ్యాంకు ఉన్న స్థానం. 2010 నుంచి ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు.

"రాజకీయాల్లోకి రాగానే ఎవరైనా ముందుగా తమకు సేఫ్ సీటు ఎక్కడ ఉందా అని చూసుకుంటారు. కానీ నేను దానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నాను. బీహార్ మారాలంటే కుల, మతాలకు అతీతంగా ఓటెయ్యాలి. బీజేపీకి భయపడి లాలుకు.. లాలుకి భయపడి బీజేపీకి ఓటేయడం మారాలి. అందుకే నా వాదనను నిరూపించుకునేందుకు ఈ టఫ్ సీటును ఎంచుకున్నాను" అని పీకే వివరించారు. ఈ ఎన్నిక బీహార్‌లో ఒక కొత్త రాజకీయ ఒరవడి (New Political Order) సృష్టించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జూలై 30న పోలింగ్..

కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బీహార్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. బంకీపూర్ నియోజకవర్గంలో జూలై 30న పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానం ఖాళీ అయింది.

గత ఎన్నికల్లో నితిన్ నబిన్ భారీ మెజార్టీలతో గెలుపొందారు. 2020లో కాంగ్రెస్ అభ్యర్థి లవ్ సిన్హాపై 59% ఓట్ల ఆధిక్యంతో, అలాగే 2025లో ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిపై 51,936 ఓట్ల మెజార్టీతో గెలిచి బంకీపూర్‌ను బీజేపీకి సేఫ్ సీటుగా మార్చారు.

భగ్గుమన్న బీజేపీ నేతలు..

ప్రశాంత్ కిషోర్ పోటీపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "జన్ సురాజ్ అసలు రంగు బయటపడింది. వాళ్లు బీజేపీ కార్యకర్తలను తిట్టడం మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికల ముందే వాళ్ల దుకాణం బంద్ కావడం ఖాయం" అని విమర్శించారు.

మరోవైపు, బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్ సరావగి స్పందిస్తూ.. ఇతర పార్టీలు ఏవి పోటీ చేసినా బంకీపూర్ ప్రజలు బీజేపీ నాయకత్వానికే మద్దతు ఇస్తారని, ఎన్డీయే (NDA) అభ్యర్థి మరోసారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement