త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | వేదిక‌పై వృద్ధుడి కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్న ప్ర‌ధాని మోదీ.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో తెలుసా..?

PM Modi | బెంగాల్ సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వేదిక‌పై ప్ర‌ధాని మోదీ.. 97 ఏళ్ల వృద్ధుడి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు.

D

National | Published On May 9, 2026, 2.06 pm IST

PM Modi | వేదిక‌పై వృద్ధుడి కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్న ప్ర‌ధాని మోదీ.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో తెలుసా..?
Advertisement

PM Modi | ప‌శ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 9వ సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi).. వేదిక‌పై 97 ఏళ్ల వృద్ధుడి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు. అంతేకాదు, ఆయ‌న‌కు వేదిక‌పైనే శాలువా క‌ప్పి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. దీంతో ఆ పెద్దాయ‌న ఎవ‌రా అని నెటిజ‌న్లు తెగ ఆరా తీస్తున్నారు.

ఆ పెద్దాయ‌న పేరు మఖన్ లాల్ సర్కార్ (Makhan Lal Sarkar). సిలిగురి (Siliguri) నివాసి. బీజేపీ సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రు. సిలిగురి ఆర్గనైజేషనల్ డిస్ట్రిక్ట్‌కు సర్కార్ మొట్టమొదటి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. శ్యామ్‌ ప్రసాద్ ముఖర్జీకి సర్కార్ స‌హాయ‌కుడిగా ఉండేవారు. 1952లో శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చేప‌ట్టిన చారిత్మాత్మ‌క క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌కు స‌ర్కార్ తోడుగా ఉన్నారు. అక్క‌డ భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన ఘ‌ట‌న‌లో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.

1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత.. స‌ర్కార్‌ పశ్చిమ దినాజ్‌పూర్, జల్పాయ్‌గురి, డార్జీలింగ్ జిల్లాలకు ఆర్గనైజేషనల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఏడాది వ్య‌వ‌ధిలోనే సుమారు 10,000 మంది సభ్యుల‌ను పార్టీలోకి తీసుకురావ‌డంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1981 నుంచి వ‌రుస‌గా ఏడేళ్ల‌పాటూ ఆయ‌న జిల్లా అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు. సాధారణంగా బీజేపీ నాయకులు ఒకే సంస్థాగత పదవిలో రెండేళ్లకు మించి ఉండని ఆ రోజుల్లో.. ఏకంగా ఏడేళ్లు ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉండ‌టం చిన్న విష‌యం కాదు. దీన్నిబ‌ట్టే అర్థ‌మ‌వుతోంది బీజేపీలో ఆయ‌న ఎంత కీల‌క నేతో. అందుకే రాష్ట్రంలో తొలిసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంద‌ర్భంగా.. క‌మ‌లం పార్టీ స‌ర్కార్‌ను ఆహ్వానించి ఆయ‌న్ని ఘ‌నంగా స‌త్క‌రించింది.

ప్రజలకు సాష్టాంగ న‌మ‌స్కారం..

అదేవిధంగా బెంగాల్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్య‌లో హాజరైన ప్రజలను చూసి మోదీ ముందుగా చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అనంతరం మోకాళ్లపై కూర్చుని, చేతులు జోడించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్ర‌తిప‌క్షాల కంచుకోటను బీజేపీ (BJP) బ‌ద్ద‌లు కొట్టింది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు కాషాయ పార్టీ ఘనంగా ముగింపు పలికింది. 294 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఏకంగా 206 స్థానాల్లో జ‌య‌భేరి మోగించి అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఫ‌లితంగా బెంగాల్‌లో బీజేపీ తొలిసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంత అఖండ విజ‌యాన్ని అందించిన ప్ర‌జ‌ల‌కు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement
Advertisement