త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఎమ‌ర్జెన్సీ రాజ్యాంగంపై జ‌రిగిన ప్ర‌త్య‌క్ష దాడి : ప్ర‌ధాని మోదీ

PM Modi | "ఎమర్జెన్సీ మన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి. ఆ కాలంలో పౌర హక్కుల నిలిపివేశారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల‌ను అరెస్టు చేశారు. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థలపై దాడులు జరిగాయి" అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి నేటితో ఐదు ద‌శాబ్దాలు (Emergency anniversary) పూర్తైన సంద‌ర్భంగా ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

D

National | Published On Jun 25, 2026, 11.37 am IST

PM Modi | ఎమ‌ర్జెన్సీ రాజ్యాంగంపై జ‌రిగిన ప్ర‌త్య‌క్ష దాడి : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | 1975లో ఇందిరా గాంధీ హ‌యాంలో దేశంలో విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని రాజ్యాంగంపై జ‌రిగిన ప్ర‌త్య‌క్ష దాడిగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అభివ‌ర్ణించారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో పౌరుల హ‌క్కుల‌ను నిలిపివేశార‌ని, భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పై ఆంక్ష‌లు, భార‌త ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభాలుగా ఉన్న సంస్థ‌ల‌పై దాడులు జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన, వివాదాస్పద ఘట్టంగా నిలిచిన 'అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ) విధించి నేటితో ఐదు దశాబ్దాలు పూర్తైన సంద‌ర్భంగా ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

"ఎమర్జెన్సీ మన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి. ఆ కాలంలో పౌర హక్కుల నిలిపివేశారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల‌ను అరెస్టు చేశారు. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థలపై దాడులు జరిగాయి. అదే సమయంలో మౌనంగా ఉండటానికి నిరాకరించి దేశ రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను నిలబెట్టిన వారి అసాధారణ ధైర్యాన్ని కూడా ఈ ఎమర్జెన్సీ గుర్తుచేసింది. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భార‌తీయుల ఆకాంక్ష‌లు, హ‌క్కులు, విధుల‌కు ఒక స‌జీవ రూపం. రాజ్యాంగ విలువలను కాపాడటానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. రాజ్యాంగం స్ఫూర్తితో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే దేశాన్ని నిర్మిస్తాం. సంవిధాన్ హత్యా దివస్ ఎమ‌ర్జెన్సీ నాటి చీక‌టి కాలాన్ని అందరికీ గుర్తు చేస్తుంది" అని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ప్ర‌ధాన మంత్రితోపాటూ ప‌లువురు కేంద్ర మంత్రులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు సైతం ఎమ‌ర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 1975 నాటి ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నవారు నిరంకుశంగా మారినప్పుడు పౌరుల ప్రాణాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు, రాజ్యాంగ విలువలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని ఎమర్జెన్సీ మనకు గుర్తు చేస్తుంద‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా నిలిచిన వారంద‌రికీ దేశం రుణ‌ప‌డి ఉంటుంద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని, బలోపేతం చేయాలని, గౌరవించుకోవాలని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement